లోక్‌సభ సచివాలయం
2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీసదస్సు (సీపీసీ) లో పాల్గొనేందుకు బార్బడోస్ చేరుకున్న లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
సాంకేతికత వినియోగం, డిజిటల్ మార్పుల ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం, డిజిటల్ అసమానతలను పరిష్కరించడంపై వర్క్‌షాప్ కు అధ్యక్షత వహించనున్న లోక్‌సభ స్పీకర్
68వ సీపీసీ జనరల్ అసెంబ్లీలో సదస్సు ఇతివృత్తం “ప్రపంచభాగస్వామిగా కామన్వెల్త్” పై ప్రసంగించనున్న శ్రీ ఓం బిర్లా
Posted On:
08 OCT 2025 6:52PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు (సీపీసీ) లో పాల్గొనేందుకు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌కు చేరుకున్నారు. ఆయన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు కామన్వెల్త్ దేశాల పార్లమెంటేరియన్లు పాల్గొనే అతిపెద్ద సమావేశాలలో ఒకటి. పార్లమెంటరీ దౌత్యం, సహకారం ద్వారా ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, సుపరిపాలనను ప్రోత్సహించడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంపై చర్చలకు, ఆలోచనల మార్పిడికి ఒక వేదికను అందిస్తుంది.
బ్రిడ్జ్‌టౌన్‌కు వచ్చిన వెంటనే, స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంది.
భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, పార్లమెంట్ సభ్యుడు, సీపీఏ కార్యవర్గ సభ్యుడు శ్రీ అనురాగ్ శర్మ, పార్లమెంట్ సభ్యుడు,సీడబ్ల్యూపీ సారథ్య సంఘం సభ్యురాలు డాక్టర్ డి. పురందేశ్వరి, ఎంపీ డాక్టర్ కె. సుధాకర్, ఎంపీ శ్రీమతి రేఖా శర్మ, ఎంపీ డాక్టర్ అజీత్ మాధవరావు గోప్చాడే, లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి.సి. మోదీ ఉన్నారు.
సదస్సులో భాగంగా, స్పీకర్ శ్రీ ఓం బిర్లా "సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం: డిజిటల్ మార్పుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ అసమానతలను పరిష్కరించడం’’ పై జరిగే ఒక కీలకమైన వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహిస్తారు.
ప్రజాస్వామ్య విలువలు, సమ్మిళిత పాలన, పార్లమెంటరీ పారదర్శకత, ప్రపంచ పార్లమెంటరీ సహకారం పట్ల భారతదేశ నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, “ది కామన్వెల్త్: ఎ గ్లోబల్ పార్టనర్” అనే ఇతివృత్తంపై సదస్సు జనరల్ అసెంబ్లీలో కూడా శ్రీ బిర్లా ప్రసంగిస్తారు.
ఈ సదస్సు లో సమకాలీన సమస్యలపై ఏడు ఇతివృత్త ఆధారిత వర్క్‌షాప్‌లు జరుగుతాయి. భారతదేశంలోని 24 రాష్ట్ర, /కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల నుంచి 36 మంది ప్రిసైడింగ్ అధికారులతో సహా భారత ప్రతినిధి బృందంలోని సభ్యులు ఈ వర్క్‌షాప్‌లలో పాల్గొంటారు.
వారం రోజుల పాటు జరిగే ఈ సదస్సు సందర్భంగా, శ్రీ బిర్లా ఇతర కామన్వెల్త్ దేశాలలోని తన సహచరులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరుపుతారు. ఈ సమావేశాలలో పరస్పర ప్రయోజనకరమైన అంశాలపైన, పార్లమెంటరీ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం పైనా చర్చిస్తారు.
‘ది కామన్వెల్త్ - ఎ గ్లోబల్ పార్టనర్’ అనే ఇతివృత్తంతో బార్బడోస్ పార్లమెంట్, సీపీఏ బార్బడోస్ విభాగం ఆతిథ్యం ఇస్తున్న 68వ సీపీసీ కామన్వెల్త్ దేశాల నుంచి 180కి పైగా జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ శాసనసభలకు చెందిన 600 మందికి పైగా ప్రతినిధులను ఒక వేదిక పైకి చేర్చింది.
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కార్యక్రమాలలో భారతదేశం చురుకుగా పాల్గొంటోంది. పార్లమెంటరీ సహకారం, సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ప్రపంచ ప్రజాస్వామ్య చర్చలను బలోపేతం చేయడానికి స్థిరంగా దోహదపడుతోంది.
****
(Release ID: 2176576)
Visitor Counter : 6