మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీ సముదాయాలకు సాధికారతపై ‘పీఎంవికాస్’ ప్రత్యేక శ్రద్ధ..
*నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వం, మైనారిటీ సముదాయాల్లోని మహిళలకు నాయకత్వంలో శిక్షణ, బడి మానేసిన విద్యార్థులకు విద్యాసంబంధిత సహాయం
Posted On:
23 JUL 2025 9:10PM by PIB Hyderabad
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన పథకాల్లో ‘ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్’ (‘పీఎం వికాస్’) ఒకటి. ఇదివరకటి ‘సీఖో అవుర్ కమావో’ (ఎస్ఏకే)తో పాటు ‘నయీ రోష్ని’ సహా మొత్తం అయిదు పథకాలను కలిపేసి, ఈ స్కీమును ప్రవేశపెట్టారు. నైపుణ్యాలను అలవరచడం, పరిశ్రమలను, వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయాలన్న ఉత్సాహాన్ని కలిగి ఉన్నవారికి ఆ దిశగా అవసరపడే మద్దతును అందించడం, మైనారిటీ సముదాయాల్లోని మహిళలకు నాయకత్వ అంశాలలో శిక్షణనివ్వడం, బడికి వెళ్లే బాలలు మధ్యలో తమ చదువును ఆపివేస్తే అలాంటి విద్యార్థులకు విద్యా సంబంధిత సహాయాన్ని అందించడం.. ఈ కార్యక్రమాల అమలుపై పీఎం వికాస్ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
‘సీఖో అవుర్ కమావో’ (నేర్చుకోవడంతో పాటు డబ్బు సంపాదించండి) స్కీమును 2013-14లో ప్రారంభించారు. మైనారిటీ సముదాయాల్లో 14-45 ఏళ్ల వయసున్న వారికి సాంప్రదాయక, ఆధునిక రంగాలలో వారు సంపాదించుకొన్న నైపుణ్యాలను వారికున్న అర్హతలు, ఆర్థిక స్థోమతతో పాటు మార్కెట్ అవకాశాలను కూడా లెక్కలోకి తీసుకొని మరింతగా పెంచాలన్నదే ఈ పథకం లక్ష్యం. తద్వారా వారిని తగిన ఉద్యోగాలకు లేదా స్వయంఉపాధి మార్గాన్ని అనుసరించడానికి సన్నద్ధులను చేయాలనేదే ఈ స్కీము ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి సుమారు 4.68 లక్షల మందికి శిక్షణనిచ్చారు.
‘నయీ రోష్ని’ పథకాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రారంభించింది. మైనారిటీ సముదాయాలకు చెందిన మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి సాధికారతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఈ మహిళలకు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులతో పాటు ఇతర సంస్థలతో వివిధ స్థాయిలలో ఎలా వ్యవహరించుకోవాలన్న జ్ఞానాన్ని, మెలకువలతో పాటు వారికి అవసరమైన పనిముట్లను కూడా అందించాలనే లక్ష్యంతో 2012-13లో ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
వివిధ పథకాల పట్ల అవగాహనను పెంచడానికి, మైనారిటీ సముదాయాలకు చెందిన చేతివృత్తి కళాకారులు సాంస్కృతిక పరంగా, ఆర్థిక పరంగా అందిస్తున్న సేవలను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ యూఎస్‌టీటీఏడీ పథకంలో భాగంగా ‘హునర్ హాట్’ను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పీఎం వికాస్ పథకంలో భాగంగా ‘లోక్ సంవర్ధన్ పర్వ్’ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేతివృత్తుల వారికి తమ కళలను ప్రదర్శించడానికి, వారు ప్రజల దగ్గరకు వెళ్లడానికి ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గురించి మైనారిటీ సముదాయాలతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా అవగాహనను పెంచడం అనే రెండు లక్ష్యాలున్నాయి. ఇప్పటివరకు, ఈ శాఖ దేశంలో వివిధ ప్రాంతాల్లో 41 ‘హునర్ హాట్’లతో పాటు ‘లోక్ సంవర్ధన్ పర్వ్’ను 4 సార్లు నిర్వహించి, మైనారిటీ సముదాయాల్లోని చేతివృత్తుల కళాకారులకు వారి హస్తకళాప్రావీణ్యాన్ని చాటిచెప్పుకొనేందుకు, వారు తయారు చేసిన కళాకృతులను, దేశవాళీ ఉత్పత్తులను, వివిధ రకాల ఆహార పదార్థాలను విక్రయించేందుకు అవకాశాలను అందించారు.
‘లోక్ సంవర్ధన్ పర్వ్’ను ఏర్పాటు చేసినప్పుడు అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయి?, సందర్శకుల స్పందన ఎలా ఉంది? .. ఈ సమాచారం ఆధారంగా చేపట్టదగ్గ మార్పుచేర్పులతో ఈ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా, మరిన్ని చోట్ల ఏర్పాటు చేసే విషయంలో మంత్రిత్వ శాఖ చొరవ తీసుకొంటోంది. అవసరమనుకుంటే మెరుగైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం, స్టాళ్లను ఆకర్షణీయంగా ఏర్పాటుచేయడం, డిజిటల్ వ్యవస్థ ద్వారా కూడా విక్రయాలకు వీలు కల్పించడం, ఈ బజార్లలో పాల్గొనే చేతివృత్తిదారులకు సామర్థ్యాలను పెంచే కార్యక్రమాన్ని చేపట్డడంతో పాటు మరింత ప్రచారాన్ని, ప్రత్యేక ప్రచార వ్యూహాలను అనుసరించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు. స్టాళ్లను మరింత ఎక్కువ మంది సందర్శించేటట్లుగాను, ఉత్పత్తులను మెరుగుపరచడానికి సంబంధించి కొనుగోలుదారులు వ్యక్తం చేసే అభిప్రాయాలను తెలుసుకొనేందుకు అవకాశాల్ని కల్పిస్తూ పదుగురి దృష్టినీ మైనారిటీ హస్తకళాకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆకట్టుకొనేటట్లుగా చేస్తూ, మార్కెట్ సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నారు.
దీనికి అదనంగా, స్వయంఉపాధి దిశగా పయనిస్తున్న వారికి, సంస్థలను నెలకొల్పే వ్యక్తులుగా ఎదగదలుస్తున్న వారికి వెన్నుదన్నుగా నిలవడం కోసం రుణాలను ఈ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న నేషనల్ మైనారిటీ డెవలప్‌మెట్ కార్పొరేషన్ (ఎన్ఎండీఎఫ్‌సీ) నుంచి మంజూరు చేస్తున్నారు. ఈ మంత్రిత్వ శాఖ సాయంతో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గురించి ఎన్ఎండీఎఫ్‌సీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
మైనారిటీ వ్యవహారాల శాఖ ఇదివరకు అమలుచేసిన ‘సీఖో అవుర్ కమావో’, ‘నయీ రోష్ని’లు సహా అయిదు పథకాలను పీఎం వికాస్‌లో కలిపారు. మునుపటి కార్యక్రమాలతో అందిన ఫలితాలను పరిశీలనలోకి తీసుకొని, అనుభవం నుంచి పాఠాలు స్వీకరించి ఈ పథకాన్ని రూపొందించారు. పట్టణ ప్రజలకు మరింతగా సేవలు అందించాలనే ముఖ్యోద్దేశంతో ఢిల్లీలో ‘లోక్ సంవర్ధన్ పర్వ్’ను ఇంతవరకు మూడు సార్లు నిర్వహించారు.
ఈ సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు లోక్‌సభలో నిన్న ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2147867)