కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణ సదస్సు (ఈఎస్టీఐసీ) - 2025 కు 'డిజిటల్ కమ్యూనికేషన్‘ ఇతివృత్తాన్ని నిర్ణయించిన టెలీకమ్యూనికేషన్ల శాఖ
5జీ నాయకత్వం నుంచి 6జీ సారధ్యం వైపు భారత్ పురోగమనానికి దిశా నిర్దేశం
ఆలోచన, ఆవిష్కరణ, స్ఫూర్తి: అభివృద్ధి చెందుతున్న విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణ సదస్సులో కేంద్రబిందువుగా డిజిటల్ కమ్యూనికేషన్
డిజిటల్ కమ్యూనికేషన్ ఇతివృత్తం భారతదేశ అసాధారణ ప్రయాణానికి, ప్రపంచ 6జీ పోటీలో అగ్రగామిగా నిలిచేందుకు పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనం
Posted On:
09 OCT 2025 5:36PM by PIB Hyderabad
భారత మొబైల్ కాంగ్రెస్ 2025 సందర్భంగా ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) త్వరలో జరిగే అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణ సదస్సు (ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ - ఈఎస్టీఐసీ) 2025 కోసం 'డిజిటల్ కమ్యూనికేషన్‘ ఇతివృత్తాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం భారత్ 6జీ అలయన్స్ (బి6జీఏ) ప్రారంభ సమావేశానికి కూడా వేదికగా నిలిచింది. ఇది వచ్చే తరం టెలికాం ఆవిష్కరణలలో భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్, భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అధ్యక్షత వహించారు. గత దశాబ్దంలో భారతదేశం సాధించిన అసాధారణ డిజిటల్ మార్పును ప్రతిబింబించడంతో పాటు, 6జీ శకం లో ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రతిష్ఠాత్మక దార్శనికతను ప్రదర్శించే ఒక వీడియో ఆవిష్కరణ ,ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పరిమిత కనెక్టివిటీ నుంచి ప్రపంచ డిజిటల్ నాయకత్వ దశకు భారత్ పరిణామక్రమాన్ని ఈ వీడియో చూపిస్తుంది. ఈ ప్రయాణాన్ని రూపుదిద్దడంలో విధానాలు, ఆవిష్కరణలు, సమ్మిళిత చొరవల కీలక పాత్రను కూడా స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా డాక్టర్ నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ, కనెక్టివిటీ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం, ఆవిష్కరణల ప్రాముఖ్యతను పేర్కొన్నారు. భారత్ భవిష్యత్తును ఉజ్వలంగా ఊహించుకోవాలని, దానిని నిజం చేసేందుకు ఆవిష్కరణలు చేయాలని, తద్వారా వికసిత భారత్ సాధన దిశగా తర్వాతి తరాన్ని నడిపించాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ అజయ్ సూద్ తన ప్రసంగంలో, భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు టెలికమ్యూనికేషన్స్ వెన్నెముక వంటిదని అన్నారు. దేశీయ ఆవిష్కరణలు, వ్యూహాత్మక విధాన ప్రణాళికలపై టెలికమ్యూనికేషన్స్ విభాగం నిరంతర దృష్టిని ఆయన అభినందించారు. ఈ రోజు ఆవిష్కరించిన డిజిటల్ కమ్యూనికేషన్ ఇతివృత్తం భారతదేశ అసాధారణ ప్రయాణానికి, ప్రపంచ 6జీ పోటీలో అగ్రగామిగా నిలవాలనే పెరుగుతున్న విశ్వాసానికి ప్రతిబింబమని ఆయన తెలిపారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్, రాబోయే రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ (ఆర్డిఐ) పథకం వంటి కార్యక్రమాలు ప్రపంచ టెక్నాలజీ నాయకత్వం కోసం భారత్ అన్వేషణలో కీలకమైన ప్రేరక శక్తులుగా పని చేస్తాయని ఆయన తెలిపారు.
ఈఎస్టీఐసీ - 2025 లో భాగంగా నవంబర్ 5న జరిగే డిజిటల్ కమ్యూనికేషన్ థీమెటిక్ సెషన్లో వైర్లెస్ కమ్యూనికేషన్స్‌లో విశిష్ట నిపుణులుగా పేరొందిన ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్ కుచి ప్రధానోపన్యాసం చేస్తారు. ఈ థీమెటిక్ సెషన్‌లో ప్రముఖ ఆలోచనాపరులు, ప్రాక్టిషనర్లు పాల్గొని డిజిటల్ కనెక్టివిటీ భవిష్యత్తు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్ నాయకత్వంపై చర్చిస్తారు.
స్వదేశీ టెలికాం ఆవిష్కరణ, ప్రామాణీకరణలో ప్రసిద్ధుడైన తేజస్ నెట్‌వర్క్స్ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు శ్రీ కుమార్ శివరాజన్, స్టార్టప్ వ్యవస్థలో విలక్షణ మార్పులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లేఖ వైర్‌లెస్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ శ్రీ రాము శ్రీనివాసయ్య, వీవీడిఎన్ టెక్నాలజీస్ సీటీఓ శ్రీ పునీత్ అగర్వాల్ థీమాటిక్ సెషన్‌లో ప్రసంగిస్తారు. స్వదేశీ టెలికాం తయారీ రంగంలో పెరుగుతున్న భారత్ శక్తిసామర్ధ్యాలను వారు వివరిస్తారు.
అనంతరం జరిగే ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ లో సి-డాట్ సీఈఓ డాక్టర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ దేశంలోని ప్రధాన టెలికాం ఆర్ అండ్ డి సంస్థ కార్యకలాపాలను వివరిస్తారు. బిఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎ. రాబర్ట్ జెరార్డ్ రవి, ప్రభుత్వ రంగ సంస్థల కీలక పాత్రను వివరిస్తారు. బెంగళూరులోని ఐటీసీ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పరాగ్ నాయక్ పరిశ్రమ నేతృత్వంలోని పరిశోధన, ఆవిష్కరణలపై ఆలోచనలను పంచుకుంటారు. విద్యా సంస్థల తరఫున ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి, ఐఐఎస్సీ బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ పంగనామాల విజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తారు, వీరిద్దరూ టెలికాం టెక్నాలజీలలో విద్యా రంగం నుంచి పరిశోధనా నైపుణ్యాన్ని వివరిస్తారు.
డిజిటల్ కమ్యూనికేషన్ ఇతివృత్తం విజయవంతమైన ప్రారంభం భారత సాంకేతిక భవిష్యత్తు కోసం కథనాన్ని శక్తిమంతంగా రూపొందించింది. ఇది గత విజయాలను దేశం 6జీ నాయకత్వ ఆకాంక్షలతో సాఫీగా అనుసంధానించింది. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో ‘ఆలోచన, ఆవిష్కరణ, స్ఫూర్తి‘ పట్ల భారత నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఈఎస్టీఐసీ - 2025లో అంతర్దృష్టి, ముందుచూపుతో కూడిన థీమాటిక్ సెషన్‌కు రంగం సిద్ధం చేసింది.
ఈఎస్టీఐసీ - 2025 కార్యక్రమాలు, పూర్తి షెడ్యుల్ కోసం https://estic.dst.gov.in. ను సందర్శించండి.
(Release ID: 2177514)
Visitor Counter : 6