కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం సాంకేతికతలు, ప్రామాణీకరణ విషయంలో ఉమ్మడి అధ్యయనం, సాంకేతిక సహకారం కోసం ఐఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న టీఈసీ
ప్రపంచ ప్రమాణీకరణలో భారత్ పాత్రను బలోపేతం చేయటంతో పాటు టెలికాంలో స్వదేశీ పరిశోధనలను ప్రోత్సహించనున్న ఎంఓయూ
భారతదేశ నిర్దిష్ట టెలికాం ప్రమాణాలను తయారు చేసేందుకు, స్వావలంబనను పెంపొందించడానికి ఉపయోగపడనున్న భాగస్వామ్యం
Posted On:
24 OCT 2025 5:09PM by PIB Hyderabad
ఉమ్మడి సాంకేతిక అధ్యయనాలు, సహకార పరిశోధనలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (డీఓటీ) చెందిన సాంకేతిక విభాగం అయిన టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కేంద్రం (టీఈసీ).. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- హైదరాబాద్‌తో (ఐఐఐటీహెచ్) ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.
భారత్ నిర్దిష్ట ప్రమాణాలు- టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌లను తయారు చేయటం.. కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ భద్రత, స్మార్ట్ సిటీలు, క్వాంటం కమ్యూనికేషన్స్ వంటి భవిష్యత్ తరం నెట్‌వర్క్ సాంకేతికలపై పనిచేయటం.. ఐటీయూ-టీ (ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ - టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సెక్టార్) అధ్యయన గ్రూపులకు సహకారాన్ని పెంచాలని ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది.
2025 అక్టోబర్ 24 నాడు ఐఐఐటీహెచ్‌లో జరిగిన కార్యక్రమంలో టీఈసీ డీడీజీ (మొబైల్ సాంకేతికలు) శ్రీ అమిత్ కుమార్ శ్రీవాస్తవ, ఐఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ శుక్లాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. టీఈసీ సీనియర్ డీడీజీ- హెడ్ శ్రీ సయ్యద్ తౌసిఫ్ అబ్బాస్, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తదుపరి తరం టెలికాం సాంకేతికతలు, వాటి ప్రామాణీకరణపై ఐఐఐటీ-హైదరాబాద్‌తో టీఈసీ పనిచేసేందుకు ఈ ఒప్పందం అధికారిక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తోంది.
భాగస్వామ్యం పనిచేయనున్న కీలక అంశాలు:
* ఏఐ-ఆధారిత టెలికాం నెట్‌వర్క్‌లు: భవిష్యత్ 6జీ వ్యవస్థలలో ఏఐ విషయంలో స్థానిక సామర్థ్యాలను ఉపయోగించే రోడ్‌మ్యాప్‌తో కూడిన ఇంటెలిజెంట్ నెట్‌వర్క్‌లు, ఆటోమేషన్- ముందస్తు నిర్వహణ కోసం ఏఐ ఆధారిత టెలికాం అప్లికేషన్‌ల అభివృద్ధి.
* ఎంఎంవేవ్, కాగ్నిటివ్ రేడియో: ఎంఎంవేవ్ కమ్యూనికేషన్‌లు, బీమ్‌ఫార్మింగ్, కాగ్నిటివ్ రేడియో సాంకేతికతల విషయంలో భాగస్వామ్య పరిశోధన.
* స్మార్ట్ సిటీలు: స్మార్ట్ సిటీల కోసం ఐఓటీ, వన్ఎంటూఎం, డిజిటల్ ట్విన్ సాంకేతికల్లో ఉమ్మడి అధ్యయనం, సాంకేతిక సహకారం.
* క్వాంటం కమ్యూనికేషన్‌లు: క్వాంటం కమ్యూనికేషన్ సాంకేతికల విషయంలో ఉమ్మడి అధ్యయనం, సాంకేతిక సహకారం.
* సైబర్ భద్రత: టెలికాం నెట్‌వర్క్‌ల భద్రత, ధృడత్వాన్ని పెంచేందుకు సైబర్ భద్రత విషయంలో సహకార పరిశోధన.
ఐటీయూ, 3జీపీపీ వంటి ప్రపంచ స్థాయి ప్రామాణీకరణ సంస్థలకు భారత్ సహకారాన్ని బలోపేతం చేయటం ద్వారా స్వదేశీ పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయడం.. ప్రపంచ ప్రామాణీకరణ ప్రక్రియలలో దేశ ప్రభావాన్ని పెంచాలని ఈ భాగస్వామ్యం భావిస్తోంది.
ఈ భాగస్వామ్యం టెలికాంలో స్వదేశీ పరిశోధన, రూపకల్పన, తయారీని బలోపేతం చేయడంతో పాటు భారతదేశ నిర్దిష్ట ప్రమాణాలు- పరీక్షా ఫ్రేమ్‌వర్క్‌లు, జాతీయ స్వావలంబనను పెంపొందించే కీలకమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మరింత సురక్షితం చేయటం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయటం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్తుంది.
టీఈసీ గురించి:
టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (టీఈసీ) అనేది కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (డీఓటీ) సంబంధించిన సాంకేతిక విభాగం. భారత్‌లో టెలికాం పరికరాలు, నెట్‌వర్క్‌ల సాంకేతిక ప్రమాణాలు, స్పెసిఫికేషన్‌లు, ప్రమాణాల నిర్ధారణ ప్రక్రియలను ఇది రూపొందిస్తోంది. వీటి ద్వారా నాణ్యత, అనుసంధాన సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. ఆయా అంశాల్లో ప్రపంచ ఉత్తమ పద్ధతులు అనుసరించేలా చూసుకుంటుంది. టీఈసీ ఐటీయూ-టీ, ఐటీయూ-ఆర్ వంటి అంతర్జాతీయ వేదికలలో భారత్‌కు ప్రాతినిధ్య వహించటమే కాకుండా.. ప్రపంచ ప్రామాణీకరణ విషయంలో జాతీయ వర్కింగ్ గ్రూపులను సమన్వయం చేస్తోంది.
ఐఐఐటీ- హైదరాబాద్:
అధునాతన టెలికమ్యూనికేషన్స్, 5జీ- 6జీ సాంకేతికతలు, టెలికాంలో కృత్రిమ మేధ ఉపయోగం, ఐసీటీ విభాగంలో మంచి విద్యా, పరిశోధన సామర్థ్యాలు ఉన్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రముఖ సంస్థ ఐఐఐటీ-హైదరాబాద్. ఇది 1998లో లాభాపేక్షలేని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (ఎన్-పీపీపీ) స్వయం ప్రతిపత్తి విశ్వవిద్యాలయంగా ఏర్పాటైంది. ఈ తరహా ఐఐఐటీలలో భారత్‌లో మొదటిది ఇది.
మరిన్ని వివరాల కోసం సామాజిక మాధ్యమాల్లో డీఓటీని అనుసరించండి -
ఎక్స్ - https://x.com/DoT_India
ఇన్‌స్టాగ్రాం- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఫేస్‌బుక్ - https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
***
(Release ID: 2182335)
Visitor Counter : 13