కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాల ఐటీ మంత్రులు, ఐటీ కార్యదర్శులతో రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ వనరుల లభ్యతను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర సహకారంపై చర్చ

నియంత్రణ స్థాయి నుంచి సౌలభ్య స్థాయికి ప్రభుత్వ ప్రయాణం ప్రతి పౌరునికీ అత్యంత అవసరమైన అనుసంధానం, సమ్మిళితం, సమానత్వాన్ని అందించడానికి వీలు కల్పిస్తోంది: కేంద్ర మంత్రి శ్రీ సింధియా

నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడానికి, దేశవ్యాప్తంగా నాణ్యమైన డిజిటల్ సేవలను అందించడానికి సంస్కరణల అమలును వేగవంతం చేయాలని సమావేశం పిలుపు

Posted On: 08 OCT 2025 7:04PM by PIB Hyderabad

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రాల ఐటీ మంత్రులు,  ఐటీ కార్యదర్శులతో ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర ఎస్. పెమ్మసాని, కార్యదర్శి (టెలికాం) డాక్టర్ నీరజ్ మిట్టల్‌ కూడా పాల్గొన్నారు. 

ఈ సమావేశం డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి,  భారతదేశ డిజిటల్ వనరుల లభ్యత వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యం కోసం ఒక విలక్షణ వేదికగా నిలిచింది. అట్టడుగు స్థాయి వరకు అనుసంధానాన్ని మెరుగుపరచడం, గ్రామీణ,  మారుమూల ప్రాంతాలకు 4జీ, 5జీ విస్తరణను వేగవంతం చేయడం, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, జాతీయ డిజిటల్ దృష్టితో రాష్ట్ర విధానాలను సమన్వయం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ప్రపంచ డిజిటల్ శక్తిగా భారత్ అవతరించిన విధానాన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్రాడ్‌బ్యాండ్ లభ్యత, చౌకగా డేటా అండడంలో చోటుచేసుకున్న అపూర్వ వృద్ధిని ఆయన వివరించారు. ఈ మార్పును ముందుకు తీసుకెళ్లడంలో సహకార సమాఖ్య విధానం అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడం, ఉత్తమ పద్ధతులను అవలంబించడం,  రైట్ ఆఫ్ వే సంస్కరణలను త్వరగా అమలు చేయడం కోసం కేంద్రంతో సన్నిహితంగా పనిచేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు. రాష్ట్రాల స్థాయిలో విజయవంతమైన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా వినూత్న నమూనాలను విస్తరించడానికి పరస్పర అభ్యాసం,  సహకారం అవసరమని ఆయన అన్నారు. డిజిటలైజేషన్ ప్రయోజనాలు దేశం ప్రతి మూలలోని పౌరులకు చేరేలా చేయడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

"ప్రపంచ వేదికపై టెలికాం - డిజిటల్ కలయిక,  పరికరాల తయారీ రంగాలలో భారతదేశం ఫీనిక్స్ మాదిరి ఎదిగింది. నియంత్రణ స్థాయిని దాటి సులభతరం చేసే స్థాయికి మారడం వరకు ప్రభుత్వ ప్రయాణం ప్రతి పౌరుడికి అత్యంత అవసరమైన కనెక్టివిటీ, సమ్మిళితం, సమానత్వాన్ని అందించడానికి వీలు కల్పిస్తోంది" అని కేంద్ర మంత్రి అన్నారు. "భారత జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 2029-30 నాటికి 20%కి చేరుకోనుంది. ఈ మార్పు  కేవలం కేంద్రం ద్వారానే కాకుండా అన్ని రాష్ట్రాల సమష్టి శక్తితో నడుస్తోంది. సుస్థిర, సమీకృత, భవిష్యత్తుకు-సిద్ధంగా ఉన్న డిజిటల్ సానుకూల వ్యవస్థ కోసం ఈ అవకాశాన్ని మనం కలిసి అందిపుచ్చుకోవాలి" అని కూడా మంత్రి అన్నారు.

