రక్షణ మంత్రిత్వ శాఖ
వైమానిక దళ దినోత్సవ పరేడ్ 2025
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2025 6:03PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 08న భారత వైమానిక దళ (ఐఏఎఫ్) 93వ వార్షికోత్సవాన్ని ఘజియాబాద్‌లోని హిందన్‌లోని వైమానక దళ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్.. ఆర్మీ, నావిక దళాధిపతులు హాజరయ్యారు. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కవాతును సమీక్షించారు. కార్యక్రమంలో వైమానిక దళ మాజీ అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
గౌరవం, గర్వం, ఐక్యత, సామర్థ్యాన్ని తెలియజేసేలా రాష్ట్రపతి పతాకం (ప్రెసిడెంట్స్ కలర్స్) ప్రవేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కవాతు వద్దకు వైమానిక దళ చీఫ్ విచ్చేసిన అనంతరం జాతీయ జెండా, ఐఏఎఫ్ జెండా, ఆపరేషన్ సిందూర్ జెండాతో 'ధ్వజ్' రూపంలో మూడు ఎంఐ-17 1వి హెలికాప్టర్లు వైమానిక వందనం సమర్పించాయి. ఈ కవాతుకు జీపీ కెప్టెన్ చేతన్ ప్రదీప్ దేశ్‌పాండే నాయకత్వం వహించారు. సైనికుల కచ్చితమైన, శక్తిమంతమైన పాద కదలికలకు తగ్గట్టు ఉన్న ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ దేశభక్తి గీతాలు కవాతుకు ఉత్తేజాన్నిచ్చాయి. కవాతుకు సరిపోల్చుతూ ఆకాశంలో యుద్ధ విమానాల నిర్వహించిన విన్యాసాలు ప్రేక్షకులకు ఆకర్షించాయి. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఇవి శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయి. ఆరు బృంద పతకాలతో (యూనిట్ సైటెషన్స్) పాటు ఆరు విభాగాల్లో యుద్ధ విమానాల పైలట్లకు 97 పతాకాలను సీఏఎస్ అందించారు.
కవాతును ఉద్దేశించి మాట్లాడిన వైమానిక దళ చీఫ్.. సాధారణ ప్రారంభం నుంచి కచ్చితత్వం, వేగంతో సైనిక ఫలితాలను నిర్దేశించగల ‘ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా’ అవతరించటం వరకు భారత వైమానిక దళం చేసిన అసాధారణ ప్రయాణాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కచ్చితత్వంతో సాహసోపేతంగా చేసే దాడులు జాతీయ భద్రతలో వైమానిక దాడులకు ఉన్న సరైన స్థానాన్ని పునరుద్ధరిస్తాయన్న ఆయన.. ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళ పనితీరు పరాక్రమానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్వదేశీ సమీకృత ఆయుధాల పనితీరు పట్ల ఐఏఎఫ్ విశ్వాసంతో ఉన్నట్లు గర్వంగా ప్రకటించారు. వాటిని ఉపయోగించటంతో పాటు ఆవిష్కరణ పట్ల ఐఏఎఫ్ నిబద్ధతతో ఉందని తెలిపారు. 'మనం పోరాడినట్లుగా శిక్షణ ఇవ్వటం' అనే సూత్రం ఆధారంగా శిక్షణ, ప్రణాళిక విషయంలో ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఒక ఆవిష్కరణల వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐఏఎఫ్‌కు చెందిన వివిధ విభాగాలలోని సైనికుల ఆలోచనలు, వారు రూపొందించిన పరిష్కారాలను ప్రదర్శించారు. దీనితో పాటు గడిచిన సంవత్సర ప్రయాణాన్ని తెలియజేసే ప్రత్యేక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సవాళ్లు, విజయాలు, భారత వైమానిక దళం చూపించిన అసమాన అంకితభావాన్ని ప్రదర్శించారు.
ఈ వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన చారిత్రక విమానాల అద్భుతమైన వైమానిక ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చారిత్రక ‘టైగర్ మాత్’, ‘హెచ్‌టీ-2’ విమానాల ఉమ్మడి ప్రదర్శన తర్వాత.. చారిత్రక ‘హార్వర్డ్’ విమానం ఒంటరి ప్రదర్శన చేసింది. ఈ చారిత్రక విమానాల వైమానిక ప్రదర్శన భారత వాయు సేనకు ఉన్న గర్వించదగిన చరిత్ర, దేశానికి చేస్తోన్న నిరంతర సేవకు సాక్షాత్కారంగా నిలిచింది. వైమానిక దళ దినోత్సవ వేడుకల సంప్రదాయ వైమానిక వందనం, ప్రదర్శనలు 2025 నవంబర్ 09న గౌహతిలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సీ-17 గ్లోబ్‌మాస్టర్, ఎస్‌యూ-30 ఎంకేఐ, అపాచీ, మిగ్-29, మిగ్-21 బైసన్, రాఫెల్, ఏఎల్‌హెచ్ ఎంకే-IIl, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, సీ-130 జే సూపర్ హెర్క్యులస్, ఆకాష్ మిస్సైల్ వ్యవస్థ, రోహిణి రాడార్ వంటి అత్యాధునిక విమానాలు, పరికరాల ప్రదర్శనను కూడా నిర్వహించారు.
‘భారత వాయు సేన: అమోఘం, అజేయం, కచ్చితం’ అనే ఇతివృత్తంతో గత 93 సంవత్సరాలుగా భారతదేశానికి అచంచలమైన అంకితభావంతో వైమానిక దళం చేస్తోన్న అసమాన సేవను ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2176607)
సందర్శకుల సూచీ సంఖ్య : : 52