పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమాన సిబ్బంది నియామకం కోసం ‘పరీక్ష’ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులకు కంప్యూటర్ నంబర్ల స్వయంచలిత సృష్టికి ‘డీజీసీఏ’ శ్రీకారం
డిజిలాకర్ సౌకర్యం వినియోగం.. దరఖాస్తు ప్రక్రియ క్రమబద్ధీకరణ.. వాణిజ్య సౌలభ్యం పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యం
Posted On:
17 OCT 2025 7:23PM by PIB Hyderabad
పౌర విమానయాన రంగంలో విమాన సిబ్బంది (ఫ్లైట్ క్రూ-ఎఫ్సీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ‘పరీక్ష’ వెబ్‌సైట్/పోర్టల్ ద్వారా కంప్యూటర్ నంబర్ల స్వయంచలిత సృష్టి (ఆటో జనరేషన్) ప్రక్రియను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రారంభించింది. ఈ నిన్నటి (అక్టోబరు 16) నుంచి ఇది అమలులోకి వచ్చింది.
డిజిలాకర్ సౌకర్యం వినియోగం, దరఖాస్తు ప్రక్రియ క్రమబద్ధీకరణ, వాణిజ్య సౌలభ్యం పెంపుతోపాటు నేరుగా పత్రాల సమర్పణ-తనిఖీకి వెసులుబాటు కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ ప్రక్రియ కింద పేర్కొన్న మేరకు దశలవారీగా అమలవుతుంది:
ఫేజ్ 1: సీబీఎస్‌ఈ బోర్డు పరిధిలో 10, 12వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిజిలాకర్ ద్వారా ధ్రువీకరణను పూర్తి చేసుకోవడం ప్రాతిపదికగా కంప్యూటర్ నంబర్ల స్వయంచలిత సృష్టి అందుబాటులో ఉంటుంది.
తదుపరి దశలు: డిజిలాకర్‌లో 10, 12 తరగతుల మార్కుల జాబితా/సర్టిఫికెట్లు అందుబాటులోగల ఇతర గుర్తింపు పొందిన బోర్డుల అభ్యర్థులకూ ఈ సౌకర్యం వర్తిస్తుంది.
డీజీసీఏ సూచించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా- పరీక్ష పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగానే ఆటో జనరేషన్ వ్యవస్థ తనంతటతానే కంప్యూటర్ నంబర్ కేటాయిస్తుంది.
డీజీసీఏ/బీసీఏఎస్ కార్యాలయాల్లోని అన్ని ప్రక్రియలనూ ఇ-జీసీఏ తదితర వేదికల ద్వారా డిజిటలీకరణకు పౌర విమానయాన మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జారీచేసిన ఆదేశాల మేరకు డీజీసీఏ ఈ వినూత్న చర్యలు చేపట్టింది. దీనివల్ల విద్యార్థులు/పైలట్లు/భాగస్వాములకు సత్వర ప్రతిస్పందన, మానవ జోక్య రహిత ఆమోద ప్రక్రియలు సులభమవుతాయి.
****
(Release ID: 2180747)
Visitor Counter : 5