రక్షణ మంత్రిత్వ శాఖ
ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ పదవీబాధ్యతల స్వీకారం
Posted On:
01 AUG 2025 12:34PM by PIB Hyderabad
సైన్య ఉప ప్రధానాధికారి (ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ నిన్న పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకు ముందు, సైన్య ప్రధాన కార్యాలయంలో ఆపరేషనల్ లాజిస్టిక్స్-స్ట్రాటజిక్ మూవ్‌మెంట్’కు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు.
జనరల్ ఆఫీసర్‌కు 1987 డిసెంబరులో పారాషూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన 4వ బెటాలియన్‌లో బాధ్యతలు అప్పగించారు. పుష్పేంద్ర సింగ్ లక్నో లోని లా మార్టినియర్ కళాశాల, లక్నో విశ్వవిద్యాలయాలతో పాటు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమిలో కూడా చదువుకున్నారు. ‘ఆపరేషన్ పవన్’, ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’, ‘ఆపరేషన్ ఆర్కిడ్’లతో పాటు ‘ఆపరేషన్ రక్షక్’లకు వివిధ పదవులు చేపట్టి, తన సేవలు అందించారు.
తన 38 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో ఈ జనరల్ ఆఫీసర్ వివిధ కమాండ్ పదవులతో పాటు స్టాఫ్ పదవీ బాధ్యతలు నిర్వహించారు. కాశ్మీరులోయలో, నియంత్రణ రేఖ వద్ద స్పెషల్ ఫోర్సెస్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత, వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వెంబడి నిర్వహించిన ‘ఆపరేషన్ స్నో లెపర్డ్’లో ఓ పదాతి దళానికి, మౌంటెన్ డివిజన్‌కు కూడా నాయకత్వ బాధ్యతలను చేపట్టారు. జనరల్ ఆఫీసర్ హిమాచల్ ప్రదేశ్‌లోని కోర్‌కు చెందిన జీఓసీ (జనరల్ ఆఫీసర్ కమాండింగ్)గా ఉండి, కీలక జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ ప్రాంతాలకు బాధ్యుడిగా వ్యవహరించారు. పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో సైన్య విధుల తీరుతెన్నులపై పుష్పేంద్ర సింగ్‌కు లోతైన అవగాహనతో పాటు గట్టి పట్టు కూడా ఉంది.
ఈయన వెల్లింగ్టన్‌లోని డీఎస్ఎస్‌సీలో ప్రతిష్ఠాత్మక స్టాఫ్ కోర్సును, సికింద్రాబాద్‌లోని సీడీఎంలో హయ్యర్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కోర్సుతో పాటు ఐఐపీఏలో అడ్వాన్స్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లో కూడా పాలుపంచుకొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్‌తో పాటు, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్‌ను అందుకున్నారు.
దేశానికి అందించిన విశిష్ట సేవకు గాను ఈ జనరల్ ఆఫీసర్‌ను అతి విశిష్ట సేవా పతకమే కాకుండా ‘బార్ టూ సేనా పతకం’ కూడా లభించాయి.
***
(Release ID: 2151278)