బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గనుల 13వ రౌండ్ వాణిజ్య వేలాన్ని విజయవంతంగా ప్రారంభించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 21 AUG 2025 8:54PM by PIB Hyderabad

బొగ్గు గనుల 13వ రౌండ్ వాణిజ్య వేలాన్ని న్యూఢిల్లీలో బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు విజయవంతంగా ప్రారంభించింది. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేసే దిశగా ఇదొక కీలక ముందడుగు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా, సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ జి. కిషన్ రెడ్డి కీలకోపన్యాసం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించి చరిత్రాత్మక మైలురాయిని చేరుకుందని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో ప్రారంభించిన విప్లవాత్మక సంస్కరణలకు ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పారదర్శకమైన వేలం విధానాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం పెరగడం, సాంకేతికంగా ఆధునికీకరణ ద్వారా.. బొగ్గు రంగంలో 2015 నుంచి బొగ్గురంగంలో సమూల మార్పులు వచ్చాయని ఆయన చెప్పారు.

పారదర్శక, సమ్మిళిత వేలం వ్యవస్థ ద్వారా కొత్త కంపెనీలు, జూనియర్ మైనింగ్ సంస్థలను ఆకర్షిస్తూ, పరిశ్రమలో ప్రవేశించేలా వాటికి సరికొత్త అవకాశాలను కల్పించడం ద్వారా.. ఆత్మనిర్భర భారత్‌ దిశగా చేస్తున్న కృషిలో బొగ్గు రంగం ముందంజలో నిలుస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. 12 రౌండ్లలో 134 గనులను వేలం వేసి రూ. 41,600 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 3.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించడం ద్వారా.. దేశ ఇంధన రంగాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ 13వ రౌండు 14 బొగ్గు బ్లాకులను పరిచయం చేయడంతోపాటు దిగుమతులపై ఆధారపడటాన్ని మరింత తగ్గిస్తుంది. విదేశీ మారకద్రవ్యాన్నీ ఆదా చేస్తుంది. పారదర్శక వేలం ప్రక్రియ ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడమే కాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థలు కొత్త ఆవిష్కరణలు చేసి ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా చేసింది. తద్వారా పనితీరు మరింత సమర్థంగా మారడంతోపాటు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుతుంది.

అంతేకాకుండా, సాంప్రదాయక బొగ్గు తవ్వకం నుంచి బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చడం (గ్యాసిఫికేషన్) ద్వారా పర్యావరణ హిత బొగ్గు వినియోగం దిశగా మారాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని బొగ్గు వనరుల్లో దాదాపు 370 బిలియన్ టన్నులు, అంటే 40% కన్నా ఎక్కువగా చాలా లోతులో ఉన్నాయని, సంప్రదాయ పద్ధతుల ద్వారా ప్రస్తుతం వాటిని తవ్వితీయలేమని ఆయన అన్నారు. భూగర్భంలో బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చడం (యూసీజీ) ఓ విప్లవాత్మక విధానం. తవ్వి తీయలేని, విస్తారంగా ఉన్న ఈ బొగ్గు గనులను నేరుగా భూగర్భంలోనే సంశ్లేషిత వాయువుగా మార్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది. బొగ్గును అక్కడికక్కడే వినియోగించుకోవడం ద్వారా.. అపారమైన ఇంధన సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాన్నివ్వడమే కాకుండా, ఈ సాంకేతికత ఉపరితల అలజడులను కూడా తగ్గిస్తుంది. అలాగే భూ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత, సుస్థిర పద్ధతుల్లో బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దేశ ఇంధన ప్రణాళికలో ఇదొక ముఖ్యమైన ముందడుగు. బొగ్గు ఉత్పత్తి ప్రాధాన్యాన్ని కూడా వివరించిన ఆయన.. బిడ్లను గెలుచుకున్నవారు షెడ్యూలు కన్నా ముందుగానే ఉత్పత్తిని ప్రారంభించి, ప్రోత్సాహకాలను పొందాలని కోరారు. పురోగామి సంస్కరణలు, సంక్షోభాలను తొలగించడం, అనుమతులను వేగవంతం చేయడం, వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బొగ్గు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని చెబుతూ.. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారు అయిన భారత్.. తన విస్తారమైన నిల్వల నుంచి ఉత్పత్తిని పెంచడానికి ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు.

