బొగ్గు మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో సొంత, వాణిజ్య బొగ్గు బ్లాకులపై బొగ్గు మంత్రిత్వ శాఖ సమీక్ష
Posted On:
11 AUG 2025 5:50PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో కేటాయించిన సొంత, వాణిజ్యపరమైన బొగ్గు బ్లాకుల స్థితి, వాటిలో పురోగతిని అంచనా వేయడం కోసం.. అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అథారిటీ (ఏఎస్ & ఎన్ఏ) శ్రీమతి రూపీందర్ బ్రార్ అధ్యక్షతన బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు సమగ్ర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపుదారులు, కేంద్ర ప్రభుత్వ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల నిర్వహణలో విజయాలు, సవాళ్ల పరిష్కారంపై సమీక్షించడంతోపాటు ఈ రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచే చర్యలపై చర్చించారు.
సమీక్ష సమావేశం సందర్భంగా మొత్తం 39 బొగ్గు బ్లాకులకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. వాటిలో మధ్యప్రదేశ్‌లో 33, అసోంలో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, తెలంగాణలో 1, గుజరాత్‌లో 2 ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో క్యాప్టివ్, వాణిజ్యపరమైన బొగ్గు గనుల పనితీరు స్థిరమైన పురోగతిని కనబరిచింది. మధ్యప్రదేశ్‌లో 13 బొగ్గు బ్లాకుల్లో కార్యకలాపాలు జరుగుతుండగా, వాటిలో 9 బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణలో 1 బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి జరుగుతోంది. ఉత్పత్తి చేసే ఈ బ్లాకులన్నీ కలిసి 2024-25లో 34.80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో (2025 జూలై 31 వరకు) ఇప్పటికే 10.80 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది.
దేశీయ బొగ్గు సరఫరాను మరింత బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్లను తీర్చడం కోసం ఈ రాష్ట్రాల్లో మిగిలిన 25 బొగ్గు బ్లాకుల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపైనా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.
సొంత, వాణిజ్యపరమైన బొగ్గు తవ్వకాలను ముందుకు తీసుకెళ్లడంపై నిబద్ధతను మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. అంతరాయం లేకుండా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలో అవరోధాలను పరిష్కరించడం, వనరుల సమర్థమైన వినియోగాన్ని ప్రోత్సహించడం ఆవశ్యకతను చర్చించారు. బొగ్గు రంగంలోని ఆస్తుల సామర్థ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం, ఈ రంగాలలో నిరంతరం వృద్ధిని పెంచడం, ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి దోహదపడడం కోసం.. సంబంధిత భాగస్వాములందరితో బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నిహితంగా పనిచేస్తోంది.
***
(Release ID: 2155324)