లోక్‌సభ సచివాలయం
                
                
                
                
                
                    
                    
                        ఆర్థికవృద్ధికి చట్టం, అమలు.... చాలా కీలకం: లోక్‌సభ స్పీకర్
                    
                    
                        
ఐపీఎస్ అధికారుల పని, ప్రవర్తనకు రాజ్యాంగ స్ఫూర్తే మార్గనిర్దేశం: లోక్ సభ స్పీకర్
యువ ఐపీఎస్ అధికారులు సేవ, సమర్పణ అనే మంత్రాన్ని అవలంబించాలన్న లోక్‌సభ స్పీకర్
సమర్థవంతమైన పోలీసింగ్, చట్టబద్ధ పాలన అందేలా చూసుకునేందుకు
ఐపీఎస్‌లో మహిళా అధికారుల సంఖ్య పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్
ఐపీఎస్ ట్రైనీ అధికారులకు రెండు రోజుల పరిచయ కోర్సును ప్రారంభించిన లోక్‌సభ స్పీకర్
పోలీసులు ప్రజలతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండాలి: లోక్‌సభ స్పీకర్
                    
                
                
                    Posted On:
                30 OCT 2025 5:02PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                సమర్థవంతమైన అమలుతో కూడిన చట్టబద్ధ పాలన ఆర్థికవృద్ధికి మూలమని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అత్యవసరమని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అన్నారు. 77వ ఆర్‌ఆర్ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులకు పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ (ప్రైడ్) నిర్వహించిన రెండు రోజుల పరిచయ (అప్రిషియేషన్) కోర్సు ప్రారంభోత్సవంలో నేడు ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చట్టసభలు రూపొందించే చట్టాలు, విధానాలు యువ సివిల్ సర్వీసెస్ అధికారులు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. విధులను నిర్వర్తించే విషయంలో చేసే పని, అనుసరించే విధానాలకు రాజ్యాంగ స్ఫూర్తి మార్గనిర్దేశం చేయాలన్నారు. పనితీరు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆదర్శప్రాయమైన ప్రజా సేవ స్ఫూర్తిని ప్రతిబింబించాలన్నారు. సుదీర్ఘమైన చర్చోపచర్చల తర్వాత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొంచిందన్న ఆయన.. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతూ దేశానికి గర్వకారణంగా, మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. రాజ్యాంగం ఇప్పటికీ దేశానికి మార్గదర్శకంగా కొనసాగుతోందని ఆయన ఉద్ఘాటించారు.
యువ ఐపీఎస్ అధికారులు 'సేవ', 'సమర్పణ'  అనే మంత్రాన్ని అనుసరించాలని కోరిన లోక్‌సభ స్పీకర్.. విధులను కేవలం ఒక బాధ్యతగా కాకుండా నిజమైన సేవాభావం, నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. నిజాయితీ, అంకితభావం, దేశభక్తితో పనిచేసే అధికారులు ప్రజల విశ్వాసం, గౌరవాన్ని పొందుతారని అన్నారు. ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన సంతృప్తి, వ్యక్తిగతంగా నెరవేర్చిన భావనను ఇస్తుందని తెలిపారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను శ్రీ ఓం బిర్లా ప్రముఖంగా ప్రస్తావించారు. పోలీసు అధికారులు తరచుగా సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ.. సమాజంలోని అత్యంత దుర్బల వర్గాలకు సేవ చేసేందుకు, అందరికంటే ఎక్కువ అవసరమైన వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు. యువ ఐపీఎస్ అధికారులపై బాధ్యతలు, ప్రజా అంచనాలు ఎక్కువగా ఉంటాయని.. సామర్థ్యం మేరకు వాటిని నెరవేర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. 
ప్రజా జీవితంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం గురించి మాట్లాడిన లోక్‌సభ స్పీకర్.. సమాజ శ్రేయస్సు కోసం ప్రజా ప్రతినిధులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు దగ్గరి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  సమర్థవంతమైన పోలీసింగ్, చట్టబద్ధ పాలన అందేలా చూసుకునేందుకు పోలీసు అధికారులు పనిచేసే ప్రాంతంలో ప్రజలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. 
ఐపీఎస్ అధికారుల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం పట్ల శ్రీ ఓం బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. వారి సున్నితత్వం, సానుభూతి పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహపడతుందని ప్రధానంగా చెప్పారు. ఐపీఎస్ అధికారులు సంప్రదాయ పోలీసు విధులతో పాటు సైబర్ నేరాలు, విపత్తుల నిర్వహణ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతికంగా నిష్ణాతులుగా.. సమాచారంతో కూడిన అవగాహన కలిగిఉండాలని ఆయన అన్నారు. 
శిక్షణ పొందుతున్న అధికారులు చట్ట స్ఫూర్తిని అర్థం చేసుకునేందుకు పార్లమెంట్ ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ కోడ్‌లను పూర్తిగా అధ్యయనం చేయాలని కోరారు. నిరపరాధులను రక్షించడం, దోషులను పట్టుకునే విషయంలో కట్టుబడి ఉంటూనే వ్యవస్థీకృత నేరాలు, తీవ్రవాదం, సైబర్ నేరాలు వంటి అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించేటప్పుడు ప్రాపంచిక దృక్పథాన్ని అవలంబించాలని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 
లోక్‌సభ సెక్రటరీ-జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్ స్వాగత ఉపన్యాసం చేశారు. లోక్‌సభ కార్యాలయ సంయుక్త కార్యదర్శి శ్రీ గౌరవ్ గోయల్ ముగింపు ప్రసంగం చేశారు. 
 
***
                
                
                
                
                
                (Release ID: 2184442)
                Visitor Counter : 7