రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రక్షణ… భద్రతలతో నిశ్చింతగా ప్రయాణంపై ప్రజలకు రైల్వేల భరోసా


· రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్‌) ద్వారా 2025 జనవరి-అక్టోబరు మధ్య నేరాల గుర్తింపు-నిరోధం… విలువైన వస్తువుల వాపసు.. దుర్బల బాలలకు రక్షణ

· ‘ఆపరేషన్‌ నన్హే ఫరిష్తే’ కింద 16,450 మంది బాలలను రక్షించిన ఆర్పీఎఫ్‌… ఒక్క అక్టోబరు మాసంలోనే 1,586 మందికి రక్షణ

· ‘మిషన్‌ జీవన్ రక్ష’ కింద 2,658 మందిని కాపాడగా… వీరిలో ఒక్క అక్టోబరులోనే 296 మందికి రక్షణ

· ‘ఆపరేషన్‌ నార్కోస్’ కింద మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం… మొత్తం ₹197.19 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు-మానసిక దౌర్బల్యం కలిగించే పదార్థాల స్వాధీనం: ఒక్క అక్టోబరులోనే ₹14.68 కోట్ల విలువైన ‘ఎన్‌డీపీఎస్‌’ పట్టివేత

· ‘ఆపరేషన్ అమానత్’ కింద ప్రయాణికులు వదిలివేసిన ₹70.66 కోట్ల విలువైన 42,210 వస్తువుల స్వాధీనం-అప్పగింత… వీటిలో అక్టోబరు నెలలో కనుగొన్న వస్తువుల విలువ ₹8.65 కోట్లు

Posted On: 11 NOV 2025 7:41PM by PIB Hyderabad

భారతీయ రైల్వేల ఆస్తులతోపాటు స్టేషన్లలో ప్రయాణిక వసతి ప్రాంతాల రక్షణ, ప్రయాణ భద్రతకు భరోసా ఇచ్చే విధుల్లోగల రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్‌) అహర్నిశలూ అసమాన రీతిలో తన కర్తవ్యం నిర్వర్తిస్తోంది. ముఖ్యంగా పటిష్ఠ రక్షణ, భద్రతతో ప్రజలు నిశ్చింతగా ప్రయాణించేలా భరోసా ఇస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వేలకు గల విస్తృత ఆస్తులను కాపాడటం, సురక్షిత సరకు రవాణాకు తోడ్పడటమే కాకుండా నేరాల గుర్తింపు-నిరోధంలోనూ సమర్థంగా వ్యవహరిస్తోంది. మొత్తం మీద భారతీయ రైల్వేలు, ఆర్పీఎఫ్‌ మధ్య చక్కని సమన్వయంతో 2025 జనవరి-అక్టోబరు మధ్య (10 నెలల) కాలంలో గణనీయ ఫలితాలు నమోదయ్యాయి.

వివిధ అంశాలలో సాధించిన విజయాలు కింది విధంగా ఉన్నాయి:

1.    ఆపరేషన్ నన్హే ఫరిష్తే

దేశవ్యాప్తంగా వివిధ పరిస్థితులు, కారణాలతో తప్పిపోయిన లేదా అదృశ్యమైన బాలలను వారి కుటుంబాలతో కలపడంలో ‘ఆర్పీఎఫ్‌’ కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా సంరక్షణ-చేయూత అవసరమైన దుర్బల బాలల రక్షణ-భద్రతలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వేలు ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీనికింద ఈ ఏడాది 10 నెలల వ్యవధిలో మొత్తం 16,450 మంది బాలలను రక్షించగా- వీరిలో 11,543 మంది బాలురు, 4,906 మంది బాలికలు, 1 ఇతర వ్యక్తి ఉన్నారు. వీరందర్నీ వారి కుటుంబాల వద్దకు చేర్చడం కోసం సంబంధిత అధికారులకు ఆర్పీఎఫ్‌ అప్పగించింది. వీరిలో ఒక్క అక్టోబరు నెలలోనే 1,085 మంది బాలురు, 501 మంది బాలికలు సహా 1,586 మంది పిల్లలను రక్షించారు.

