యు పి ఎస్ సి
యూపీఎస్సీ అభ్యర్థుల ధ్రువీకరణకు ప్రయోగాత్మకంగా ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు విధానం
ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు ప్రయోగం తెలివైన, సురక్షితమైన, సమర్థవంతమైన
పరీక్షా విధానానికి ముందడుగు: డాక్టర్ అజయ్ కుమార్
Posted On:
18 SEP 2025 3:51PM by PIB Hyderabad
ఇటీవల (సెప్టెంబర్ 14న) నిర్వహించిన ఎన్డీఏ, ఎన్ఏ II, సీడీఎస్ II పరీక్షల్లో అభ్యర్థుల వేగవంతమైన, సురక్షిత గుర్తింపు కోసం కృత్రిమ మేధ ఆధారిత ముఖ గుర్తింపు సాంకేతికతను పరీక్షించేందుకు ప్రయోగాత్మక కార్యక్రమాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా నిర్వహించింది.
జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం.. పరీక్షా ప్రక్రియలో నైతికతను పెంపొందించడంతో పాటు, పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ప్రవేశాన్ని మరింత సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని గురుగ్రామ్‌లో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఇక్కడ అభ్యర్థుల ముఖ చిత్రాలను వారి నమోదు సమయంలో సమర్పించిన ఫోటోలతో డిజిటల్‌గా సరిపోల్చారు. ఈ కొత్త సాంకేతిక విధానంతో ప్రతి అభ్యర్థి ధ్రువీకరణకు 8-10 సెకన్ల సమయం మాత్రమే పడుతోంది. దీని ద్వారా ప్రవేశ ప్రక్రియ మరింత వేగవంతమవడమే కాకుండా భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయి.
యూపీఎస్సీ నిర్వహించిన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా వివిధ సెషన్లలో పాల్గొన్న 1,129 మంది అభ్యర్థులకు సంబంధించిన 2,700కు పైగా స్కాన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతికత వినియోగంతో మరింత తెలివైన, సురక్షితమైన, సమర్థవంతమైన పరీక్షా విధానాల దిశగా ఈ ప్రయోగం ఒక ముందడుగు.
‘‘పరీక్షల్లో న్యాయం, పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కమిషన్ కట్టుబడి ఉంది. కృత్రిమ మేధా ఆధారిత ముఖ గుర్తింపు ప్రయోగం... తెలివైన, సురక్షితమైన, సమర్థవంతమైన పరీక్షా విధానాల వైపు యూపీఎస్సీ చేస్తున్న ప్రయత్నంలో కీలక ముందడుగు. కమిషన్ తన విధానాలను ఆధునికీకరించేందుకు కట్టుబడి ఉన్నప్పటికీ.. మా ప్రక్రియల సమగ్రతను కాపాడటంలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం’’ యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్.
ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు గురించి డాక్టర్ అజయ్ కుమార్ ట్వీట్ కూడా చేశారు.
***
(Release ID: 2168329)