కమ్యూనికేషనస్ల సహాయ మంత్రి డాక్టర్ చంద్ర ఎస్. పెమ్మసాని మాట్లాడుతూ, భారత ప్రతిష్ఠాత్మక డిజిటల్ కనెక్టివిటీ లక్ష్యాలను సాధించడంలో రైట్-ఆఫ్-వే (ఆర్ఓడబ్ల్యూ) సంస్కరణల కీలక పాత్రను వివరించారు. కొత్త టెలికమ్యూనికేషన్ రైట్-ఆఫ్-వే రూల్స్ 2025 గురించి పేర్కొన్నారు. వీటిలో సింగిల్ విండో అనుమతులు, నిర్ణీత వ్యవధిలో ఆమోదాలు, ఒకే విధమైన  వ్యయ ఆధారిత ఛార్జీలు, మౌలిక సదుపాయాల భాగస్వామ్యం, పట్టణ ప్రణాళికలో డిజిటల్ కారిడార్ల సమగ్రీకరణ ఉన్నాయి. రాష్ట్రాల సమన్వయ చర్యల ఆవశ్యకతను స్పష్టం చేస్తూ, నెట్‌వర్క్ విస్తరణకు ఆటంకాలను తొలగించి, ప్రతి పౌరునికి అధిక నాణ్యత గల డిజిటల్ సేవలను అందించడానికి ఈ సంస్కరణలను వేగంగా అమలు చేయాలని ఆయన ఐటీ మంత్రులు,  కార్యదర్శులను కోరారు. నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ 2.0 విజయం రాష్ట్ర స్థాయిలో సమష్టి నాయకత్వం,  సకాలంలో అమలు చేయడంపై ఆధారపడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

“మన దగ్గర టెక్నాలజీ ఉందా అని చరిత్ర అడగదు, మనకు సంకల్పం ఉందా అని అడుగుతుంది. నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ 2.0 కింద అందరికీ సార్వత్రిక, చౌక, నాణ్యత గల బ్రాడ్‌బ్యాండ్ అందించాలనే నిబద్ధత మనకు ఉంది. 2025 టెలికమ్యూనికేషన్ రైట్-ఆఫ్-వే నిబంధనలు ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి మనకు మార్గాలను అందిస్తున్నాయి” అని డాక్టర్ పెమ్మసాని అన్నారు.

టెలికాం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ, డిజిటల్ మౌలిక సదుపాయాల విజయవంతమైన అమలులో రాష్ట్రాల కీలక పాత్రను వివరించారు. టెలికాం కేంద్ర పరిధిలోని అంశమైనప్పటికీ, దాని అమలు రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. రైట్ ఆఫ్ వే, భూ కేటాయింపులు, సైట్ యాక్సెస్ వంటి క్షేత్రస్థాయి సవాళ్లను పరిష్కరించడంలో రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. “క్షేత్రస్థాయిలో రాష్ట్రాల సహకారం లేకుండా ఏమీ జరగదు " అని స్పష్టం చేశారు. 

“టెలికాం కేంద్ర పరిధిలోని అంశమైనప్పటికీ, వాస్తవ అమలు రాష్ట్రాల్లోనే జరుగుతుంది. రైట్ ఆఫ్ వే, టవర్ల కోసం భూమి, స్థలంలోకి ప్రవేశం, స్థానిక శాంతిభద్రతలు వంటి సమస్యలకు అత్యంత సమన్వయం అవసరం.రాష్ట్ర మంత్రులు,  కార్యదర్శుల నుంచి  అభిప్రాయాలను స్వీకరించడానికి,  ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగానికి శక్తినిచ్చే ఒక సమాంతర సాంకేతికతగా టెలికాం రంగాన్ని కలిసి ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఎంతో విలువైనది” అని అన్నారు.

అడ్డంకులను గుర్తించడానికి, విధాన రూపకల్పనలో రాష్ట్రాల అభిప్రాయాలను చేర్చడానికి,  అన్ని రంగాలలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మద్దతు ఇచ్చే డిజిటల్ వ్యవస్థను సమష్టిగా బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర చర్చలకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ఒక కీలక వేదికను అందించింది. కనెక్టివిటీ ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి చేరేలా ధృఢమైన, సురక్షితమైన,  భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న డిజిటల్ వ్యవస్థ కోసం సమష్టిగా పని చేయాలనే భాగస్వామ్య నిబద్ధతను ప్రకటిస్తూ సమావేశం ముగిసింది.

 

***


(Release ID: 2176608) Visitor Counter : 7