ఆర్థిక మంత్రిత్వ శాఖ
"ఆపరేషన్ వీడ్ అవుట్" కింద మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై కొనసాగుతోన్న డీఆర్ఐ దాడులు
20 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో
108.67 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
Posted On:
16 SEP 2025 4:17PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న "ఆపరేషన్ వీడ్ అవుట్"లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 2025 సెప్టెంబర్ 13, 14 తేదీలలో ముంబయిలోని శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 39.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్)- 1985 నిబంధనల ప్రకారం సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.
నిఘా వర్గాల నిర్దిష్ట సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు బ్యాంకాక్ నుంచి వస్తోన్న ఇద్దరు భారతీయులను అడ్డుకొని వాళ్ల చెక్-ఇన్ బ్యాగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఉన్న 39.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు వెంటనే ఆ గంజాయిని తీసుకునేందుకు ఉద్దేశించిన వ్యక్తిని అరెస్టు చేశారు.
మరొక కేసులో కూడా నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా బ్యాంకాక్ నుంచి ముంబయికి అక్రమంగా తరలిస్తోన్న సుమారు 7.8 కిలోల బరువున్న హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం- 1985 నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.
2025 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 12 వరకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా అవుతున్న 61.67 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని జైపూర్, లక్నో, కోల్కతాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది.
2025 ఆగస్టు 20, 21 తేదీలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు రూ. 72 కోట్ల విలువైన 72.024 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. రూ. 1.02 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. ఎన్‌డీపీఎస్ చట్టం- 1985 నిబంధనల ప్రకారం ఫైనాన్సియర్లు, ఒక సూత్రధారితో సహా అయిదు మందిని అరెస్టు చేసింది.
గత సంవత్సరం కాలంగా థాయిలాండ్ నుంచి వివిధ విమానాశ్రయాల ద్వారా భారత్‌లోకి హైడ్రోఫోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలు బాగా పెరిగాయి. దేశంలో హైడ్రోఫోనిక్ గంజాయి మొక్కలను అక్రమంగా రవాణా చేస్తోన్న డ్రగ్ సిండికేట్లపై డీఆర్ఐ కఠినంగా వ్యవహరిస్తూనే ఉంది. ఇది నషా ముక్త భారత్ అనే కేంద్ర ప్రభుత్వ దార్శనికతను బలోపేతం చేస్తోంది.
***
(Release ID: 2167413)
Visitor Counter : 2