కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్లు... పంపిణీ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన తపాలా శాఖ, ఏఎంఎఫ్ఐ
Posted On:
22 AUG 2025 8:52PM by PIB Hyderabad
ఆర్థిక సమ్మిళిత్వాన్నిపెంపొందించే దిశగా కీలక ముందడుగులో భాగంగా, భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తపాలా శాఖ (డీఓపీ), భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (ఏఎంఎఫ్ఐ) మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఆగస్టు 22, 2025న ఏఎంఎఫ్ఐ 30వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ముంబయిలో జరిగింది.
ఈ కీలక ఒప్పందం ఒక కొత్త సేవల విధానానికి నాంది పలికింది. దీని ప్రకారం, భారత తపాలా విభాగం తన విస్తృత నెట్‌వర్క్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను సులభతరం చేసేందుకు పంపిణీదారుగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల పౌరులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల పట్ల ఉన్న నమ్మకం, వాటి పరిధిని ఉపయోగించి మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పందం లక్ష్యం.
సెబీ ఛైర్మన్ శ్రీ తుహిన్ కాంత పాండే సమక్షంలో జరిగిన ఈ అవగాహన ఒప్పందంపై తపాలా శాఖ జనరల్ మేనేజర్ (వ్యాపారాభివృద్ధి) శ్రీమతి మనీషా బన్సాల్ బాదల్, ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వి.ఎన్.చలసాని అధికారికంగా సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు తపాలా శాఖ ఉద్యోగులు పంపిణీదారులుగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాల్లో వ్యవస్థీకృత ఆర్థిక ఉత్పత్తుల అందుబాటు తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పాక్షిక పట్టణాల్లో తపాలా శాఖ ఉనికి విస్తృతంగా ఉన్నా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల గురించి అవగాహన తక్కువగా ఉంది.
ఈ భాగస్వామ్యం దేశంలోని మారుమూల ప్రాంతాలను ఆర్థిక లావాదేవీల పరిధిలోకి తీసుకురావాలన్న డీఓపీ నిబద్ధతకు నిదర్శనం. అంతేకాక భారతదేశంలో వృత్తిపరమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను ప్రోత్సహించాలనే ఏఎంఎఫ్ఐ లక్ష్యానికి ఇది మరింత బలం చేకూరుస్తుంది.
ఈ ఎంఓయూ ఆగస్టు 22, 2025 నుంచి ఆగస్టు 21, 2028 వరకు మూడేళ్ల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడిదారుల సమాచార భద్రత, సేవల సమగ్రతకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లున్నాయి. ఇది భారతదేశ ఆర్థిక సేవా రంగంలో కార్యకలాపాల నాణ్యతకు ఒక కొత్త ప్రమాణం కానుంది.
***
(Release ID: 2160070)