రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మౌలిక సదుపాయాలను ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు సిద్ధం చేసి తీరాలి,


అవి పౌరులకు సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉండేలా చూడాలి: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ..
దేశమంతటా రోడ్డు వారగా 670 సౌకర్య కేంద్రాల కల్పన పూర్తి అయినట్లు వెల్లడి

మంత్రిత్వ శాఖ వార్షిక రాబడి ప్రస్తుతం రూ.55,000 కోట్లు.. ఇది రెండేళ్లలో రూ.1.4 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా

Posted On: 28 OCT 2025 5:44PM by PIB Hyderabad

ప్రజలు, సమృద్ధి, ప్రణాళిక రచన.. ఈ మూడూ మౌలిక సదుపాయాల రంగంలో మునుముందు కీలక పాత్రను పోషిస్తాయని రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలనీ, మౌలిక సదుపాయాలతో పౌరులకు సౌఖ్యం, అనుకూలత దక్కాలనీ ఆయన అన్నారు. ఈ దిశగా దేశవ్యాప్తంగా రోడ్డు వారగా 670 సౌకర్య కేంద్రాలను అభివృద్ధిపరిచారని మంత్రి చెప్పారు.

‘‘స్మార్ట్ రహదారుల భవిష్యత్తు..సురక్ష, స్థిరత్వంతో పాటు దృఢత్వం’’పై  న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన సీఐఐ జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి శ్రీ గడ్కరీ ప్రసంగించారు.

భారత్‌ను 2027 కల్లా 5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలన్న ప్రధానమంత్రి దృష్టికోణాన్ని సాకారం చేయడంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్రను పోషిస్తుందని  మంత్రి శ్రీ గడ్కరీ తన ప్రసంగంలో వివరించారు. దేశమంతటా ఆర్థిక వృద్ధిలోనూ, పెట్టుబడుల్లోనూ, ఉపాధి కల్పనలోనూ రహదారి, రవాణా రంగం అనేక అవకాశాల్ని అందిస్తుందని ఆయన తెలిపారు.

మంత్రిత్వ శాఖ వార్షిక రాబడి ప్రస్తుతం రూ.55,000 కోట్లుగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇది రెండు సంవత్సరాల లోపు రూ.1.4 లక్షల కోట్లకు పెరగవచ్చన్న అంచనా ఉందన్నారు. ఈ అంచనా ఈ రంగంలో అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని సూచిస్తోందన్నారు.

దేశంలో 25,000 కిలోమీటర్ల మేర రెండు దోవల హైవేలను నాలుగు దోవలు కలిగి ఉండేవిగా మార్చే పనులు పురోగమిస్తున్నాయనీ, రూ.2 లక్షల కోట్లతో చేపట్టిన ఓడరేవుల సంధాన కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రధాన ఓడరేవులనూ జాతీయ రహదారులతో కలుపుతున్నారనీ శ్రీ గడ్కరీ అన్నారు. రహదారుల అనుసంధానం మెరుగుపడుతుండడంతో, దేశంలో అనేక ప్రాంతాల్లో ధార్మిక పర్యటనతో పాటు సాహసిక క్రీడలకు ప్రోత్సాహం లభిస్తోందని మంత్రి తెలిపారు.

సమృద్ధిని గురించి మంత్రి శ్రీ గడ్కరీ ప్రస్తావిస్తూ,  మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడంలో ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయితో మూడు రూపాయల విలువైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతోందనీ, ఇది దీనికున్న బలమైన, అనేక రెట్ల ప్రభావాన్ని చాటుతోందన్నారు. ప్రణాళిక రచన ప్రక్రియను గురించి ఆయన చెబుతూ, కాలుష్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనీ,  మన్నికైన, పర్యావరణానుకూలమైన, ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే అభివృద్ధి మార్గంలో పయనించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పర్యావరణ హితకర కార్యక్రమాల్లో భాగంగా ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి 8,500 మొక్కలను పెంచుతున్నారని మంత్రి వెల్లడించారు.

రహదారుల, మౌలిక  సదుపాయాల ప్రాజెక్టులు నాణ్యంగా ఉండేటట్లూ, అనుకున్న కాలానికల్లా పూర్తి అయ్యేటట్లూ చూడటానికి ప్రీకాస్ట్ సాంకేతికతను తప్పక ఉపయోగించాలని నిబంధన తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఇంజినీర్లతో పాటు గుత్తేదారుల మధ్య మరింత యాజమాన్య భావనతో పాటు వారి బాధ్యతలు కూడా పెరగాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఈ రంగానికున్న ఆర్థిక ప్రాధాన్యాన్ని గురించి శ్రీ గడ్కరీ చెప్తూ, భారత్‌లో 80 శాతం సరకు రవాణా రోడ్డు మార్గం గుండానే సాగుతుందన్నారు. వాయు మార్గాన సరకు రవాణా ఒక శాతంగా ఉంటే, ఇతర పద్ధతుల ద్వారా 18 శాతంగా నమోదు అవుతోందని వివరించారు. రహదారి మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తుండడంతో, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థా, ఇంధన ఖర్చులూ తగ్గిపోతూ ఒక అంకె స్థాయిలకు పరిమితం అయ్యే ఆస్కారం ఉంటుందన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యావరణ సంబంధిత బాధ్యతతో సమతౌల్య పరుచుకోవాలని శ్రీ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్థిక ప్రగతికి తోడు పౌరుల జీవనాన్ని ఇప్పటి కన్నా మెరుగుపరచగల రోడ్లనూ, సురక్షితమైన, మన్నికైన, ప్రపంచ స్థాయి కలిగిన రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాకపోకల సాధనాలకు సరికొత్త రూపురేఖలను సంతరించే క్రమంలో భారత్ ‘‘స్మార్ట్ రోడ్ల’’ను సమకూరుస్తోందనీ, ఇవి పాదచారులకు సౌలభ్యాన్ని అందిస్తూ, ఈవీ చార్జింగునూ, ఇంధన స్టేషన్లనూ, పార్కింగూ,  రోడ్లకిరుపక్కలా ఆధునిక సౌకర్యాల వంటి ఆవశ్యక సదుపాయాలతో సాంకేతికతను మిళితం చేస్తున్నాయని మంత్రి వివరించారు.

 

***


(Release ID: 2183727) Visitor Counter : 4