రక్షణ మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 9,10 తేదీలలో రక్షణ మంత్రి ఆస్ట్రేలియా పర్యటన
Posted On:
05 OCT 2025 5:31PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి శ్రీ రిచర్డ్ మార్లెస్ ఆహ్వానం మేరకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 09-10, 2025 తేదీలలో ఆస్ట్రేలియాలో రెండు రోజులు అధికారికంగా పర్యటిస్తారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్పీ) ఏర్పడి 5 ఏళ్లు పూర్తయిన చారిత్రాత్మక తరుణంలో ఈ పర్యటన జరుగుతోంది. 2014 తరువాత భారత్ నుంచి ఓ రక్షణ మంత్రి ఆస్ట్రేలియాలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి.
రక్షణ మంత్రి పర్యటనలో ముఖ్యమైన అంశం ఆయన ఆస్ట్రేలియా రక్షణ మంత్రితో జరిపే ద్వైపాక్షిక చర్చలు. సిడ్నీలో జరిగే బిజినెస్ రౌండ్‌టేబుల్‌కు ఆయన అధ్యక్షత వహిస్తారు, దీనికి ఇరు దేశాల పారిశ్రామిక నేతలు హాజరవుతారు. ఆస్ట్రేలియాలోని ఇతర జాతీయ నాయకులతో కూడా శ్రీ రాజ్‌నాథ్ సమావేశమవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను, రక్షణ రంగ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త, అర్థవంతమైన కార్యక్రమాలను అన్వేషించడానికి ఈ పర్యటన ఇరుపక్షాలకు ఒక సదవకాశాన్ని అందిస్తుంది.
ఈ పర్యటనలో భాగంగా సమాచార మార్పిడి, సముద్ర వ్యవహారాలు, ఉమ్మడి కార్యకలాపాల్లో సహకారాన్ని మరింత పెంపొందించే మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రెండు దేశాల మధ్య రక్షణ కార్యకలాపాలు కాలక్రమేణా విస్తరించాయి. వీటిలో సైనిక, నావిక,వైమానిక దళాల మధ్య విస్తృత స్థాయిలో పరస్పర సమావేశాలు, సైనిక దళాల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, ఉన్నత స్థాయి పర్యటనలు, సామర్థ్య పెంపు, శిక్షణాకార్యక్రమాలు, సముద్ర వ్యవహారాల్లో సహకారం, నౌకల సందర్శనలు, ద్వైపాక్షిక విన్యాసాలు మొదలైనవి ఉన్నాయి.
భారత్, ఆస్ట్రేలియా దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను 2009లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి నుంచి 2020లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య (సీఎస్పీ) స్థాయికి పెంచుకున్నాయి. బహుళత్వం, వెస్ట్‌మిన్‌స్టర్ తరహా ప్రజాస్వామ్యాలు, కామన్వెల్త్ సంప్రదాయాలు, పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు, ఉన్నత స్థాయి పరస్పర సమావేశాల ద్వారా ఉమ్మడి విలువలతో కూడిన ప్రగాఢ బంధాన్ని ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. చాలా కాలంగా ప్రజల మధ్య ఉన్న సంబంధాలు, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల ఉనికి, పటిష్టమైన పర్యాటక, క్రీడా సంబంధాలు ఇరు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి.
ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి శ్రీ రిచర్డ్ మార్లెస్ ఈ ఏడాది జూన్ నెలలో భారతదేశాన్ని సందర్శించారు. అప్పుడు ఆయన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కూడా కలిశారు.
***
(Release ID: 2175163)
Visitor Counter : 3