ఆయుష్
పశు ఆరోగ్య సంరక్షణలో సంయుక్త పరిశోధన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్‌టీవీయూ) మధ్య అవగాహన ఒప్పందం
Posted On:
23 SEP 2025 4:55PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్‌టీవీయూ)లు ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. పశువైద్య శాస్త్రాల రంగంలో విద్యా సంబంధిత కార్యకలాపాలతో పాటు పరిశోధనలోనూ సహకారాన్ని పెంపొందించుకోవాలనేది ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.
ఎంఓయూపై సీసీఆర్ఏఎస్ పక్షాన హైదరాబాద్‌లోని సీసీఆర్ఏఎస్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్ఐఎమ్హెచ్) అసిస్టెంట్ డైరెక్టర్ ఇంచార్జి డాక్టర్ గోలి పెంచల ప్రసాద్, పీవీఎన్ఆర్‌టీవీయూ తరఫున రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎ. శరత్చంద్ర అమరావతి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీవీఎన్ఆర్‌టీవీయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం. జ్ఞాన ప్రకాశ్, సీసీఆర్ఏఎస్ డిప్యూటీ డైరెక్టర్-జనరల్ డాక్టర్ నారాయణం శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీవీఎన్ఆర్‌టీవీయూ పరిశోధన విభాగం డైరెక్టరు డాక్టర్ హరికృష్ణ, విద్యార్థి వ్యవహారాల డైరెక్టరు డాక్టర్ సతీశ్ కుమార్, అధ్యాపక బృంద అధిపతి డాక్టర్ ఎం. ఉదయ్ కుమార్, ఎక్స్టెన్షన్ డైరెక్టరు డాక్టర్ ఎం. కిషన్ కుమార్, ఎగ్జామినేషన్స్ కంట్రోలరు డాక్టర్ జయలక్ష్మి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరినరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బీసం శ్రీనివాస్‌లతో పాటు హైదరాబాద్‌లోని సీసీఆర్ఏఎస్-ఎన్ఐఎమ్‌హెచ్‌కు చెందిన పరిశోధక అధికారులు (ఆయుర్వేద) డాక్టర్ సాకేత్ రాం త్రిగుళ్ల, డాక్టర్ సంతోష్ మానే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఒప్పందం ముఖ్యాంశాలు
సంయుక్త పరిశోధన, విద్యారంగ కార్యక్రమాలు: ఇరు పక్షాల ప్రయోజనాలూ ముడిపడి ఉన్న రంగాల్లో సహకార ప్రధాన ప్రాజెక్టులను రెండు సంస్థల అధ్యాపక బృందం, పరిశోధకులు, శాస్త్రవేత్తలు చేపడతారు. పశువులకు వచ్చే వ్యాధుల చికిత్సా పద్ధతులు, ఆధునిక రోగనిర్ధారణ ఉపకరణాలను అభివృద్ధి చేయడంతో పాటు పశుగణ నిర్వహణ, పోషణ, పశువైద్యానికి సంబంధించి ప్రయోగశాల స్థాయిలో అందుకున్న ఫలితాలను ఆచరణలోకి ఎలా తీసుకురావచ్చో పరిశోధన చేయడంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు.
జ్ఞానాన్నీ, మౌలిక సదుపాయాలనూ పరస్పరం పంచుకోవడం: పరిశోధనకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు పశువుల కేంద్రాలను ఇరు పక్షాలూ వినియోగించుకోవడానికి ఈ అవగాహన ఒప్పందం వీలు కల్పిస్తుంది. అయితే ఇందుకు ఒక సంయుక్త సమన్వయ సంఘం (సీసీ) ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. కలిసి ముందుకు పోవడానికి ప్రత్యేక వనరులను వినియోగించుకోవడాన్ని ఈ పద్ధతిలో పెంచుకోవచ్చును.
విద్యార్థులు, అధ్యాపక బృందాల మధ్య అనుబంధం: పీవీ నరనరసింహారావు తెలంగాణ వెటరినరీ యూనివర్సిటీ ఎంవీఎస్సీ పీహెచ్‌డీ విద్యార్థులకు సహ మార్గదర్శకులుగా గాని లేదా సమ్మిళిత అధ్యాపక బృందం (అడ్జంక్ట్ ఫేకల్టీ)గా గాని వ్యవహరించడానికి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ శాస్త్రవేత్తలను నియమించేందుకు అవకాశం లభిస్తుంది. లెక్చర్లు, ప్రాక్టికల్ డెమానిస్ట్రేషన్లు, ప్రాజెక్టు వర్కుల కోసం పీవీ నరనరసింహారావు తెలంగాణ వెటరినరీ యూనివర్సిటీ విద్యార్థులు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ప్రయోగశాలలకు వెళ్లేందుకు కూడా ఈ అవగాహన ఒప్పందం బాట వేస్తుంది. అంతేకాకుండా, ఆహార విజ్ఞానశాస్త్రాలలో, ‘వన్ హెల్త్’లో పరిశోధన చేపట్టడానికీ, పరిశోధన చేసే పద్ధతులపై అవగాహనను ఏర్పరుచుకోవడానికీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకూ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
ప్రచురణ, మేధో సంపత్తి: పరిశోధన నివేదికలను ఆయా పరిశోధనలో పాలుపంచుకున్న ఇరు సంస్థల వారికీ తగిన గుర్తింపునిస్తూ, అందరికీ అందుబాటులో ఉండే పత్రికల్లో ప్రచురిస్తారు. సంయుక్త ప్రాజెక్టుల ద్వారా ఆవిష్కరించిన మేధో సంపత్తిపై ఉభయ సంస్థలకూ హక్కులు ఉంటాయి. ఈ మేధో సంపత్తికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను సహకారాన్ని అందించిన నిష్పత్తి ప్రకారం రెండు సంస్థలూ పంచుకుంటాయి.
ఆర్థిక ప్రాతిపదికంటూ లేని ఈ ఎంఓయూను మొదట్లో అయిదు సంవత్సరాల పాటు అమలు చేస్తారు. మానవ స్వాస్థ్య రంగంలోనూ, పశుచికిత్స రంగంలోనూ ఎదురవుతున్న తీవ్ర సవాళ్లను పరిష్కరించడానికి సాంప్రదాయక ఆయుర్వేద జ్ఞానంతో ఆధునిక పశువైద్య శాస్త్రాన్ని మిళితం చేసే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు ఈ ఎంఓయూ. ఈ భాగస్వామ్యం పశు సంపద, పశు సంరక్షణ రంగాల్లో వినూత్న పరిష్కారాలను అందించి, విస్తృత ‘వన్ హెల్త్’ భావనకు ఊతాన్నిస్తుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2170559)
Visitor Counter : 7