కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఫార్చ్యూన్ లీడర్‌షిప్ అవార్డులు-2025’లో హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా సంస్థకు ప్రదానం

Posted On: 14 OCT 2025 10:10AM by PIB Hyderabad



‘ఫార్చ్యూన్ లీడర్‌షిప్ అవార్డులు-2025’లో హెచ్ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డును టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా సంస్థ (టీసీఐఎల్) కు ఇచ్చారు. అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఈ నెల 11న ఢిల్లీలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో నిర్వహించారు. టీసీఐఎల్ మినీరత్న షెడ్యూలు ‘ఎ’లో స్థానమున్న ఒక  ప్రభుత్వ  రంగ సంస్థ. మార్గదర్శకంగా నిలుస్తున్న మానవ వనరుల విధానాలను అమలు చేస్తున్నందుకూ, ఉద్యోగుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నందుకూ, నవకల్పననూ, సమ్మిళితత్వాన్నీ ప్రోత్సహిస్తున్నందుకూ ఈ అవార్డును ఇచ్చి, టీసీఐఎల్‌ను సత్కరించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఇదివరకు సభ్యునిగా పనిచేసిన డాక్టర్ దినేశ్ ఉపాధ్యాయ్, శ్రీ ఎం.ఎస్. నేత్రపాల్, ఐఆర్ఎస్‌ల చేతుల మీదుగా టీసీఐఎల్ సీజీఎమ్ (హెచ్ఆర్) శ్రీ పి. సురేశ్ బాబు అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ  రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.  

టీసీఐఎల్ 2021 నుంచి మానవ వనరుల విభాగానికి సంబంధించి రాబోయే కాలంలో చోటు చేసుకోగల మార్పులను ముందస్తుగా అంచనా వేసి  తగిన సంస్కరణలను విస్తృతంగా అమలు చేసింది. ‘మిషన్ కర్మయోగి’లో నిర్దేశించిన ప్రమాణాలకు తుల తూగేలా సిబ్బందికి సముచిత శిక్షణను అందించింది. సంస్థ చేపట్టిన ముఖ్య కార్యక్రమాల్లో.. సమగ్ర హెచ్ఆర్ విధానం, జవాబుదారుతనాన్ని ప్రవేశపెడుతూ విభాగాల వారీ పునర్‌వ్యవస్థీకరణ, ప్రతిభే గీటురాయిగా పదోన్నతులు, డీపీసీల ప్రక్రియను నిర్దిష్ట కాలానికల్లా ముగించడం, పనితీరుతో ముడిపెట్టిన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, బహుమతుల పద్దతిని ప్రవేశపెట్టడం, ‘ఈ-ఆఫీస్‌’తోనూ, ఈఆర్‌పీ ద్వారానూ డిజిటలీకరణకు బాట వేయడం.. ఇవి కొన్ని.  

నైపుణ్యాలకు పదును పెట్టడంపై టీసీఐఎల్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటోంది. సంస్థ కార్యనిర్వాహకులు సైబర్ భద్రత, నెట్‌వర్కింగ్, ఆడిటింగ్, అధిక విలువ కలిగిన ప్రాజెక్టులను అనుకున్న కాలానికే పూర్తి చేయడం.. ఈ పనుల్లో ప్రపంచ శ్రేణి ధ్రువపత్రాలను అందుకున్నారు.

సమ్మిళితత్వాన్నీ, పారదర్శకత్వాన్నీ, నవకల్పననూ పెంచుతూ, ప్రజల ప్రయోజనాలకే టీసీఐఎల్ పెద్దపీట వేస్తోంది. ఈ విధానం డిజిటల్ ఇండియా, స్మార్ట్ నగరాలు, భారత్‌నెట్ (BharatNet) వంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలకు అండదండలను అందిస్తోంది. విధానాలనూ, సాంకేతికతనూ, ప్రతిభనూ ఒకదానితో మరొకటి పెనవేయాలనేదే మానవ వనరుల పరంగా ఈ సంస్థ అనుసరిస్తున్న వ్యూహం. ఈ వ్యూహం మన దేశంలో డిజిటల్ సేవల అందజేతను ఇంతింతగా విస్తరించడంలో టీసీఐఎల్‌ను ఓ ఆదర్శప్రాయ పీఎస్‌యూగా నిలబెడుతోంది.

టీసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ కుమార్ ‘‘ఈ హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఒక మహత్తర ఘట్టం. ఈ పురస్కారం మా బృందం అంకితభావాన్ని ప్రతిబింబిస్తోంది. టీసీఐఎల్‌లోని మా బృంద సభ్యులంతా కలిసి ‘డిజిటల్ ఇండియా’ ఆశయ సాధనకు అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ, సిబ్బందినంతా ఏకతాటి మీద నడిపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ పురస్కారం దీర్ఘకాల ప్రాతిపదికన వృద్ధిని సాధిస్తూ, దేశ ప్రజలను పరస్పరం అనుసంధానించాలన్న మా ఆకాంక్షను బలపరుస్తుంద’’ని పేర్కొన్నారు.

టీసీఐఎల్ గురించి : టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా సంస్థ (టీసీఐఎల్)ను 1978లో ఏర్పాటు చేశారు. ఇది భారత ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ప్రపంచ శ్రేణి టెలికమ్ కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. టెలికమ్యూనికేషన్స్ రంగంతో పాటు ఐటీ, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో అన్ని రకాల సేవలనూ టీసీఐఎల్ అందిస్తోంది. ఇంతవరకు 100 కన్నా ఎక్కువ దేశాల్లో 500కు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. భారత్ డిజిటల్ రంగ అభివృద్ధిలోనూ, అంతర్జాతీయంగా టెలికం రంగ సహకారంలోనూ ఈ సంస్థ కీలక పాత్రను పోషిస్తోంది.

 

 

***


(Release ID: 2178782) Visitor Counter : 4