ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘స్వస్త్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్’ కింద మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పిన భారత్
प्रविष्टि तिथि:
31 OCT 2025 7:27PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘స్వస్త్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ (ఎస్ఎన్ఎస్‌పీఏ)’లో మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. నివారణ, మహిళా కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ పట్ల భారత్‌కు ఉన్న సాటిలేని నిబద్ధతను ఇది తెలియజేస్తోంది.
రికార్డులు ఈ విధంగా ఉన్నాయి:
* ఆరోగ్య సంరక్షణ వేదికగా ఒక నెలలో అత్యధిక నమోదులు – 3,21,49,711 (మూడు కోట్ల 21 లక్షల 49 వేల 711 మంది)
* రొమ్ము క్యాన్సర్ పరీక్ష కోసం ఒక వారంలో ఆన్‌లైన్‌లో అత్యధిక నమోదులు – 9,94,349 (తొమ్మిది లక్షల 94 వేల 349 మంది)
* కీలక పరీక్షల కోసం ఒక వారంలో ఆన్‌లైన్‌లో అత్యధిక నమోదులు (రాష్ట్ర స్థాయిలో) – 1,25,406 (ఒక లక్ష 25 వేల 406 మంది)
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోషణ్ మాసానికి అనుగుణంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘స్వస్త్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మహిళలు, కౌమార బాలికలు, పిల్లల ఆరోగ్యం, పోషకాహారాలపై దృష్టి సారిస్తోంది. త్వరగా వ్యాధులను గుర్తించడం, అవసరమైన ఆరోగ్య సేవలను అందించడం, సామర్థ్యంతో ఆరోగ్యంగా ఉండే భారత్ కోసం మంచి జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
సేవను సంకల్పంగా 'దేశమే ప్రథమం' అనే స్ఫూర్తిని తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. "మన తల్లులు, ఆడపడుచులు, మన మహిళా శక్తి మన దేశ ప్రగతికి పునాది. ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది." అని వ్యాఖ్యానించారు.
దేశంలోని ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు జరిగాయి. అన్ని ఆరోగ్య సంరక్షణ వేదికలలో 11 కోట్లకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. మొత్తంగా ఈ పథకం అపూర్వమైన స్థాయిలో విజయాన్ని సాధించింది.
ఈ కార్యక్రమంలో 20కి పైగా మంత్రిత్వ శాఖలు క్రియాశీలకంగా పాల్గొన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వైద్య కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు కూడా ఇందులో పాలుపంచుకోవటంతో ఇది ఏకోన్ముఖ ప్రభుత్వ కార్యక్రమంగా మారింది.
ఏకోన్ముఖ సమాజం అనే విధానాన్ని అనుసరించడం వల్ల ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కనిపించింది. ఇందులో 5 లక్షలకు పైగా పంచాయతీ రాజ్ ప్రతినిధులు, 1.14 కోట్లకు పైగా పాఠశాల- కళాశాల విద్యార్థులు, 94 లక్షల స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ) సభ్యులు, 5 లక్షల ఇతర సామాజిక వేదికల సభ్యులు పాల్గొన్నారు. తద్వారా ఇది అత్యంత భారీ సామాజిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో భాగంగా 1.78 కోట్లకు పైగా అధిక రక్తపోటు పరీక్షలు, 1.73 కోట్ల మధుమేహం పరీక్షలు, 69.5 లక్షల నోటి క్యాన్సర్ పరీక్షలు, 62.6 లక్షల ప్రసవ పూర్వ సంరక్షణ పరీక్షలు, 1.51 కోట్ల రక్తహీనత పరీక్షలు, 85.9 లక్షలకు పైగా మహిళలకు క్షయ వ్యాధి పరీక్షలు, 10.2 లక్షల మందికి సికిల్ సెల్ వ్యాధి పరీక్షలను నిర్వహించారు. 1.43 కోట్ల టీకా మోతాదులను పంపిణీ చేయగా.. 2.14 కోట్ల మంది కౌన్సెలింగ్, ఆరోగ్య సంరక్షణ సెషన్లకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు 2.68 లక్షలకు పైగా నిక్-శయ్ మిత్రాలు నమోదు చేసుకున్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు చురుగ్గా పాలుపంచుకున్నారు.
గిన్నీస్ సంస్థ నుంచి వచ్చిన ఈ గుర్తింపు.. ప్రభుత్వ వ్యవస్థలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, సామాజిక భాగస్వామ్యాన్ని మిళితం చేస్తూ ‘ఆరోగ్యవంతులైన మహిళలు, సాధికారత పొందిన ఇళ్లు, వికసిత్ భారత్"ను తయారుచేసేందుకు భారత్ చేసిన సామూహిక కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.
***
(रिलीज़ आईडी: 2185542)
आगंतुक पटल : 20