కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భారతదేశంలో అనాధగా పడి ఉన్న ఆస్తుల వినియోగంలోకి తేవడంపై సమావేశం
• సదస్సులో పాల్గొన్న సీనియర్ విధాన రూపకర్తలు, నియంత్రణాధికారులు, విభిన్న రంగాల నిపుణులు
ఐఈపీఎఫ్ఏ తొమ్మిదో స్థాపక దినోత్సవ నిర్వహణ
Posted On:
09 SEP 2025 2:29PM by PIB Hyderabad
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న ది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) సోమవారం (సెప్టెంబరు 8న) తొమ్మిదో స్థాపక దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా, ‘‘ఈ ఆస్తులకు వారసులెవరు... వినియోగంలోకి భారతదేశంలో అనాధగా పడి ఉన్న ఆస్తులు (క్లెయిమింగ్ ది అన్క్లెయిమ్డ్: అన్లాకింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఐడిల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇన్ ఇండియా) అంశంపై ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు శ్రీ సంజీవ్ సాన్యాల్ ప్రధానోపన్యాసాన్నిచ్చారు. ఉపయోగంలో లేని ద్రవ్య సాధనాలను... దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని... ఫలప్రదమైన రీతిలో వినియోగించుకొనేటట్లు చూడడానికి కొత్త కొత్త ఆలోచనలతో కూడిన విధానాలను రూపొందించడంతో పాటు, వివిధ ఏజెన్సీలు ఒకదానికి మరొకటి సహకరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐఈపీఎఫ్ఏ అర్థవంతమైన సంస్కరణలను తీసుకువచ్చిందంటూ శ్రీ సాన్యాల్ ప్రశంసలు కురిపించారు.
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణను బలపరచడం, క్లెయిముల పరిష్కారాన్ని సులభతరంగా మార్చడంతో పాటు దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవహార జ్ఞానాన్ని పెంచేందుకు ఐఈపీఎఫ్ఏ అమలుచేస్తున్న కార్యక్రమాలను ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనితా షా ఆకెళ్ల వివరించారు. ఆమె సమావేశంలో ప్రారంభోపన్యాసాన్నిచ్చారు.
క్లెయిముల విషయంలో పాటించాల్సిన కాలపరిమితులను కుదించడానికీ, పారదర్శకత్వాన్ని ఇప్పటి కన్నా పెంచడంతో పాటు ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేయడానికీ సమన్వయ సహిత సంస్కరణలను తీసుకురావడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందిగా ఎన్‌సీఎఈఆర్‌లో ఐఈపీఎఫ్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ఎస్. మహాపాత్రా సూచించారు. ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో సమన్వయకర్త పాత్రను పోషించారు.
సదస్సులలో అనుభవజ్ఞులైన విధానరూపకర్తలు, నియంత్రణాధికారులతో పాటు విభిన్న రంగాల నిపుణులు పాల్గొన్నారు. కేపిటల్ మార్కెట్ మొదలు బ్యాంకింగ్ రంగం వరకు వివిధ విషయాలపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమాల్లో సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు శ్రీ సునీల్ కదమ్, రిజర్వు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజరు శ్రీ సునీల్ నాయర్, ఐసీఎస్ఐ పూర్వ ప్రెసిడెంటు, సీఎస్ బి. నరసింహన్ పాలుపంచుకొన్నారు. బీమా, పింఛన్లు, ప్రావిడెంట్ ఫండ్ల ప్రతినిధులుగా పీఎఫ్‌ఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు సుమీత్ కౌర్ కపూర్, ఐఆర్డీఏఐ పూర్వ సభ్యుడు శ్రీ ఆర్.కె. నాయర్ పాల్గొన్నారు. ‘పేరడైమ్ షిఫ్ట్: అన్లాకింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఐడిల్ అసెట్స్ అండ్ ఎఫీషియంట్ సర్వీస్’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఐఈపీఎఫ్ఏ మండలి సభ్యుడు, వేల్యూ రిసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ ధీరేంద్ర కుమార్, ఎన్ఐఎస్ఎమ్ డైరెక్టరు శ్రీ శశి కృష్ణన్‌లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ సెక్రటరీ, కాంప్లయన్స్ ఆఫీసరు సావిత్రీ పారేఖ్ తన అవగాహనను పంచుకున్నారు.
క్లెయిము చేయకుండా ఉన్న ద్రవ్య సాధనాలకు వాటి విలువను సద్వినియోగపరిచే దిశలో ఆలోచనలు చేస్తామనీ, ఆర్థిక సేవలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందించేటట్లు సంబంధిత వ్యవస్థను పటిష్ఠపరుస్తామనీ, దేశ ఆర్థిక అనుబంధ విస్తారిత వ్యవస్థపై మదుపరుల విశ్వాసాన్ని బలపరుస్తామనీ ఆసక్తిదారులంతా కలిసికట్టుగా వాగ్దానం చేయడంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది.
ఈ సందర్భంగా ఐఈపీఎఫ్ఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనితా షా ఆకెళ్ల మాట్లాడుతూ, పారదర్శకత్వానికీ, టెక్నాలజీకీ, విశ్వాసానికీ ప్రాధాన్యాన్ని కట్టబెట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెడుతూ మదుపరులకు అభయ ప్రదాతగా తమ సంస్థ పురోగమిస్తోందని స్పష్టం చేశారు. క్లెయిములు, రిఫండులకు ఏకీకృత పోర్టల్ ఏర్పాటు, తక్కువ మొత్తంలో ఉండే క్లెయిముల ప్రక్రియను సరళీకరించడం, ఆర్థిక వ్యవహార సంబంధిత జ్ఞానాన్ని పెంపొందించే నివేశక్ దీదీ... నివేశక్ శిబిర్ వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. త్వరలో నివేశక్ సమాధాన్- డయల్ యువర్ సీఈఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సంస్థ పంచతత్వ దృష్టికోణాన్ని అనుసరిస్తోందని కూడా వివరించారు. రిఫండ్లను త్వరగా అందించడం, ఏఐ ఆధారిత చర్యలు తీసుకోవడం, భారత ఆర్థిక వ్యవస్థకు కీలక వెన్నుదన్నుగా ఐఈపీఎఫ్ఏను తీర్చిదిద్దడం ఈ దృష్టికోణంలో భాగాలేనన్నారు. ఐఈపీఎఫ్ఏ ప్రభావశీలత్వాన్ని సంస్థ సేవలను అందుకుంటున్న వర్గాల కోణంలో నుంచి అంచనా వేయాలని స్పష్టం చేశారు.
ఐఈపీఎఫ్ఏ గురించి...
ది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)ను కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగంగా 2016 సెప్టెంబరు 7న ఏర్పాటు చేశారు. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండును నిర్వహించడం ఐఈపీఎఫ్ఏ బాధ్యత. షేర్లు, క్లెయిము చేయని డివిడెండ్లు, గడువు తీరిన డిపాజిట్లతో పాటు డిబెంచర్ల రిఫండుకు మార్గాన్ని సుగమం చేస్తూ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశాలతో దీనిని స్థాపించారు. ఐఈపీఎఫ్ఏ తన కార్యక్రమాల మాధ్యమంతో పారదర్శకత్వానికి పూచీపడుతూ, ఇన్వెస్టర్ల హక్కులను రక్షించడంతో పాటు దేశం అంతటా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవగాహనను ప్రోత్సహిస్తోంది.
మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి www.iepf.gov.in ను చూడగలరు.
***
(Release ID: 2164997)
Visitor Counter : 2