వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ లో బొగ్గు, రవాణా రంగాల్లో డిజిటల్ మార్పునకు ఊతమిచ్చే కోయ్లా శక్తి డాష్‌బోర్డ్ ప్రారంభం
ఏకీకృత, డేటా ఆధారిత పారిశ్రామిక వ్యవస్థల అభివృద్ధికి ఎన్ఐసీడీసీ ప్రయత్నంలో ప్రధాన మైలురాయిగా కోయ్లా శక్తి
యులిప్ (యూఎల్ఐపీ) తో నడిచే ఎన్ఐసిడిసి కోయ్లా శక్తి వేదిక ద్వారా బొగ్గు రంగానికి నిరంతర పర్యవేక్షణ, ఆధునిక రవాణా సదుపాయాలు
Posted On:
29 OCT 2025 6:47PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) డిజిటల్ మార్పు, ఆధునిక రవాణా (స్మార్ట్ లాజిస్టిక్స్) వైపు భారత్ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తూ ‘కోయ్లాశక్తి‘ - స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డాష్ బోర్డు (ఎస్సిఏడీ) ను ప్రారంభించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐసిడిసి ఈ వేదిక (ప్లాట్ ఫారమ్) ను అభివృద్ధి చేసింది. యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫామ్ (యూఎల్ఐపి) ద్వారా ఇది పని చేస్తుంది.
భారత బొగ్గు, రవాణా రంగాల్లో సాంకేతికత, డేటా ఆధారిత పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడంలో కోయ్లా శక్తి ఒక ముఖ్యమైన ముందడుగు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఈ వేదిక దోహదపడుతుంది. మొత్తం విలువ శ్రేణిలో అధిక సామర్థ్యం, పారదర్శకత, సుస్థిరతను ప్రోత్సహిస్తుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ వేదికను ప్రారంభించారు. డిజిటల్ ఇండియా, రవాణా ఆధునికీకరణను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఏకీకృత విశ్లేషణ విధానం ద్వారా బహుళ వ్యవస్థలను అనుసంధానించే తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో విస్తరిస్తున్న ఎన్ఐసిడిసి పాత్రను కోయ్లా శక్తి ప్రదర్శిస్తుంది. కోయ్లా శక్తి వేదిక 2022లో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ కింద ఏర్పాటయిన డిజిటల్ గేట్‌వే యులిప్ ను వినియోగిస్తూ, రైల్వేలు, రేవులు, కస్టమ్స్, బొగ్గు ఉత్పత్తిదారులు, విద్యుత్ వంటి రవాణా ఆధారిత కేంద్రాల మధ్య భద్రతతో కూడిన, అంతరాయం లేని సమాచార మార్పిడిని సులభతరం చేస్తుంది.
15 పోర్టుల నుంచి సేకరించిన సమాచారం, 48కి పైగా ఏపీఐల ఏకీకృతం ద్వారా కోయ్లా శక్తి వేదిక బొగ్గు సరఫరా రంగంలో తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. ఇది ‘ఒక దేశం - ఒక డాష్‌బోర్డ్‘ విధానానికి నమూనాగా నిలుస్తుంది. ఈ ఆవిష్కరణ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి నుంచి జాతీయ డిజిటల్ మౌలిక వసతులు, ఈ - గవర్నెన్స్ రంగాల వరకు తన నైపుణ్యాన్ని విస్తరించడంలో ఎన్ఐసీడీసీ సాధించిన విజయాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర మైనింగ్ విభాగాలు, విద్యుత్ కేంద్రాలు, ఓడరేవులు, ప్రైవేట్ రంగంతో సహా కీలక భాగస్వాముల నుంచి డేటాను ఏకీకృతం చేయడం ద్వారా కోయ్లా శక్తి సంప్రదాయ బొగ్గు రవాణాను తెలివైన, చురుకైన, స్థిరమైన వ్యవస్థగా మారుస్తుంది. పరిశీలనాత్మక విశ్లేషణ, స్థిరత్వంతో కూడిన పర్యవేక్షణ సాధనాలను సమీకరించడం ద్వారా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణపరంగా జవాబుదారీతనాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
దీనిని అమలు చేసే సంస్థగా ఎన్ఐసీడీసీ భారత తయారీ సామర్ధ్యం, రవాణా సామర్థ్యం, ఆధునిక (స్మార్ట్) మౌలిక సదుపాయాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్టులలో అగ్రగామిగా కొనసాగుతుంది. పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడంలోనూ , పీఎం మిత్రా పార్కుల వంటి కార్యక్రమాలను నిర్వహించడంలోనూ విజయవంతమైన అనుభవంతో, కార్పొరేషన్ ఇప్పుడు కోయ్లా శక్తి వంటి వేదికల ద్వారా సాంకేతికతలో తన నాయకత్వాన్ని విస్తరిస్తోంది. ఆవిష్కరణ ఆధారిత వృద్ధి పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తోంది.
కోయ్లా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్; ఎన్ఐసీడీసీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రజత్ కుమార్ సైనీతో పాటు ఆయా సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2184255)
Visitor Counter : 5