బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్ ఇండియాలో పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే మొదటి సెంట్రల్ స్టోర్ యూనిట్‌ ఎస్ఈసీఎల్ కోర్బాలో ప్రారంభం


ప్రభుత్వ ప్రత్యేక ప్రచారం 5.0 పరిధిలో మహిళా నేతృత్వ అభివృద్ధి దిశగా మరో విజయం

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2025 5:37PM by PIB Hyderabad

ప్రధాన పారిశ్రామిక రంగాల్లో మహిళల నాయకత్వాన్ని పెంపొందించడంలో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థ- సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ (ఎస్ఈసీఎల్)లో పూర్తిగా మహిళలే నిర్వహించే సెంట్రల్ స్టోర్ యూనిట్‌ను ఈ రోజు ప్రారంభించారు. కోర్బాలో సంస్థకు చెందిన సెంట్రల్ వర్క్ షాపులో ఈ యూనిట్ ఉంది.

భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచారం 5.0లో భాగంగా దీన్ని ప్రారంభించారు. కోల్ ఇండియాలో మొదటిసారిగా బిలాస్‌పూర్లో పూర్తిగా మహిళలే నిర్వహించే డిస్పెన్సరీని ఏర్పాటు చేసి ఎస్ఈసీఎల్ సాధించిన విజయం అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నారీశక్తి ద్వారా దేశానికి శక్తి అనే నినాదం పట్ల సంస్థకున్న చిత్తశుద్ధిని ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.

విడి భాగాల సరఫరా, జాబితా నిర్వహణను ఈ కొత్త సెంట్రల్ స్టోర్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను 8 మంది అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక మహిళా బృందం నిర్వహిస్తుంది. ఈ బృందానికి సీనియర్ మేనేజర్ (ఈ అండ్ ఎం) సప్నా ఇక్కా నాయకత్వం వహిస్తారు. ఆమె ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్ పూర్వ విద్యార్థిని. సమర్థమైన, పారదర్శకమైన రికార్డుల నిర్వహణకు అత్యాధునిక ఎస్ఏపీ ఆధారిత డిజిటల్ వ్యవస్థను ఈ కేంద్రం ఉపయోగించుకుంటుంది.

దీప ప్రజ్వలనతో ప్రారంభోత్సవం మొదలైంది. అనంతరం ఎస్ఈసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హరీశ్ దుహాన్ ఈ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (టెక్నికల్/ఆపరేషన్స్) శ్రీ ఎన్ ఫ్రాంక్లిన్ జైకుమార్, డైరెక్టర్ (హెచ్‌ఆర్) శ్రీ బిరంచీ దాస్, డైరెక్టర్ (టెక్నికల్/ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) ఆర్సీ మహాపాత్ర, ఎస్ఈసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి శ్రీ హిమాంశు జైన్ పాల్గొన్నారు. వర్కుషాపులో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగినులను ఈ సందర్భంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సీఎండీ శ్రీ హరీశ్ దుహాన్ మాట్లాడుతూ.. కోల్ ఇండియాలో సమ్మిళిత అభివృద్ధి దిశగా వేసిన ముందడుగుగా ఈ కార్యక్రమాన్ని వర్ణించారు. ‘‘బిలాస్‌పూర్లో మహిళలు నిర్వహిస్తున్న డిస్పెన్సరీ విజయం అనంతరం కోర్బాలో ప్రధాన యూనిట్ నిర్వహణ బాధ్యతలను మహిళలు స్వీకరించడం గర్వంగా ఉంది. బొగ్గు రంగంలో మహిళల భాగస్వామ్యం, నాయకత్వం విస్తరించాలనే కేంద్ర బొగ్గు మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఆశయాలను ఇలాంటి కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి’’ అని అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. స్త్రీపురుష సమ్మిళిత్వం, స్వయం సమృద్ధి సాధించిన పారిశ్రామిక కార్యకలాపాల దిశగా కోల్ ఇండియా సాగిస్తున్న ప్రయాణంలో మరో విజయాన్ని పూర్తిగా మహిళలే నిర్వహించే ఈ కేంద్రీయ స్టోర్ యూనిట్ ఏర్పాటు తెలియజేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2175244) సందర్శకుల సూచీ సంఖ్య : : 59
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी