పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సంరక్షణకు రూ.82 లక్షలు మంజూరు చేసిన జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ
Posted On:
29 SEP 2025 12:48PM by PIB Hyderabad
ఒక ప్రాంతానికే పరిమితమైన అరుదైన వృక్షజాతిని సంరక్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలికి జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ రూ.82 లక్షలను మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఒక లక్ష ఎర్రచందనం (టెరోకార్పస్ శాంటాలినస్) మొక్కలను పెంచి, వాటిని రైతులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అడవికి బయట చెట్లను పెంచడానికి తోడ్పాటును అందించడమే కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పెరుగుతున్న ఈ వృక్షజాతిని కాపాడే దిశగా ఈ చర్య తీసుకున్నారు.
ఎర్రచందనాన్ని వినియోగించే వారి వద్ద నుంచి లాభాన్ని పంచుకొనే పద్ధతిలో సేకరించిన సొమ్ములో నుంచి ఈ నిధులను అందించారు. ఈ నిధులను సంరక్షణ సంబంధిత కార్యకలాపాల నిమిత్తం ఆసక్తి ఉన్న వర్గాలకు తిరిగి అందిస్తారు. ఈ నిధులు ఆసక్తిదారులు విక్రయాల ద్వారా వచ్చే నిధులకు అదనం. ఈ నిధులను జీవవైవిధ్య చట్టం-2002 (ఈ చట్టానికి 2023లో సవరణ చేశారు)లో పేర్కొన్న లభ్యత, లాభాల పంపిణీ (యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్..ఏబీఎస్) వ్యవస్థ ప్రకారం మంజూరు చేశారు. బయలాజికల్ వనరుల లభ్యతను ఏబీఎస్ వ్యవస్థ నియంత్రిస్తోంది. దీంతో పాటు స్థానికులు, వ్యక్తులు, జీవవైవిధ్య నిర్వహణ సంఘాలు (బీఎంసీ) సహా లబ్ధిదారుల మధ్య లాభాల పంపకం పక్షపాత రహితంగానూ, న్యాయంగానూ ఉండేలా కూడా ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తోంది. ఈ ప్రకారంగా విధానాలను అమలు చేసి, స్థానికుల ప్రమేయంతో సంరక్షణను ఎలా చేపట్టడానికి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ.
ఆంగ్ల భాషలో రెడ్ శాండర్స్‌గా వ్యవహరించే ఎర్రచందనం మొక్కలు ముఖ్యంగా ఆగ్నేయ కనుమల ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. విశేషించి అనంతపురం, చిత్తూరు, కడపలతో పాటు కర్నూలు జిల్లాల్లో కనిపించే ఎర్రచందనం వాణిజ్య పరంగా చాలా ఖరీదైంది. ఈ కారణంగా దీనికి భారీ ముప్పు పొంచి ఉంది. దీనిని పెద్ద ఎత్తున దొంగరవాణా చేస్తున్నారు. ఈ జాతి మొక్కలను వన్యప్రాణి పరిరక్షణ చట్టం-1972 నియమ నిబంధనలను అనుసరిస్తూ, రక్షిస్తున్నారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్‌నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజర్‌డ్ స్పీసీస్ (సీఐటీఈఎస్)లో ఎర్ర చందనం ఉంది. వీటి అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించారు.
ఎర్ర చందనం సంరక్షణతో పాటు పరిరక్షణ సంబంధిత కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ విభాగానికి రూ.31.55 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే ఎన్‌బీఏ అందజేసింది. తాజాగా మంజూరు చేసిన సొమ్మును జీవవైవిధ్య నిర్వహణ సంఘాల సాయంతో క్షేత్ర స్థాయిలో సంరక్షణ ప్రధాన కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు. మొక్కల పెంపక కేంద్రాలను అభివృద్ధి చేయడం, తోటల సాగును చేపట్టడం, దీర్ఘకాలిక రక్షణ చర్యలు తీసుకోవడం, ఉపాధిని కల్పించడం, నైపుణ్య సాధన యత్నాలను ప్రోత్సహించడం, జీవ శాస్త్ర సంబంధిత వనరుల సంరక్షణ బాధ్యతలో స్థానిక నాయకత్వాన్ని తీర్చిదిద్దడం వంటి పనుల్లో స్థానికులతో పాటు గిరిజనులు కూడా పాలుపంచుకుంటారు.
భారత్ నిర్దేశించుకున్న జాతీయ జీవవైవిధ్య లక్ష్యాలను ఈ కార్యక్రమం బలపరుస్తుంది. ప్రపంచ స్థాయి జీవవైవిధ్య సమ్మేళనం (కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ...సీబీడీ) తీర్మానాలకు మన దేశం కట్టుబడి ఉంది.
***
(Release ID: 2172725)
Visitor Counter : 31