ప్రధాన మంత్రి కార్యాలయం
గాయత్రి పరివార్ నిర్వహించిన అశ్వమేధ యాగం... ప్రధానమంత్రి వీడియో సందేశం
Posted On:
25 FEB 2024 9:12AM by PIB Hyderabad
గాయత్రి పరివార్ భక్తులందరూ, సామాజిక కార్యకర్తలు- సాధకులు, మహిళలు, సజ్జనులారా..
గాయత్రి పరివార్ నిర్వహించే ఏ కార్యక్రమం అయినా పవిత్రతతో లోతైన అనుబంధం కలిగి ఉంటుంది. వీటిలో పాల్గొనడం చాలా అదృష్టం. ఈ రోజు దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ అశ్వమేధ యాగంలో పాల్గొనడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ అశ్వమేధ యాగంలో పాల్గొనమని గాయత్రి పరివార్ నుంచి నాకు ఆహ్వానం వచ్చినప్పుడు సమయాభావం కారణంగా నేను సందిగ్ధతలో ఉన్నాను. వీడియో ద్వారా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొనటం గురించి కూడా సందిగ్ధత ఉంది. సమస్య ఏమిటంటే సామాన్యులు అశ్వమేధ యాగాన్ని అధికార చిహ్నంగా పరిగణిస్తారు. ఎన్నికలు సమీపిస్తోన్నందున ఈ యాగాన్ని వేరేగా అర్థం చేసుకోవడం సహజం. కానీ ఈ యాగం ఆచార్య శ్రీరామ్ శర్మ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తోందని, ఇది అశ్వమేధ యాగాన్ని పునర్నిర్వచిస్తున్నట్లు తెలుసుకోవటంతో నా సందిగ్ధతలన్నీ తొలగిపోయాయి.
ఈ రోజు గాయత్రి పరివార్ నిర్వహించే అశ్వమేధ యాగం.. సామాజిక మార్పునకు సంబంధించిన ఒక గొప్ప కార్యక్రమంగా తయరైంది. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది యువత వ్యసనం, చెడు అలవాట్ల జోలికి పోరు. వారి అపరిమిత శక్తి దేశ నిర్మాణానికి దోహదపడుతుంది. వాస్తవానికి యువతే మన దేశ భవిష్యత్తు. వారి అభివృద్ధి అంటే దేశ భవిష్యత్తు అభివృద్ధే. 'అమృత కాలంలో' భారత్‌ను అభివృద్ధి చేయడం అనేది యువత బాధ్యత. ఈ యాగానికి సంబంధించి గాయత్రి పరివార్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాయత్రి పరివార్‌లోని వందలాది మంది నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరందరూ భక్తితో సమాజాన్ని శక్తివంతం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. శ్రీరామ్ శర్మ గారి తర్కం, ఆయన చెప్పిన వాస్తవ విషయాలు, చెడుపై పోరాటంలో ఆయన చూపించిన ధైర్యం, ఆయన వ్యక్తిగత జీవితానికి ఉన్న స్వచ్ఛత అందరికీ స్ఫూర్తిదాయకం. ఆచార్య శ్రీరామ్ శర్మ, భగవతి మాత చెప్పిన వాటిని మీరు ముందుకు తీసుకువెళ్తోన్న విధానం నిజంగా ప్రశంసనీయం.
మిత్రులారా,
వ్యసనం అనేది ఒక అలవాటు. దానిని నియంత్రించకపోతే అది ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది సమాజంతో పాటు దేశానికి చాలా నష్టం కలిగిస్తుంది. అందుకే మన ప్రభుత్వం 3-4 సంవత్సరాల క్రితం మాదకద్రవ్య రహిత భారత్ కోసం దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేను నా 'మన్ కీ బాత్'లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో 11 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ, ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాలను నిర్వహించాం. ప్రజల్లో అవగాహన పెంచడానికి వీధి నాటకాల ప్రదర్శనలు చేపట్టాం. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో సామాజిక, మతపరమైన సంస్థలు కూడా పాల్గొన్నాయి. గాయత్రి పరివార్ కూడా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొంటోంది. దేశవ్యాప్తంగా వ్యసన వ్యతిరేక సందేశాన్ని పంపించటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎండిన గడ్డి కుప్పకు మంట అంటుకున్నప్పుడు దానిపై నీళ్లు చల్లటం, మట్టి వేయడం లాంటివి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మరింత తెలివైన వ్యక్తి సురక్షితమైన గడ్డిని మంటల నుంచి కాపాడే ప్రయత్నం చేస్తాడు. నేటి కాలంలో గాయత్రి పరివార్ అశ్వమేధ యాగం ఈ స్ఫూర్తికి అంకితమైంది. మన యువతను వ్యసనం నుంచి బయటపడేయాలి.. వ్యసనాల గుప్పిట్లో ఉన్న వారిని కూడా విముక్తి చేయాలి.
