జౌళి మంత్రిత్వ శాఖ
రక్షణకు సంబంధించిన వస్త్రాలకు స్వదేశీ ఉష్ణ పరీక్షా పరికరాల అభివృద్ధికి నిట్రాకు జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ మద్దతు పూర్తి స్వదేశీ రూపకల్పన, సాంకేతికతతో దిగుమతి వస్తువుల కంటే తక్కువ ధర, మెరుగైన పనితీరు
Posted On:
06 NOV 2025 7:04PM by PIB Hyderabad
రక్షణ వస్త్రాలకు సంబంధించి వినిమయ, వికిరణ, వాహకత ద్వారా వచ్చే వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించేందుకు 3 స్వదేశీ పరికరాలను విజయవంతంగా అభివృద్ధి చేయటానికి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ (ఎన్‌టీటీఎం) సహకరించింది. నార్తర్న్ ఇండియా టెక్స్ టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (ఎన్ఐటీఆర్ఏ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న ప్రాజెక్ట్, భారత సాంకేతిక వస్త్ర రంగంలో స్వయంసమృద్ధి పరీక్షా సామర్థ్యాలను పెంపొందించటంలో కీలక ముందడుగు.
ఎన్‌టీటీఎం ఆధ్వర్యంలో “రక్షణాత్మక వస్త్రాల ఉష్ణ వినిమయ, ఉష్ణ వికిరణ, ఉష్ణ వాహకత లక్షణాలను పరీక్షించేందుకు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆధునిక పరికరాలు” అనే ప్రాజెక్టు ద్వారా మూడు పరీక్షా వ్యవస్థలను అభివృద్ధి చేశారు. అవి.. ఉష్ణ వినిమయ హీట్ టెస్టర్ (ఐఎస్ఓ 9151), ఉష్ణ వికిరణ హీట్ టెస్టర్ (ఐఎస్ఓ 6942), ఉష్ణ వాహకత హీట్ టెస్టర్ (ఐఎస్ 12127). అగ్నిమాపక సిబ్బంది దుస్తులు, పారిశ్రామిక రంగంలో ఉ పయోగించే భద్రతా దుస్తులు, సైనికరంగంలో వినియోగించే వస్తువుల్లోని ఉష్ణ నిరోధక లక్షణాలను అంచనా వేసేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి. ఈ రంగాల్లో వేడి నుంచి రక్షణ చాలా కీలకమైనది.
స్వదేశీ రూపకల్పన, సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ పరికరాలు దిగుమతి వస్తువుల కంటే తక్కువ ధర, మెరుగైన పనితీరుని కనబరుస్తాయి. దిగుమతి నమూనాలకు రూ.15-40 లక్షల ధర ఉంటే, వీటి ధర కేవలం రూ.5-10 లక్షలు మాత్రమే. ధర తక్కువ, తయారీ సమయం కూడా తగ్గటం వల్ల ఎక్కువ పరిశ్రమలు, సంస్థలు ఇకపై మెరుగైన నాణ్యతా పరీక్షలను సులభంగా పొందవచ్చు.
భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా సాంకేతికతను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ఘజియాబాద్లోని ఏషియన్ టెస్ట్ ఎక్విప్మెంట్ సంస్థకు విజయంతంగా బదిలీ చేశారు. కాన్పూర్‌లోని ఏస్
ఇన్‌కార్పొరేషన్, ఢిల్లీ డీఆర్‌డీఓలోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)లో ఇప్పటికే ఈ సాంకేతికతతో తయారైన పరికరాలను ఏర్పాటు చేసి, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించారు. ఇప్పుడవి ట్రేడ్ ఇండియా, ఇండియామార్ట్, అలీబాబా వేదికల్లో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి.
దేశీయ లభ్యత కారణంగా పరీక్షలకు సమయం 30 రోజుల నుంచి 3-5 రోజులకు తగ్గిపోయింది. పరీక్షకు అయ్యే ఖర్చు ఒక్కో నమూనాకు రూ.25,000-రూ.40,000 నుంచి రూ.6,000-10,000కు తగ్గింది. దీంతో భారత తయారీదారులు, ఆర్ అండ్ డీ సంస్థలకు ఈ పరికరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి.
ఈ వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు సీఎఫ్ఈఈఎస్, డీఆర్‌డీఏ వంటి సంస్థలు తెలిపారు. ఎన్‌ఐటీఆర్ఏ వివరాల ప్రకారం, గతంలో దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించిన అనుభవం ఆధారంగా ఈ కొత్త యంత్రాలను తయారుచేశారు. దీనివల్ల దేశానికి సాంకేతిక స్వావలంబన పెరగటమే కాక, నాణ్యత కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.
ఎన్‌టీటీఎం నిధులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు విజయంతో, భారతదేశంలో సాంకేతిక వస్త్రాల తయారీకి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రంగంలో ఆవిష్కరణలు సుస్థిరత, స్వావలంబనను ప్రోత్సహించాలన్న జాతీయ లక్ష్యానికి ఊతమిచ్చినట్లు అవుతుంది.
***
(Release ID: 2187676)
Visitor Counter : 5