వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2025 సెప్టెంబరు 1 నుంచి స్వచ్ఛందంగా వెండి హాల్ మార్కింగ్
ఈ కొత్త నిర్ణయంతో వినియోగదారులకు వెండి స్వచ్ఛతను నిర్ధారించుకునే అవకాశం
प्रविष्टि तिथि:
04 SEP 2025 5:38PM by PIB Hyderabad
వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్ మార్కింగ్ ప్రత్యేక గుర్తింపు (హెచ్‌యూఐడీ) ఆధారిత హాల్ మార్కింగును స్వచ్ఛందంగా ప్రవేశపెడుతున్నారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఇది అమలవుతుంది. కొనుగోలు సమయంలో లోహ స్వచ్ఛతను నిర్ధారించుకోవడంలో ఈ నిర్ణయం వినియోగదారులకు సహాయపడుతుంది.
భారత ప్రమాణాల సంస్థ 2005 అక్టోబరు నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన వెండి ఆభరణాల హాల్‌మార్కింగును ప్రవేశపెట్టింది. వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ పథకం కింద.. వ్యాపారులకు హాల్‌మార్క్ చేసిన వెండి ఆభరణాల విక్రయం కోసం ఐఎస్ 2112 ప్రకారం నమోదు ధ్రువీకరణ పత్రం మంజూరవుతుంది.
వెండి వస్తువుల కోసం హాల్‌మార్కింగ్ ప్రమాణాన్ని గతంలోని ఐఎస్ 2112:2014 స్థానంలో.. ఐఎస్ 2112:2025 ప్రచురణతో బీఐఎస్ సవరించింది. ఈ సవరణ వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్ ప్రత్యేక గుర్తింపు (హెచ్‌యూఐడీ) ఆధారిత హాల్‌మార్కింగ్‌ను పరిచయం చేస్తుంది. ఇది నాణ్యతను మరింత మెరుగ్గా నిర్ధారించడంతోపాటు బంగారం హాల్ మార్కింగ్ వ్యవస్థకు అనుగుణంగా ఉంటుంది.
ఈ సవరణ ద్వారా.. బీఐఎస్ కేర్ యాప్‌ను ఉపయోగించి వినియోగదారుడు 2025 సెప్టెంబరు 1 తర్వాత హాల్‌మార్క్ చేసిన వెండి ఆభరణాలు/కళాకృతుల రకం, స్వచ్ఛత స్థాయి/నాణ్యత, హాల్‌మార్కింగ్ తేదీ (మొదటి అమ్మకపు స్థానం), ఏహెచ్‌సీ వివరాలు (గుర్తింపు సంఖ్య, పేరు, చిరునామా), ఆభరణాల వ్యాపారి రిజిస్ట్రేషన్ సంఖ్యను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
సవరించిన ఈ ప్రమాణం ఐఎస్ 2112:2025.. వెండి ఆభరణాల కోసం హెచ్‌యూఐడీ- ఆధారిత హాల్‌మార్కింగ్‌ను ఏడు స్వచ్ఛతా గ్రేడ్‌లతో పరిచయం చేస్తుంది. ఇది సరళంగా, డిజిటల్ పద్ధతిలో గుర్తించదగిన విధంగా ఉంటుంది. ఆ ఏడు గ్రేడ్లు - 800, 835, 925, 958, 970, 990, 999 (సవరించిన ప్రమాణంలో 958, 999 గ్రేడ్లను కొత్తగా జోడించారు). ఐఎస్ 2112:2025 కింద హాల్‌మార్కులో మూడు భాగాలుంటాయి. అవి: అనే పదంతో బీఐఎస్ ప్రమాణ చిహ్నం, స్వచ్ఛతా స్థాయి, హాల్‌మార్కింగ్ ప్రత్యేక గుర్తింపు (హెచ్‌యూఐడీ) కోడ్.
ప్రస్తుతం దేశంలోని 87 జిల్లాల్లో వెండి ఆభరణాల పరీక్ష కోసం బీఐఎస్ ద్వారా గుర్తింపు పొందిన 230 వస్తు పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాలు (ఏహెచ్‌సీ) ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 32 లక్షలకు పైగా వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ చేశారు.
ఐఎస్ 2112:2014 (గత వెర్షన్) కింద.. ఆరు స్వచ్ఛత గ్రేడ్‌లలో వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగును అనుమతించారు. అవి- 800, 835, 900, 925, 970, 990. హాల్ మార్కులో ఈ విభాగాలుండేవి - సిల్వర్ అనే పదంతో కూడిన బీఐఎస్ మార్కు, స్వచ్ఛత స్థాయి/నాణ్యత, వస్తు పరీక్ష కేంద్ర గుర్తింపు మార్కు, ఆభరణాల వ్యాపారి/తయారీదారు గుర్తింపు మార్కు.
ఈ మార్పుపై అవగాహన కల్పించడానికి 2025 ఆగస్టు 7న భాగస్వాములతో బీఐఎస్ సంప్రదింపులను నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల వ్యాపారులు, ఏహెచ్సీలూ వినియోగదారులు సహా 80కి పైగా భాగస్వాములు పాల్గొన్నారు. హెచ్‌యూఐడీ- ఆధారిత వెండి హాల్‌మార్కింగుపై సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందేలా చూడడం కోసం.. బీఐఎస్ దాని శాఖా కార్యాలయ వ్యవస్థ ద్వారా, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.
ఈ చర్య వినియోగదారుల హక్కులను బలోపేతం చేయడమే కాకుండా, మోసాల నుంచి వినియోగదారులను కాపాడుతుంది.
***
(रिलीज़ आईडी: 2164699)
आगंतुक पटल : 13