ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రజలు డిజిటల్ వేదికను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మొగ్గు చూపేలా ‘పీఎఫ్ఆర్‌డీఏ కనెక్ట్’లో భాగంగా కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన పీఎఫ్ఆర్‌డీఏ
प्रविष्टि तिथि:
04 AUG 2025 6:18PM by PIB Hyderabad
పీఎఫ్ఆర్‌డీఏ కనెక్ట్ (PFRDA CONNECT) పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) శ్రీకారం చుట్టింది. తన వెబ్‌సైట్‌లో సరికొత్త మార్పు చేర్పులు చేసి నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను పీఎఫ్ఆర్‌డీఏ చైర్‌పర్సన్ శ్రీ ఎస్. రమణ్ ఈ రోజు న్యూ ఢిల్లీలో ఆవిష్కరించారు.
ఈ వినూత్న డిజిటల్ అధ్యాయం అత్యాధునిక టెక్నాలజీని పింఛన్ రంగ పరిపాలన ప్రక్రియలో వినియోగించుకొంటూ పారదర్శకత్వాన్ని, నైపుణ్యాన్ని, లభ్యతను ప్రోత్సహించాలన్న పీఎఫ్ఆర్‌డీఏ దృష్టికోణానికి అనుగుణంగా ఉంది. కొత్త వెబ్‌సైటును కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం రూపొందించారు. ఇది జీఐజీడబ్ల్యూ (భారత ప్రభుత్వ వెబ్‌సైట్లకు నిర్దేశించిన మార్గదర్శకాల)తో పాటు డబ్ల్యూసీఏజీ (వెబ్ కంటెంట్ లభ్యతకు సంబంధించిన మార్గదర్శకాల)ను తూచా తప్పక అనుసరిస్తుంది. దీంతో ఆసక్తిదారులందరూ దీనిని సులభంగా ఉపయోగించుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో తాజాగా తీసుకువచ్చిన మార్పులతో వినియోగదారులకు ఇదివరకటి కంటే మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ఇదివరకు లభ్యం కాని సమాచారాన్ని అదనంగా జోడించడంతో పాటు సబ్‌స్క్రైబర్లు, మధ్యవర్తులు, ప్రజలు ఈ వెబ్‌సైట్‌లోకి సులభంగా ప్రవేశించగలిగేలా వీలు కల్పించారు. అదనంగా జోడించిన ఫీచర్లు ఇలా ఉన్నాయి:
• చురుకైన, వెంటనే ప్రతిస్పందించే అవకాశంతో కూడిన లేఅవుట్‌లు, సేవలకు సంబంధించి ఇట్టే అర్థమయ్యే సమాచారం
• నియంత్రణకు సంబంధించిన తాజా ఉత్తర్వులు, పథకాలు ఒకే చోట లభ్యం అవుతుండటం
• కావాలనుకొనే సమాచారాన్ని వెతికేందుకు మెరుగైన సదుపాయాలు, వినియోగదారులకు అనుకూలంగా ఉండే సీఎంఎస్ (కంటెంట్ నిర్వహణ వ్యవస్థ)
• ఇతర నియంత్రణ వేదికలతో పాటు సేవలతో ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా జతపడటానికి అవకాశాలు
కొత్త వెబ్‌సైటును ప్రారంభించడం డిజిటల్ మార్పును ఆహ్వానించాలన్న, ఆసక్తిదారులతో అనుబంధాన్ని మరింత పెంచుకోవాలన్న పీఎఫ్ఆర్‌డీఏ నిబద్ధతకు అద్దం పడుతోంది. ఇది ఇదివరకటి కంటే ఎక్కువ పారదర్శకతకు, సౌలభ్యానికి బాట వేస్తోంది.
వెబ్‌సైట్ సేవలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది https://www.pfrda.org.in లో లభ్యమవుతుంది.
మన దేశ పింఛన్ రంగాన్ని అన్ని వర్గాలను కలుపుకొని పోయేదిగాను, ఈ రంగాన్ని నిర్వహించడానికి సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థను ఆధునిక టెక్నాలజీని సద్వినియోగపరుచుకొనేదిగాను తీర్చిదిద్దడానికి పీఎఫ్ఆర్‌డీఏ కట్టుబడి ఉంది. కొత్త రూపురేఖలతో వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఈ దిశగా తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయం.
***
(रिलीज़ आईडी: 2152587)
आगंतुक पटल : 11