గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఆర్ఎల్ఎంను గురించి తెలుసుకోవడానికి భారత్‌లో పర్యటిస్తున్న ఇథియోపియా ప్రభుత్వ ప్రతినిధి వర్గం


ఆర్థిక సమ్మిళితత్వంతో పాటు మహిళల నాయకత్వంలో సముదాయ నిర్వహణ ప్రధాన అభివృద్ధిని విస్తరిస్తున్న తీరుపైనా ప్రత్యేక దృష్టి

प्रविष्टि तिथि: 28 OCT 2025 7:04PM by PIB Hyderabad

భారత్‌లో వారం రోజుల పాటు శిక్షణ, అనుభవ ప్రధాన పర్యటన నిమిత్తం ఇథియోపియా ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం తరలివస్తోంది. పేదరికాన్ని నిర్మూలించడానికీ, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పనకూ భారత్ చేపట్టిన ప్రధాన కార్యక్రమమైన ‘జాతీయ గ్రామీణ ఉపాధిమార్గాల మిషన్’ (ఎన్ఆర్ఎల్ఎం) అమలు తీరునూ, దీనికి అనుసరిస్తున్న వ్యూహాలనూ ప్రతినిధి వర్గం అధ్యయనం చేస్తుంది.

ఈ పర్యటనకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసింది. 105 మిలియన్ల మంది మహిళలను 9 మిలియన్ల కన్నా ఎక్కువ సంఖ్యలో స్వయం సహాయ బృందాలు (ఎస్‌హెచ్‌జీలు)గా ఎన్ఆర్ఎల్ఎమ్ ఎలా విజయవంతంగా సంఘటితపరిచి ఒక భారీ, సుదృఢ, సముదాయ నిర్వహణలోని ఆర్థిక సమ్మిళితత్వ నెట్‌వర్కును ఏర్పరచగలిగిందీ పరిశీలించడానికి ఈ పర్యటన తోడ్పడుతుంది.

మిషన్ పరిధి, ఆర్థిక ప్రభావం

జాతీయ గ్రామీణ ఉపాధిమార్గాల మిషన్‌ను 2011లో ప్రారంభించినప్పటి నుంచి, ఈ మిషన్ ప్రపంచంలో సముదాయ నిర్వహణలోని అతి పెద్ద అభివృద్ధి ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పదగిన కార్యక్రమాన్ని అమలుపరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఆర్థిక సేవలను విస్తృత స్థాయిలో అందరి అందుబాటులోకీ తీసుకువెళ్తుండడం ఇథియోపియా ప్రతినిధి వర్గానికి ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

మహిళా స్వయం సహాయ బృందాలు 2013-14 మొదలు ఆర్థిక సహాయ సంస్థల వద్ద నుంచి రుణాల రూపంలో రూ.11  లక్షల కోట్లను అందుకున్నాయి. ఈ రుణ లభ్యత పటిష్ఠమైన, విస్తృత స్థాయి లభ్యతతో పాటు స్థిర ప్రాతిపదిక కలిగిన జీవనోపాధి అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మించడంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని చాటిచెబుతోంది.

ప్రతినిధి వర్గం, శిక్షణ తాలూకు ముఖ్యోద్దేశాలు

ఇథియోపియా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఆహారం, భద్రతా సమన్వయ కార్యాలయం (ఎఫ్ఎస్‌సీఓ) అధికారి సింటాయేహూ డెమిసీ అద్మాసు ప్రతినిధి వర్గానికి   నాయకత్వం వహిస్తున్నారు. ప్రతినిధి వర్గంలో ఇథియోపియా మహిళా, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విపత్తు నష్టభయ నిర్వహణ, ఆహార భద్రతా కమిషన్లు, ప్రాంతీయ ఆహార భద్రతా కార్యాలయాలకు చెందిన సీనియర్ అధికారులు సహా ప్రపంచ బ్యాంకులోని సామాజిక సురక్ష, జీవనోపాధి బృంద ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు.