2.    మిషన్‌ జీవన్ రక్ష

రైలు పట్టాలపై మరణాల నివారణ లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్‌ జీవన్‌ రక్ష’ కింద ఆపదలో చిక్కుకున్న వ్యక్తుల రక్షణలో ఆర్పీఎఫ్‌ కీలకంగా వ్యవహరించింది. ఈ 10 నెలల వ్యవధిలో 1,757 మంది పురుషులు, 901 మంది మహిళలు సహా మొత్తం 2,658 మంది ప్రాణాలను సిబ్బంది కాపాడారు. ఒక్క అక్టోబరులోనే 191 మంది పురుషులు, 105 మంది మహిళలు సహా 296 మందిని రక్షించారు.

3.    ఆపరేషన్ నార్కోస్

‘నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్‌) చట్టం’ కింద 2019 ఏప్రిల్ నుంచి ఆర్పీఎఫ్‌ సిబ్బందికి తనిఖీ, స్వాధీనం, అరెస్టు అధికారాలను దఖలు పరిచారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను నిరోధించే దిశగా ప్రభుత్వ కృషికి ఈ చర్య ఎంతగానో దోహదం చేసింది. తదనుగుణంగా రైల్వేల పరిధిలో ‘ఆపరేషన్ నార్కోస్’ కింద పది నెలల కాలంలో మొత్తం 1,794 కేసులను ఆర్పీఎఫ్‌ ఛేదించింది. మొత్తం ₹197.19 కోట్ల విలువైన ‘ఎన్‌డీపీఎస్‌’ స్వాధీనం చేసుకోవడంతోపాటు 1,450 మందిని అరెస్టు చేయగా, ఒక్క అక్టోబరులోనే 140 కేసులను ఛేదించి, ₹14.68 కోట్ల విలువైన ‘ఎన్‌డీపీఎస్‌’ స్వాధీనం సహా 133 మందిని అరెస్టు చేశారు.

4.    ఆపరేషన్ అమానత్

రైళ్లలో, రైల్వే స్టేషన్లలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను వాటి అసలు యజమానులకు అప్పగించడం లక్ష్యంగా ఆర్పీఎఫ్‌ చేపట్టిన ‘ఆపరేషన్ అమానత్’ కార్యక్రమం అద్భుత ఫలితాలిచ్చింది. ఈ ప్రయాణిక-కేంద్రక చర్యలతో అనేక మంది ప్రయాణికులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి వారికి చేర్చారు. గడచిన 10 నెలల వ్యవధిలో ప్రయాణికులు వదిలివేసిన ₹70.66 కోట్ల విలువైన 42,210 వస్తువులను కనుగొని, వాటిని అసలైన యజమానులకు అప్పగించారు. ఇందులో ఒక్క అక్టోబరు మాసంలోనే దాదాపు ₹8.65 కోట్ల విలువైన 7,894 వస్తువులను యజమానులకు వాపసు చేశారు.

ప్రతి పౌరుడికీ రక్షణ, భద్రత, నిశ్చింతతో కూడిన ప్రయాణానుభవం దిశగా భారతీయ రైల్వేలు, ఆర్పీఎఫ్‌ చూపుతున్న తిరుగులేని నిబద్ధతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఇతర ప్రభుత్వ-ప్రైవేటు సంస్థలతో సన్నిహిత సమన్వయం ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మేరకు దుర్బలులను కాపాడటం, ప్రాణరక్షణ సహా మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం కూడా సమర్థంగా సాగుతోంది. ప్రతి ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా, ఆందోళన రహితంగా ఉండేలా భారతీయ రైల్వేలు చూపుతున్న శ్రద్ధకు ఇదే నిదర్శనం.

 

***


(Release ID: 2189039) Visitor Counter : 11