రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా, బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్, మేజర్ సోమనాథ్ శర్మలపై అధ్యాయాలు
Posted On:
07 AUG 2025 6:12PM by PIB Hyderabad
సైనిక యోధుల జీవితం, త్యాగాలపై అధ్యాయాలను ఈ విద్యా సంవత్సరం ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో చేర్చారు. ఫీల్డ్ మార్షల్ మానెక్ షా సాహస గాథను ఎనిమిదో తరగతి (ఉర్దూ), బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ జీవిత చరిత్రను ఏడో తరగతి (ఉర్దూ), మేజర్ సోమనాథ్ శర్మ జీవిత గాథను ఎనిమిదో తరగతి (ఇంగ్లిష్) సిలబస్‌లో చేర్చారు.
ధైర్యం, కర్తవ్యాలకు సంబంధించి స్ఫూర్తిదాయకమైన కథనాలను విద్యార్థులకు అందించడమే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అధ్యాయాల లక్ష్యం. భారత్‌లో ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మొదటి అధికారి సామ్ మానెక్ షా. అసాధారణ నాయకత్వ పటిమ, వ్యూహాత్మక చతురతకు పేరెన్నికగన్నారు. బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ మహావీర చక్ర పురస్కారాన్ని పొందగా, మేజర్ సోమనాథ్ శర్మ పరమవీర చక్ర పురస్కార గ్రహీత. వారిద్దరూ మరణానంతరం ఈ అవార్డులు పొందారు. దేశసేవలో ప్రాణాలర్పించిన వారు మహోన్నత త్యాగానికి ప్రతీకలుగా నిలిచారు.
జాతీయ యుద్ధ స్మారక చిహ్నానికి (ఎన్‌డబ్ల్యూఎం) జాతీయ స్థాయి ఖ్యాతిని గడించే దిశగా.. విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన - శిక్షణ మండలి చేస్తున్న కృషిలో రక్షణ మంత్రిత్వ శాఖ పాలుపంచుకుంటోంది. ఎన్‌డబ్ల్యూఎం, సంబంధిత ఇతర అంశాలను పాఠ్య ప్రణాళికలో చేరుస్తోంది.
ఈ గాథలు, వాటిని పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా విద్యార్థులు భారత సైనిక చరిత్రను తెలుసుకోవడమే కాకుండా.. సంక్లిష్టతలను అధిగమించే సమర్థత, సహానుభూతి, భావోద్వేగ మేధ వంటి జీవిత పాఠాలనూ నేర్చుకుంటారు. దేశ పురోగతికి పాటుపడాల్సిన ఆవశ్యకతనూ గుర్తిస్తారు.
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ‘సి’ హెక్సాగాన్‌లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి 25న జాతికి అంకితం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరయోధులైన మన సైనికులకు నివాళి అర్పించడంతోపాటు.. ప్రజలందరిలో దేశభక్తి, ఉన్నత నైతిక విలువలు, త్యాగం, జాతీయతా స్ఫూర్తి, ఐక్యతా భావాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ స్మారక చిహ్నాన్ని నెలకొల్పారు.
***
(Release ID: 2154047)