సంస్కరణ, ఆచరణ, పరివర్తన అనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని వివరిస్తూ.. సమర్థత, పారదర్శకత, దీర్ఘకాలిక సుస్థిరత దిశగా బొగ్గు మంత్రిత్వ శాఖ సంస్కరణలను అమలు చేస్తోందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. సంస్కరణలను మరింత బలోపేతం చేయడంతోపాటు ఈ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం నిర్మాణాత్మక సూచనలు అందించాల్సిందిగా ఈ రంగంలో భాగస్వాములందరికీ ఆయన పిలుపునిచ్చారు.

బొగ్గు తవ్వకంలో సామాజిక అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమంతో కూడిన సమగ్ర విధానం గురించి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడారు. బొగ్గులో నేడు పెట్టుబడి పెట్టడమంటే, దేశ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రంగంలో ప్రతి అవకాశమూ మన ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా.. దీర్ఘకాలిక వృద్ధి, సుస్థిరాభివృద్ధితోపాటు స్వావలంబన, సుసంపన్నమైన ఇంధన రంగం దిశగా దేశ ప్రస్థానంలో భాగమయ్యే అవకాశాన్ని కూడా అందిస్తుంది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే మాట్లాడుతూ.. భారత్ ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించడం, 13వ రౌండు బొగ్గు గనుల వాణిజ్య వేలం మొదలవడం ఇంధన స్వావలంబనలో మరో ముఖ్యమైన ముందడుగు అన్నారు. పారదర్శకమైన వేలం యంత్రాంగం, పారిశ్రామిక అనుకూల విధానాలు, పెరిగిన ప్రైవేట్ రంగ భాగస్వామ్యం బొగ్గు ఉత్పత్తిని పెంచడమే కాకుండా పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

సమర్థవంతమైన గనుల మూసివేత పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం, స్థానికులకు జీవనోపాధిని కల్పించడం వంటి సుస్థిరాభివృద్ధి ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద మొక్కల పెంపకం కార్యక్రమాన్ని కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఇంధన రంగంలో ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యానికి అనుగుణంగా.. సులభతర వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్ మాట్లాడుతూ.. 2015లో సీఎంఎస్పీ చట్టం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2020లో వాణిజ్యపరమైన బొగ్గు తవ్వకాలను ప్రవేశపెట్టడం వరకు ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను సమగ్రంగా వివరించారు. బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడాన్ని ఆయన ప్రశంసించారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ద్వారా వేగవంతమైన గని నిర్వహణ, అనుమతుల క్రమబద్ధీకరణ, లాజిస్టిక్స్ ను మెరుగుపరచడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

దేశ ఇంధన ప్రణాళికలో బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని శ్రీ దత్ వివరించారు. ఈ సాంకేతికతలు సంప్రదాయ బొగ్గు దహనానికి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. విద్యుదుత్పత్తి, ఎరువులు, పెట్రోకెమికల్స్‌లో వినియోగం కోసం సంశ్లేషిత వాయువుల ఉత్పత్తికి అవకాశం కల్పిస్తుంది. అవి కర్బనోద్గారాలను తగ్గిస్తాయి. వనరుల సానుకూల వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. గనుల్లో ఆర్థికంగా లాభదాయకం కాని, అత్యంత లోతులో ఉన్న బొగ్గు నిల్వల నుంచి కూడా విలువను రాబడుతాయి.

దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రస్తుత స్థితిని కూడా శ్రీ దత్ వివరించారు. పలు ప్రయోగాత్మక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించడం కోసం మంత్రిత్వ శాఖ రూ. 8500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిందని, అర్హత కలిగిన ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని, విధానపరమైన సౌలభ్యాన్ని అందిస్తోందని చెప్పారు.

“ప్రత్యేక ప్రోత్సాహక విధానం ద్వారా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు క్రియాశీలంగా చేయూతనిస్తున్నాం” అని శ్రీ దత్ అన్నారు. ప్రోత్సాహక పథకానికి ఏడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇది ఆ ప్రక్రియ స్వీకరణను వేగవంతం చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పర్యావరణ హిత బొగ్గు సాంకేతికతలో భారత్ ను అగ్రగామిగా నిలపడోం సహాయపడుతుంది.

పర్యావరణ, అటవీ అనుమతులను వేగంగా అమలు చేయడం, అడ్డంకులను తొలగించడం, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులకు సంబంధించి భాగస్వాములకు మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతును అందిస్తుందని హామీ ఇచ్చారు. అటవీకరణ, తవ్వకాలు జరిగిన ప్రాంతాల పునరావాసం, కచ్చితమైన అనుమతులపై దృష్టి సారించడం ద్వారా.. పర్యావరణ సుస్థిరతను ప్రాధాన్య అంశంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అధికారి శ్రీమతి రూపిందర్ బ్రార్ స్వాగతోపన్యాసం చేస్తూ.. ప్రైవేటు సంస్థలకు కొత్త అవకాశాలను అందించడంతోపాటు పోటీని పెంపొందించడంలో బొగ్గు వాణిజ్యపరమైన తవ్వకం విశేష ప్రభావం చూపిందన్నారు.

భూగర్భంలోనే బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చడం బొగ్గు వినియోగంలో దిశా నిర్దేశక సాంకేతికతగా ఆమె పేర్కొన్నారు. సంప్రదాయ మైనింగ్ పద్ధతులతో పోలిస్తే ఈ ప్రక్రియ ఉపరితల అలజడులను, భూమి అవసరాన్ని, పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

భూగర్భంలో బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. భారత్‌లో విస్తారమైన బొగ్గు నిల్వలు చాలా లోతుల్లో ఉన్నాయని, సంప్రదాయ మైనింగ్ పద్ధతుల్లో సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల అవి ఉపయోగంలోకి రావడం లేదని బ్రార్ తెలిపారు. యూసీజీ ద్వారా ఈ నిల్వలను ఉపయోగించుకోవడానికి సుస్థిరమైన మార్గాలు లభిస్తాయని, బాధ్యతాయుత, పర్యావరణ హిత బొగ్గు వినియోగ సూత్రాలకు అనుగుణంగా ఇంధన భద్రతను ఇది అందిస్తుందని అన్నారు.

కొత్త పెట్టుబడి అవకాశాలు, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులు, భారత బొగ్గు రంగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఈ ప్రయోగం మరో ప్రధాన ముందడుగు. ఈ కార్యక్రమంలో భాగంగా, బిడ్లను గెలుచుకున్న వారు ప్రారంభ ఒప్పందాలపై సంతకం చేశారు. బొగ్గు తవ్వకంలో పారదర్శకత, సమర్థత, ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో ప్రభుత్వ అంకితభావాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది.

బొగ్గు గనుల 13వ రౌండ్ వాణిజ్య వేలంలో భాగంగా.. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం- 2015 (సీఎంఎస్పీ) కింద 4 బొగ్గు గనులను, గనులు - ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం - 1957 (ఎంఎండీఆర్) కింద 10 గనులను అందిస్తున్నారు. మొత్తం గనుల్లో 10 పూర్తిగా అభివృద్ధి చేసినవి, తక్షణ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, మరో నాలుగు గనులు పాక్షికంగా అభివృద్ధి చేసినవి. ఇవి దేశంలో బొగ్గు రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను అందించడంతోపాటు ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతాయి. అంతేకాకుండా, మునుపటి రౌండ్ బొగ్గు గనుల వాణిజ్య వేలం నుంచి మరో మూడు గనులను కూడా అందిస్తున్నారు. వేలం వేస్తున్న గనులు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి.

13వ రౌండ్ బొగ్గు గనుల వాణిజ్య వేలంతో కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. దేశీయంగా బొగ్గు సరఫరా మెరుగుపడుతుంది. దేశ ఇంధన భద్రతకు ఇది గణనీయంగా దోహదపడుతుంది. ఈ రంగంలో అభివృద్ధి, స్థిరత్వం, భద్రతను పెంపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. భారత్ పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే.. బొగ్గు రంగంలో స్వావలంబన దిశగా సాగుతోందని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.


 

***


(Release ID: 2159998) Visitor Counter : 6