రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సైన్యం టెరియర్ సైబర్ క్వెస్ట్ 2025: కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్, డ్రోన్ టెక్నాలజీ వంటి
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించిన జాతీయ సైబర్ ఛాలెంజ్
Posted On:
27 AUG 2025 5:18PM by PIB Hyderabad
భారత సైన్యంలో ప్రస్తుత దశాబ్దంలో జరుగుతున్న మార్పులలో భాగంగా, ప్రాదేశిక సైనిక విభాగం ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఆర్మీ పరిశోధనా విభాగం (ఐఏఆర్సీ), ,సైబర్‌పీస్ సంస్థలతో కలిసి ఇండియన్ ఆర్మీ టెరియర్ సైబర్ క్వెస్ట్ 2025 జాతీయ స్థాయి పోటీని నిర్వహిస్తోంది. దేశ రక్షణ, సైబర్ భద్రతకు సంబంధించిన వాస్తవ సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించిన ఈ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతుంది.
ఈ కార్యక్రమం గురించిన ప్రకటన ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ (www.indianarmy.nic.in/terriercyberquest/2025.pdf) లో అందుబాటులో ఉంది. సాంకేతికపరిజ్ఞానంతో ఆధునిక రక్షణ సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యారంగం, పరిశ్రమలు, ప్రభుత్వం నుంచి దేశంలోని మేధావి వర్గాన్ని ఒకే వేదికపైకి తీసుకు రావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సైబర్ పోటీ ద్వారా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి కీలక రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను, భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తారు. సైబర్ ప్రపంచంలో బలమైన రక్షణ వ్యూహం ప్రాముఖ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తారు. అలాగే, నైపుణ్యం కలిగిన వ్యక్తులు డిజిటల్ యుద్ధభూమిలో యోధులుగా మారాలని మారడానికి పిలుపు ఇస్తుంది.
ఈ పోటీలో భారత్ కోసం మరింత బలమైన వ్యవస్థలను నిర్మించేందుకు కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) ఆధారంగా రెండు ముఖ్యమైన సవాళ్లు ఉంటాయి. ఇవి ఇందులో పాల్గొనే వారికి జాతీయ భద్రతకు నేరుగా తోడ్పడే ప్రత్యేక వేదికను అందిస్తాయి.
*ట్రాక్ వన్: బగ్ హంటింగ్ ఛాలెంజ్ - ఇది ఒక అధిక ప్రాధాన్యత కలిగిన సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్. ఇందులో భాగంగా, బాస్ లినక్స్ సిస్టమ్‌పై 36 గంటల పాటు బగ్ హంట్ నిర్వహిస్తారు. ఫైనల్స్‌కు చేరినవారు, భారత సైన్యం కోసం సిమ్యులేటెడ్ వాతావరణంలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్-స్థాయి లోపాలను కనుగొనాల్సి ఉంటుంది. దీని ద్వారా దేశానికి మరింత బలమైన వ్యవస్థలను నిర్మించడంలో వారు సహాయపడతారు.
*ట్రాక్ టూ: డేటాథాన్ - ఇది డేటా ఆధారిత సవాల్. దేశ రక్షణ, జాతీయ భద్రత కోసం బలమైన సాంకేతిక పరిష్కారాలను కనుగొనడంలో పోటీదారుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. పెద్ద డేటాసెట్‌లను ఉపయోగించి ముప్పులను ముందుగా గుర్తించడం, అసాధారణ విషయాలను కనుగొనడంపై 2025 పోటీ ప్రధానంగా దృష్టి పెడుతుంది.
కార్యక్రమ షెడ్యూల్
*రిజిస్ట్రేషన్: జూలై 23 - సెప్టెంబర్ 07, 2025
*ప్రాథమిక (ప్రిలిమినరీ) రౌండ్: సెప్టెంబర్ 08 – 17, 2025
*గ్రాండ్ ఫినాలే: సెప్టెంబర్ 24 – 26, 2025
*అవార్డుల ప్రదానోత్సవం: అక్టోబర్ 07, 2025
ఈ కార్యక్రమంలో, కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత వంటి ఆధునిక అంశాలకు సంబంధించిన సమస్యలను కూడా వివరిస్తారు. డ్రోన్ ప్రయాణంలో అసాధారణ విషయాలను గుర్తించడం, క్వాంటమ్ టెక్నాలజీతో కూడిన మాల్వేర్/రాన్సమ్‌వేర్‌ను గుర్తించడం వంటి పోటీలు ఇందులో పాల్గొనేవారికి అత్యాధునిక రియల్-టైమ్ డిటెక్షన్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తాయి. ఈ కార్యక్రమం క్వాంటం మెషిన్ లెర్నింగ్‌లో దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సునిశితమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, జాతీయ భద్రత, రక్షణ సంబంధిత సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయగల ప్రోటోటైప్ పరిష్కారాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రాండ్ ఫినాలేలో, ట్రాక్ వన్ ఫైనలిస్టులు కీలక మౌలిక సదుపాయాలపై జరిగే దాడి, వాటిని రక్షించడంపై దృష్టి సారించే ఒక దాడి-రక్షణ తరహా సవాల్ లో పాల్గొంటారు. అదే సమయంలో, ట్రాక్ టూ ఫైనలిస్టులు ఏఐ, ఎంఎల్ లను ఉపయోగించి, 36 గంటల్లో పూర్తిగా పనిచేసే డీప్‌ఫేక్ డిటెక్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
విజేతలను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరిస్తారు. వినూత్న పరిష్కారాలు, జాతీయ భద్రతకు చేసిన కృషికి గుర్తింపుగా వారికి ఆకర్షణీయ బహుమతులు కూడా ఇస్తారు.
ఆసక్తి ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ www.indianarmy.nic.in/terriercyberquest/2025.pdf ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 07, 2025 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
***
(Release ID: 2161392)