అయిదు రోజుల పాటు న్యూఢిల్లీ, అల్వర్, జైపూర్‌లలో ప్రతినిధి వర్గం పర్యటన సాగుతుంది. ఈ పర్యటన జాతీయ గ్రామీణ ఉపాధి మార్గాల మిషన్‌ పురోగతి తీరుతెన్నులు, విధానాలు, సంస్థాగత స్వరూపం, క్షేత్ర స్థాయి అమలు గురించి నేరు అవగాహనను అందిస్తుంది. ఈ కింద ప్రస్తావించిన ప్రధాన రంగాలపైనా ప్రతినిధి వర్గం దృష్టిని కేంద్రీకరిస్తుంది:

విధానం, పరిపాలన

జాతీయ గ్రామీణ ఉపాధిమార్గాల మిషన్‌ సాధించిన విజయానికి స్ఫూర్తిని ఇచ్చిన విధానపరమైన దృష్టికోణంతో పాటు సంస్థాగత ప్రణాళికపైనా అవగాహనను ఏర్పరుచుకొంటారు.

క్షేత్ర స్థాయిలో అమలు తీరు

రాజస్థాన్‌లో స్వయంసహాయ బృందాలు (ఎస్‌హెచ్‌జీలు), గ్రామ సంస్థలు (వీఓలు), క్లస్టర్ స్థాయి సమాఖ్యలతో (సీఎల్ఎఫ్‌లు) పాటు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓల) పనితీరును ఆచరణాత్మకంగా పరిశీలిస్తారు.

జీవనోపాధి నమూనాలు

గ్రామీణ ప్రాంతాల మహిళలు సామూహికంగా నిధులను ఎలా నిర్వహించుకొంటున్నారు, జీవనోపాధిని కల్పించే వాణిజ్య వ్యవస్థలతో ఎలా మమేకం అవుతున్నారు, సాధికారిత కల్పన ప్రక్రియలో డిజిటల్ సాధనాలను ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాలను ప్రతినిధి వర్గ సభ్యులు సమగ్రంగా అధ్యయనం చేస్తారు.

ఈ పర్యటన ప్రపంచ స్థాయి భాగస్వామ్య స్ఫూర్తిని చాటిచెబుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి శ్రీ టి.కె. అనిల్ కుమార్ అన్నారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు:

‘‘ఈ పర్యటన రెండు దేశాల మధ్య నేర్చుకోవడానికి ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.  దీంతో పాటు పెద్ద ఎత్తున ప్రగతి సాధన, సమ్మిళిత అభివృద్ధి దిశగా పయనించడం కోసం సముదాయ యాజమాన్యంలోని, సముదాయ నిర్వహణలోని వేదికల తాలూకు ప్రయోజనాల విషయంలో భారత్ సమకూర్చుకున్న అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలో ఇతర దేశాలు తామూ నేర్చుకొనే అవకాశాన్ని కూడా ఈ పర్యటన అందిస్తుంది. ఎన్ఆర్ఎల్ఎమ్‌ను వేదికగా చేసుకొని భారత్ తాను నేర్చుకొన్న, రుజువు చేసిన, అనుసరించదగిన పాఠాల్ని.. ఇతర దేశాల్లో గ్రామీణ ప్రాంతాల మహిళల సాధికారత కల్పనకూ, పేదరికాన్ని తగ్గించడానికీ.. పంచుకొనేందుకు సిద్ధంగా ఉంది.’’
   
అనేక మార్పులను తీసుకురాగల శక్తి ఈ శిక్షణకు ఉందంటూ ఇథియోపియా ప్రతినిధి వర్గం తన అభిప్రాయాన్నిలా వ్యక్తం చేసింది:

‘‘సామూహిక కార్యాచరణ, ఆర్థిక సమ్మిళితత్వం, స్థానిక పరిపాలనలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో ఎన్నెన్ని మార్పులను తీసుకురాగలవో  భారత్‌కు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధిమార్గాల మిషన్‌ అమూల్యమైన పాఠాల్ని నేర్పించగలుగుతుంద’’ని ప్రతినిధి వర్గం సారథి సింటాయేహూ డెమిసీ అద్మాసు అన్నారు. ‘‘భారత్ సాధించిన విజయం ద్వారా ఆచరణాత్మక వ్యూహాలను మేం కూడా అనుసరిస్తూ ఇథియోపియాలో గ్రామీణ జీవనోపాధి వ్యవస్థల్ని బలపరచాలని ఈ  భాగస్వామ్యం ద్వారా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’’ అని కూడా ఆమె వివరించారు.

విజయవంతమైన తన అభివృద్ధి అనుభవాల్ని ప్రపంచ భాగస్వాములతో పంచుకోవాలన్న భారత్ నిబద్ధతను ఈ పర్యటన బలపరుస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2183987) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी