భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047
Posted On:
08 AUG 2025 4:12PM by PIB Hyderabad
ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047 (ఏఎంపీ 2047) అనేది పరిశ్రమే సారథ్యం వహించే ఒక కార్యక్రమం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతుంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో పోటీపడేదిగా తీర్చిదిద్దడం ఈ మిషన్ ప్లాన్ లక్ష్యం. 2047వ సంవత్సరానికల్లా భారత్ చేరుకోవాల్సిన గమ్యం కేవలం ఆకాంక్షకు పరిమితం కాదు. అది ఆటోమోటివ్ రంగం అభివృద్ధి, ఎగుమతులు, పరిశ్రమ ఉన్నతి.. వీటి విషయంలో సాధించాలని సంకల్పిస్తున్న నిర్దిష్ట లక్ష్యాలు కలబోసుకొనే వ్యూహాత్మక రోడ్మ్యాప్. ఏఎంపీ 2047ను రూపొందించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు, పారిశ్రామిక సంఘాలు, విద్యాసంస్థలు, పరిశోధన రంగ మేధావులు, టెస్టింగ్ ఏజెన్సీలు తమ వంతు ప్రయత్నాలను పరిశ్రమ సారథ్యంలో మొదలుపెడుతున్నాయి.
సాంకేతికంగా చోటుచేసుకొంటున్న ప్రగతి, ఇతరత్రా సవాళ్లను పరిష్కరించడానికి సిసలు ఉపకరణాల తయారీదారు సంస్థలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల తయారీదారు సంస్థలు, విధాన రూపకర్తలు, విద్య రంగ ప్రముఖులు, వినియోగదారులు సహా ఆసక్తిదారులందరి సమష్టి దృష్టికోణాన్ని ఏఎంపీ 2047 ఆవిష్కరించదలుస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమ, విద్య రంగాల నిపుణులతో 7 ఉప సంఘాలను వేశారు. ఈ ఉప సంఘాలు 2030వ, 2037వ, 2047వ సంవత్సరాలకు సరికొత్త ప్రస్థానాలపై దృష్టి సారించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంలో మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ రాజ్యసభలో ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2155084)
Visitor Counter : 2