గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సున్నపురాయిని పూర్తి ప్రధాన ఖనిజంగా వర్గీకరించిన గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 14 OCT 2025 6:53PM by PIB Hyderabad

సున్నపురాయిని పూర్తిగా ప్రధాన ఖనిజంగా వర్గీకరిస్తూ గనుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకుముందు సున్నపురాయిని తుది వినియోగాన్ని బట్టి చిన్న (మైనర్) ఖనిజంగాను, ప్రధాన ఖనిజంగాను వర్గీకరించారు. ‘నిర్మాణ సామగ్రిగా ఉపయోగించే సున్నం తయారీ కోసం బట్టీల్లో ఉపయోగించే సున్నపురాయి’ మైనర్ ఖనిజంగా ఉండేది. మిగతా సందర్భాల్లో.. సిమెంటు, రసాయనాలు, చక్కెర, ఎరువులు, ఉక్కు మొదలైన ఇతర అవసరాల కోసం వినియోగించే సమయంలో ఇది ప్రధాన ఖనిజంగా ఉండేది.

2025 అక్టోబరు 10 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా.. తుది వినియోగం ఆధారంగా పైన పేర్కొన్న వ్యత్యాసాన్ని గనుల మంత్రిత్వ శాఖ తొలగించింది. ఈ మేరకు ‘నిర్మాణ సామగ్రిగా ఉపయోగించే సున్నం తయారీ కోసం బట్టీల్లో ఉపయోగించే సున్నపురాయి’ని చిన్న (మైనర్) ఖనిజాల కేటగిరీ నుంచి తొలగించింది. అంతేకాకుండా వాణిజ్య సౌలభ్యం కోసం ఎంఎండీఆర్ చట్టంలోని సెక్షన్ 20 కింద గనుల మంత్రిత్వ శాఖ 2025 అక్టోబరు 13న ఉత్తర్వులు జారీ చేసి.. ప్రస్తుత సున్నపురాయి చిన్న ఖనిజాల లీజులను ప్రధాన ఖనిజాల లీజుకు సజావుగా బదిలీ చేసేందుకు వీలు కల్పించింది.

నీతి ఆయోగ్ సభ్యుడి అధ్యక్షతన ఏర్పాటైన గనులు, ఖనిజ రంగంపై అంతర మంత్రిత్వ కమిటీ వివిధ భాగస్వాములతో చర్చించి, చేసిన సిఫార్సుల ఆధారంగా మంత్రిత్వ శాఖ పై నిర్ణయం తీసుకుంది. సున్నం తయారీలో సున్నపురాయి వినియోగం కొన్నేళ్లుగా బాగా తగ్గిందిసున్నపురాయి లో ఎక్కువ భాగం ఇప్పుడు సిమెంట్ తయారీలోనూ, రసాయన పరిశ్రమలు, లోహ ద్రావకాలు, ఎరువుల యూనిట్, చక్కెర కర్మాగారాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు.

అన్ని రకాల సున్నపురాయినీ ప్రధాన ఖనిజంగా వర్గీకరించడం వాణిజ్య సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుందిచిన్న ప్రధాన ఖనిజాలు అన్న కృత్రిమ నియంత్రణా వ్యత్యాస ప్రాతిపదికన తుది వినియోగ పరిమితులేవీ లేకుండా.. లీజుదారులు ఏ ప్రయోజనం కోసమైనా సున్నపురాయిని విక్రయించుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత సున్నపురాయి మైనర్ ఖనిజ లీజులు ఎలాంటి అంతరాయమూ లేకుండా ప్రధాన ఖనిజ లీజులుగా కొనసాగుతాయి.

ప్రస్తుత మైనర్ ఖనిజాల మైనింగ్ లీజులను ప్రధాన ఖనిజాల కేటగిరీలోకి సజావుగా మార్చడం కోసం.. 2025 అక్టోబర్ 13న గనుల మంత్రిత్వ శాఖ సెక్షన్ 20ఏ కింద ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి:

(i) మైనర్ మినరల్ సున్నపురాయి లీజుల ప్రస్తుత లీజుదారులకు ఐబీఎంలో నమోదు కోసం 2026 మార్చి 31వరకు గడువును అనుమతించారు. 2026 మార్చి 31 వరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రస్తుత రేట్ల ప్రకారం వారు రాయల్టీని చెల్లించవచ్చు.

(ii) ఆ లీజుల కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన ప్రస్తుత మైనింగ్ ప్రణాళికలను 2027 మార్చి 31 వరకు కొనసాగించడం, ఈలోగా మైనింగ్ ప్రణాళిక కోసం ఐబీఎం అనుమతి కోరడం.

(iii) మైనింగ్ లీజు ప్రాంత డిజిటల్ వైమానిక చిత్రాల దాఖలుకు 2027 జూలై 1 వరకు మినహాయింపు. అలాగే స్టార్ రేటింగ్ టెంప్లేట్ ప్రకారం ఆన్‌లైన్ స్వీయ అంచనా నివేదిక దాఖలుకు 2027 జూలై 1 వరకు మినహాయింపు.

(iv) ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు ఎంసీడీఆర్-2017లోని నిబంధన- 45 ప్రకారం నెలవారీ, వార్షిక రిటర్నులను దాఖలు చేయనందుకు విధించే జరిమానా నుంచి 2026 మార్చి 31 వరకు మినహాయింపు ఉంటుంది. అయితే, ఇది ప్రస్తుత నిబంధనల మేరకు లీజుదారులు రాష్ట్ర ప్రభుత్వాలకు రిటర్నులు సమర్పించడాన్ని కొనసాగించాలన్న షరతుకు లోబడి ఉంటుంది.

మైనర్ ఖనిజంగా సున్నపురాయిపై ఖనిజ రాయితీ మంజూరు కోసం పెండింగులో ఉన్న దరఖాస్తులకు సంబంధించి.. ఆ సదుపాయాన్ని ప్రారంభించే అవకాశాన్ని కూడా 2025 అక్టోబర్ 13 నాటి ఉత్తర్వు అందిస్తుంది. అక్టోబర్ 10 లోపు ఖనిజ రాయితీ మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన పక్షంలో.. 2025 లేదా ఖనిజ రాయితీ మంజూరు కోసం వేలం ప్రక్రియ ముగిసి, 2025 అక్టోబరు 10లోపు బిడ్డర్ ఎంపిక జరిగితే, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల వ్యవధిలోపు మైనర్ ఖనిజాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం మైనింగ్ లీజును మంజూరు చేసి అమలు చేస్తారు. 2025 అక్టోబర్ 10కి ముందు ఖనిజ రాయితీ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) జారీ చేయని దరఖాస్తులు రద్దవుతాయి.

మైనర్ ఖనిజాల జాబితా నుంచి సున్నపురాయి తొలగింపుతో వందలాది మంది సున్నపురాయి మైనర్ ఖనిజ లీజుదారుల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరింది. సిమెంటు పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలకు స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయంతోపాటు ఉపాధిని పెంచుతుంది. అంతేకాకుండా చిన్న ఖనిజ లీజుల నుంచి సిమెంటు పరిశ్రమకు సున్నపురాయి లభ్యత పెరగడం వల్ల దేశంలో సిమెంటు తయారీ సామర్థ్యం త్వరగా విస్తరిస్తుంది. ఈ చర్యల వల్ల దేశంలో నిర్మాణ కార్యకలాపాలకు ఊతం లభిస్తుంది. ఇది ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

 

***


(Release ID: 2179280) Visitor Counter : 6