రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లో భారతదేశపు మొట్టమొదటి మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌ఎఫ్ఎఫ్) టోలింగ్ వ్యవస్థను అమలు చేయడానికి ఒప్పందం చేసుకున్న ఎన్‌హెచ్ఏఐ
प्रविष्टि तिथि:
30 AUG 2025 12:42PM by PIB Hyderabad
జాతీయ రహదారులపై ప్రయాణాల విషయంలో సజావుగా... అడ్డంకులు లేని టోలింగ్ అనుభవాన్ని అందించేందుకు ముందడుగు పడింది. గుజరాత్లోని ఎన్‌హెచ్-48లోని చోర్యాసి టోల్ ప్లాజా వద్ద దేశంలో మొదటి సమగ్ర మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌ఎఫ్ఎఫ్) టోలింగ్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఎన్‌హెచ్ఏఐకి చెందిన ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఎన్‌హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్.. ఎన్‌హెచ్ఏఐ, ఐహెచ్ఎంసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో ఢిల్లీలోని ఎన్‌హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో ఈ కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఫాస్టాగ్ ద్వారా ఆటంకం లేని ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను తీసుకొచ్చే ఈ వ్యవస్థ అవరోధాలు లేని టోలింగ్ అనుభవాన్ని అందించనుంది. గుజరాత్లోని చోర్యాసి టోల్ ప్లాజా.. దేశంలోనే మొదటి అవరోధాలు లేని టోల్ ప్లాజా అవుతుంది. హర్యానాలోని ఎన్‌హెచ్-44లోని ఘరౌండా టోల్ ప్లాజా వద్ద కూడా ఎంఎల్ఎఫ్ఎఫ్ అమలు కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీనిపై సంతకాలు కూడా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 25 జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్ ఆధారిత టోల్ వసూలును చేపట్టాలని ఎన్‌హెచ్ఏఐ యోచిస్తోంది. ఈ వ్యవస్థ అమలు కోసం టోల్ ప్లాజాలను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను అమలు కోసం చేసుకున్న ఈ ఒప్పందం దేశంలో టోలింగ్‌కు సంబంధించిన పరిణామ క్రమం, ఆధునీకరణలో ఒక ముఖ్యమైన ఘట్టం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, ఇది మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన, వినియోగించేందుకు సులభంగా ఉండే వ్యవస్థకు పునాది వేస్తుంది. ఇది జాతీయ రహదారుల కార్యకలాపాలలో సాంకేతికత ఆధారంగా పరివర్తన తీసుకురావాలనే మా ఆలోచనకు అనుగుణంగా ఉంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేసేందుకు మార్గం సుగమం కానుంది" అని అన్నారు.
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థ- అధిక సామర్థ్యం గల ఆర్‌ఎఫ్ఐడీ రీడర్లు, ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా ఫాస్టాగ్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల (వీఆర్‌ఎన్) ద్వారా టోల్ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది. తద్వారా ఇది ఆటంకం లేని టోలింగ్ వ్యవస్థను అందిస్తుంది. ఈ వ్యవస్థ వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపకుండానే టోల్ వసూలవుతుంది. దీనితో రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా ఉద్గారాలను తగ్గిస్తుంది. ఎంఎల్ఎఫ్ఎఫ్ వ్యవస్థను అమలు చేయటం వల్ల టోల్ ఆదాయ సేకరణను మెరుగుపడుతుంది. దేశవ్యాప్తంగా స్మార్ట్ అయిన, వేగవంతమైన, మరింత సమర్థవంతమైన జాతీయ రహదారి వ్యవస్థను సృష్టించడానికి కూడా ఇది దోహదపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2162211)
आगंतुक पटल : 29