మిత్రులారా,
మన దేశ యువతను పెద్ద లక్ష్యాలతో ఎంత ఎక్కువగా అనుసంధానిస్తే అంత ఎక్కువగా వారు చిన్న చిన్న తప్పులను చేయరు. నేడు 'అభివృద్ధి చెందిన దేశం' అనే లక్ష్యం వైపు భారత్ పనిచేస్తోంది.. 'ఆత్మనిర్భర్' అనే లక్ష్యం వైపు పయనిస్తోంది. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు' అనే ఇతివృత్తంతో జీ-20 శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం నిర్వహించడాన్ని మీరు చూశారు. నేడు ప్రపంచం 'ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒకే గ్రిడ్' వంటి ఉమ్మడి ప్రాజెక్టులపై పనిచేయడానికి సిద్ధంగా ఉంది. 'ఒక ప్రపంచం, ఒక ఆరోగ్యం' వంటి మిషన్లు మన మానవుల ఉమ్మడి భావాలు, లక్ష్యాలకు సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఇటువంటి జాతీయ, ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో మన దేశ యువత ఎంత ఎక్కువగా పాల్గొంటే, అంత ఎక్కువగా వారు తప్పుడు దిశలో పయనించరు. నేడు ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది.. నేడు ప్రభుత్వం శాస్త్రీయ పరిశోధనలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. చంద్రయాన్ విజయం యువతలో సాంకేతికత పట్ల కొత్త ఆసక్తిని సృష్టించిన తీరును మీరు చూశారు. ఇలాంటి ప్రతి పని, ప్రతి కార్యక్రమం.. తమ శక్తిని సరైన దిశలో మళ్లించాలని దేశ యువతకు ప్రేరణనిస్తుంది. ఫిట్ ఇండియా కార్యక్రమం అయినా లేదా ఖేలో ఇండియా పోటీ అయినా.. ఈ పనులు, కార్యక్రమాలు దేశ యువతను ప్రేరేపిస్తాయి. ప్రేరణ పొందిన యువత వ్యసనం వైపు వెళ్లలేరు. దేశ యువత పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం 'మేరా యువ భారత్' పేరుతో చాలా పెద్ద సంస్థను కూడా ఏర్పాటుచేసింది. కేవలం మూడు నెలల్లో దాదాపు 1.5 కోట్ల మంది యువత ఈ సంస్థలో చేరారు. ఇది 'వికసిత్ భారత్' కలను సాకారం చేసుకోవడంలో యువత శక్తిని సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది.
మిత్రులారా,
దేశాన్ని వ్యసనం అనే ఈ సమస్య నుంచి విముక్తి చేయడంలో కుటుంబం, మన కుటుంబ విలువలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. వ్యసనం నుంచి విముక్తి చేయటం అనే దానిని మనం విడివిడిగా చూడలేం. కుటుంబం అనే వ్యవస్థ బలహీనపడినప్పుడు, కుటుంబ విలువలు క్షీణించినప్పుడు.. దాని ప్రభావం ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో ఉమ్మడి భావోద్వేగాలు లేనప్పుడు, కుటుంబ సభ్యులు చాలా రోజులు ఒకరినొకరు కలవనప్పుడు- కలిసి కూర్చోనప్పుడు, తమ ఆనందాలను- దుఃఖాలను పంచుకోనప్పుడు.. ఇటువంటి ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలోని ప్రతిఒక్కరు సొంత మొబైల్ ఫోన్‌లో మునిగిపోతే.. వారి ప్రపంచం చాలా చిన్నదిగా మారుతుంది. అందుకే దేశాన్ని వ్యసన రహితంగా మార్చేందుకు.. కుటుంబం ఒక వ్యవస్థ రూపంలో బలంగా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం.
మిత్రులారా,
రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో.. భారత్‌కు సంబంధించిన వెయ్యి సంవత్సరాల కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని నేను చెప్పాను. స్వాతంత్ర్య భారతదేశ 'అమృత కాలంలో' ఆ కొత్త యుగం ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. వ్యక్తిగత అభివృద్ధి ద్వారా జాతి నిర్మాణం సాధించాలనే భారీ లక్ష్యం దిశగా మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇదే సంకల్పంతో గాయత్రి పరివార్‌కు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీలో చేసిన ప్రసంగం అనువాదం ఇది.
***
(Release ID: 2168849)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam