రక్షణ మంత్రిత్వ శాఖ
డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్-2025ని ఆమోదించిన రక్షణమంత్రి
సవరించిన డాక్యుమెంట్ ద్వారా కొనుగోళ్ల వేగం పెరిగి, స్వదేశీ పరిశ్రమకు ప్రోత్సాహం
ఆర్థిక సాయం, జరిమానాల సడలింపుతో పరిశ్రమల వర్కింగ్ క్యాపిటల్ సమస్యల పరిష్కారం
పలు నిబంధనల ద్వారా పరిశ్రమలు, విద్యాసంస్థలు, డీపీఎస్ యూల ద్వారా జరిగే పరిశోధన, అభివృద్ధికి ఊతం
Posted On:
14 SEP 2025 6:39PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖలో ఆదాయ సేకరణ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించి, సరళీకృతం చేయటానికి, హేతుబద్ధీకరించటానికి, ఆధునిక యుద్ధ రంగంలో సాయుధ దళాల కొత్త అవసరాలను తీర్చటానికి డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్- 2025ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఆపరేషన్స్ నిర్వహణ విభాగం రెవెన్యూ హెడ్ కింద సాయుధ దళాల అవసరాలను తీర్చటంలో స్వావలంబన సాధించటమే ఈ కొత్త మాన్యువల్ లక్ష్యం. ఇది త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల అత్యున్నత స్థాయి సైనిక సంసిద్ధతకు సహకరిస్తుంది. సాయుధ దళాలకు అవసరమైన వనరులు సకాలంలో సముచిత వ్యయానికి లభించేలా చేస్తుంది.
ఆయుధాల తయారీ, సాంకేతికతలో ఆత్మనిర్బర్ భారత్ ను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ మాన్యువల్ లో వ్యాపార సౌలభ్యాన్ని మరింత బలోపేతం చేశారు.
ప్రైవేట్ సంస్థలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల క్రియాశీల భాగస్వామ్యం ద్వారా రక్షణ రంగంలో దేశీయ మార్కెట్టులోని అవకాశాలు, నైపుణ్యాలు, సామర్థ్యాన్ని వినియోగించుకోవటం దీని ఉద్దేశం.
రక్షణ సేవలు, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంతర సంస్థల ద్వారా వస్తువులు, సేవల కొనుగోలును డీపీఎం నియంత్రిస్తుంది. ఈ మాన్యువల్ ను చివరగా 2009లో జారీ చేశారు. సాయుధ దళాలు, ఇతర భాగస్వాములతో సంప్రదించిన అనంతరం ఈ మాన్యువల్ మంత్రిత్వశాఖలో పునః పరిశీలనలో ఉంది.
రక్షణ మంత్రిత్వ శాఖలో ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన వస్తువుల కొనుగోలుకు నియమ, నిబంధనలను డీపీఎం నిర్దేశిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల రంగంలోని తాజా పరిణామాలకు అనుగుణంగా ఈ మాన్యువల్ ను రూపొందించటం వల్ల కొనుగోలు ప్రక్రియలో సాంకేతికతను ఉపయోగించుకుని, నిజాయితీగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండవచ్చు.
సవరించిన డాక్యుమెంటును, ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వస్తువుల కొనుగోలు మాన్యువల్‌లోని నూతన నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఆత్మనిర్భర్ భారత్ కు బలం చేకూర్చేలా, నూతన ఆవిష్కరణ, స్వదేశీ ఉత్పత్తి ద్వారా స్వయం సమృద్ధిని ప్రోత్సహించటానికి ఒక కొత్త అధ్యయాన్ని ఇందులో చేర్చారు. దీనిద్వారా ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్ సీలు, ఇతర ప్రైవేటు సంస్థలతో కలిసి యువ మేధావుల ప్రతిభను ఉపయోగించుకుని దేశీయంగా రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులు, విడిభాగాలను రూపొందించి, అభివృద్ధి చేయవచ్చు.
ఈ రంగంలోకి రావాలనుకునే వ్యక్తులు, పరిశ్రమల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి ఒప్పందాల్లోని పలు నిబంధనలను సడలించారు. అభివృద్ధి దశలో ముందస్తుగా నిర్ణయించిన నష్టపరిహారం (ఎల్ డీ) విధించకూడదనే నిబంధనను తీసుకొచ్చారు. ప్రోటోటైప్ పూర్తయిన తర్వాత 0.1 శాతం మాత్రమే కనిష్ట ఎల్ డీ విధిస్తారు. గరిష్ట ఎల్ డీ 5 శాతానికి తగ్గించారు. మరీ ఎక్కువ ఆలస్యమైనప్పుడు మాత్రమే గరిష్ట ఎల్ డీ 10 శాతంగా ఉంటుంది. దీనివల్ల గడువులోగా పని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు...అలాగే కాస్త ఆలస్యంగానైనా పనులు పూర్తవుతాయి.
ఆర్డర్ల పరిమాణంపై ఐదు సంవత్సరాల పాటు ఉండే హామీని, ప్రత్యేక పరిస్థితుల్లో మరో ఐదేళ్లు పొడిగించుకునే విధంగా నిబంధనను తీసుకువచ్చారు. ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను పంచుకోవటం ద్వారా సాయుధ దళాలు సహాయం అందించే మరో నిబంధనను కూడా ప్రవేశపెట్టారు.
కొత్తగా సవరించిన విధానం వల్ల క్షేత్ర స్థాయి, దిగువ స్థాయి యూనిట్లలో ప్రావీణ్యం కలిగిన ఆర్థిక అధికారులు వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనివల్ల ఫైళ్లను వివిధ స్థాయుల్లోని అధికారుల మధ్య తిరగడం తగ్గి, సరఫరాదారులకు సమయానికి చెల్లింపులు చేయవచ్చు. సరఫరాలో ఆలస్యం అయినప్పటికీ, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తమ ఆర్థిక సలహాదారుల సలహాతో డెలివరీ సమయాన్ని పొడిగించే అధికారం ప్రావీణ్యం గల ఆర్థిక అధికారులకు (సీఎఫ్ఏలు) ఇచ్చారు.
క్యాపిటల్ ఆస్తుల కొనుగోలులో ఇప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని అనుసరిస్తూ సమష్టి నిర్ణయాధికారానికి మరింత ప్రాధాన్యమిచ్చారు. ఎక్కువ మంది టెండర్లు వేసే అవకాశం కల్పించేలా, ఆర్థిక సలహాదారులను సంప్రదించకుండానే టెండర్ల ఓపెనింగ్ తేదీలను నిర్ధిష్ట పరిమితి వరకు పెంచే నిర్ణయాన్ని తీసుకునే అధికారం సీఎఫ్ఏలకు కల్పించారు.
వివిధ వాయుసేన, నౌకాదళ ప్లాట్ ఫామ్స్ మరమ్మత్తు, పునరుద్ధరణ, నిర్వహణ పనుల క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని, ఈ కార్యకలాపాల పని వృద్ధిలో 15 శాతం ముందస్తు నిధిని కేటాయించటం ద్వారా ఆపరేషన్ల కోసం పరికరాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక స్వభావం ఉండి, పరిమిత వనరుల ద్వారా లభించే వస్తువులను కొనుగోలు చేయటానికి రూ.50 లక్షల వరకు విలువైన వాటికి లిమిటెడ్ టెండరింగ్ పద్ధతిని అనుసరించవచ్చు. రూ.50 లక్షలకు మించిన వాటికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు.
ఒక సంస్థ లేదా ఒక తయారీదారుడి వద్ద మాత్రమే లభించే వస్తువుల కోసం యాజమాన్య ఆర్టికల్ సర్టిఫికేట్ ఆధారంగా కొనుగోలు చేసే అవకాశమివ్వటంతో పాటు మార్కెట్లో ఇతర ప్రత్యామ్నాయ వనరులను గుర్తించే ప్రయత్నాన్ని కొనసాగిస్తారు.
ప్రభుత్వాల మధ్య ఒప్పందాల ఆధారంగా జరిగే కొనుగోళ్లను సులభతరం చేసేందుకు, అధిక విలువ గల కొనుగోళ్లకు అనుసరించే ప్రత్యేక విధానాలను సరళీకృతం చేసేలా నిబంధనలను చేర్చారు. వివిధ సంస్థల మధ్య సమాన అవకాశాలు కల్పించేలా తగిన నిబంధనలను సవరించిన మాన్యువల్ లో పొందుపరిచారు. ఇకపై కొన్ని డీపీఎస్ యూల నుంచి నిరభ్యంతర పత్రాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా పూర్తిగా పోటీ ప్రాతిపదికన టెండర్లను జారీ చేస్తారు.
***
(Release ID: 2167050)
Visitor Counter : 2