|
ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ ‘ఎన్‌సీఆర్’లో మత్తుమందుల తయారీ.. సరఫరా స్థావరాలపై 'డీఆర్ఐ' దాడులు
· అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు ₹108.81 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం... 26 మంది విదేశీయుల అరెస్టు · వీటిలో 115.42 కిలోల రసాయన తయారీ పదార్థాలు, 16.27 కిలోల యాంఫిటమైన్.. 7.9 కిలోల కొకైన్.. 1.8 కిలోల హెరాయిన్.. 2.13 కిలోల గంజాయి పట్టివేత
Posted On:
24 OCT 2025 4:38PM by PIB Hyderabad
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలో ఒక భారీ మత్తుమందుల తయారీ, సరఫరా ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) రట్టు చేసింది. ఈ మేరకు అక్టోబరు 21 నుంచి 23 వరకు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిర్వహించిన ఈ దాడులలో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు 26 మంది విదేశీయులను అరెస్టు చేసింది.
ఈ నెట్‌వర్క్‌పై నిర్దిష్ట సమాచార మేరకు డీఆర్‌ఐ పకడ్బందీ నిఘా ప్రణాళికను రూపొందించింది. తదనుగుణంగా ముందడుగు వేసిన అధికారులు గ్రేటర్ నోయిడాలోని బహుళ అంతస్తుల భవనాల నడుమ నిర్మానుష్య వ్యవసాయ క్షేత్రంలో మెథాంఫిటమైన్ మత్తుమందు తయారు స్థావరంపై దాడి చేశారు. ఈ స్థావరం నుంచి 11.40 కిలోల యాంఫిటమైన్, దాని తయారీలో ఉపయోగించే 110.923 కిలోల రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఈ ముఠా ప్రధాన నిర్వాహకుడిని గురుగ్రామ్‌లోని అతని నివాసంలో అరెస్టు చేయడంతోపాటు అతడినుంచి 1.33 కిలోల యాంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల సందర్భంగా లభించిన ఆధారాల మేరకు పశ్చిమ ఢిల్లీలో నిషిద్ధ వస్తువుల నిల్వ, సరఫరాలకు ఉపయోగిస్తున్న మరొక భవనాన్ని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంగణం ఇరుకైన దారులు, జనసాంద్రత, రద్దీగల ప్రాంతంలో ఉండటం గమనార్హం. దీంతో అక్కడికి చేరుకోవడంలో అధికారులకు సదుపాయాలు, భద్రత పరంగా కొంత ఇబ్బంది కలిగింది.
ఈ ఆపరేషన్ సమయంలో కొందరు దుండగులు అధికారులను ఎదుర్కొని, ఆ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అసాంఘిక శక్తుల ప్రతిఘటనతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ముప్పు ఉన్నప్పటికీ, ఢిల్లీ పోలీసు బృందంతో సంయుక్తంగా సంయమనంతో, వ్యూహాత్మక నైపుణ్యంతో ఆ ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకుని, విజయవంతంగా తనిఖీ ప్రక్రియను పూర్తిచేసింది. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేయడంతోపాటు 7.79 కిలోల కొకైన్, 1.87 కిలోల హెరాయిన్, 3.54 కిలోల యాంఫిటమైన్, 2 కిలోల గంజాయి, 0.15 కిలోల మెథాక్వాలోన్, 4.50 కిలోల మత్తుమందు తయారీ రసాయనాలు సహా ₹37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము మాదకద్రవ్యాల అక్రమ సరఫరా మార్గంలో ఆర్జించినదిగా వారు భావిస్తున్నారు.
రెండు చోట్ల దాడులలో పట్టుబడిన మొత్తం 16.27 కిలోల యాంఫిఫెటమైన్, 7.9 కిలోల కొకైన్, 1.8 కిలోల హెరాయిన్, 2.13 కిలోల గంజాయి, 115.42 కిలోల రసాయనాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు ₹108.81 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.
వివిధ అధికార పరిధులలో సంక్లిష్ట సవాళ్లు ఎదురయ్యే క్షేత్రస్థాయి పరిస్థితుల నడుమ నిఘా సంస్థ నేతృత్వాన పలు ప్రభుత్వ విభాగాలు ఎంతో సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశాయి. మత్తుమందుల అక్రమ తయారీ-సరఫరా, సింథటిక్ మాదకద్రవ్యాల తయారీ ముప్పును ఎదుర్కొనడంలో ‘డీఆర్ఐ’ దృఢ సంకల్పానికి ఈ దాడులే నిదర్శనం.
ఈ ఉదంతంపై ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
(Release ID: 2182334)
|