సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
“కణ్-కణ్ మే రామ్” ఒక దృశ్య కళాఖండం....రామాయణంలోని విశ్వజనీనమైన విలువల సంకలనం : శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఐఎన్‌టీఏసీహెచ్ డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేసిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి
Posted On:
23 JUL 2025 6:23PM by PIB Hyderabad
"కణ్-కణ్ మే రామ్" డాక్యుమెంటరీ చిత్రం విడుదల సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఐఎన్‌టీఏసీహెచ్ మల్టీపర్పస్ హాల్‌లో భారత జాతీయ కళలు-సాంస్కృతిక వారసత్వ ట్రస్టు (ఐఎన్‌టీఏసీహెచ్) ఆ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, సీనియర్ అధికారులు, పండితులు, పలువురు అతిథులు హాజరయ్యారు.
ప్రదర్శన అనంతరం శ్రీ షెకావత్ మాట్లాడుతూ.. ఐఎన్‌టీఏసీహెచ్ ప్రామాణిక పరిశోధన, సృజనాత్మక ప్రదర్శనను ప్రశంసించారు. ఈ చిత్రాన్ని దృశ్య కళాఖండంగా అభివర్ణించిన కేంద్రమంత్రి.. ఇది రామాయణంలో పొందుపరచిన విశ్వజనీనమైన విలువల సంకలనమని పేర్కొన్నారు. రామాయణాన్ని కేవలం ఒక పురాణమని కాకుండా, భారతీయ విశిష్టతను లోతుగా ప్రతిధ్వనించే సజీవ సంప్రదాయంగా ప్రదర్శిస్తూ ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారని ప్రశంసించారు.
కొనసాగుతున్న భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఐఎన్‌టీఏసీహెచ్ పాత్ర కీలకమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వారసత్వ పరిరక్షణలో నాలుగు దశాబ్దాల వారసత్వాన్ని ఉటంకించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖలో తన గత అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. గంగా సాంస్కృతిక డాక్యుమెంటేషన్ ప్రాజెక్టు విషయంలో ఐఎన్‌టీఏసీహెచ్ గణనీయ సహకారం అందించిందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా గంగా పరివాహక ప్రాంతానికి సంబంధించి భారతీయ సాంస్కృతిక గొప్పదనాన్ని అర్థం చేసుకోవడం, సంరక్షించడం పట్ల దాని నిబద్ధతను ఇది స్పష్టం చేసిందన్నారు.
ఐఎన్‌టీఏసీహెచ్ చైర్మన్ శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్, సభ్య కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ రవీంద్ర సింగ్, ఇతర అధికారులు కేంద్రమంత్రికి సాదర స్వాగతం పలికారు. అద్భుతమైన మన వారసత్వానికి తగిన ప్రచారం కల్పిస్తూ దానిని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఐఎన్‌టీఏసీహెచ్ కార్యక్షేత్రం దృశ్య, అవ్యక్త, సహజ వారసత్వ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. పాఠశాలలు, హస్తకళలు, ప్రచురణ సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నట్లు శ్రీ ఠాకూర్ తెలిపారు.
సంప్రదాయిక ప్రదర్శనలు, నృత్యం-నాటకాలు, తోలుబొమ్మలాట వంటి వివిధ ప్రదర్శన రూపాల ద్వారా భారత రామాయణాన్ని ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుంది. కర్ణాటక యక్షగానం, ఉప్పినికుద్రు తోలుబొమ్మలాట.. ఒడిశా లంకా పోడి యాత్ర, రావణ ఛాయ.. అస్సాం సత్రియా సంప్రదాయాలు, ఛత్తీస్గఢ్ మేవాటీ భాపాంగ్ ప్రదర్శన, రామనామి సమాజ్ వంటి ముఖ్యమైన సంప్రదాయిక ప్రదర్శనలు ఈ చిత్రంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ చిత్రం భారత ప్రదర్శన కళల ద్వారా రామాయణ సాంస్కృతిక వైవిధ్యాన్ని, శాశ్వత వారసత్వాన్ని కళ్లకు కడుతుంది.
“కణ్-కణ్ మే రామ్ లేదా ది ఎటర్నల్ రామ్” అనే ఆధ్యాత్మిక భావన మతాల సరిహద్దులకు అతీతంగా మానవాళి అంతటికీ సందర్భోచితమైనది, స్ఫూర్తిదాయకమైనది. శ్రీరాముడిని దైవిక రూపంలో మన మానసిక చేతనతో అనుసంధానం అవుతుంది. అదే ఈ చిత్ర ముఖ్య సందేశం.. స్వరం. భారత అవ్యక్త సాంస్కృతిక వారసత్వ గొప్పతనాన్ని.. స్థాయిని సంరక్షించడం, అర్థం చేసుకోవడం, ప్రదర్శించడంలో ఐఎన్‌టీఏసీహెచ్ నిరంతర నిబద్ధతకు ఈ చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది.
“కణ్-కణ్ మే రామ్” డాక్యుమెంటరీ చిత్రం నుంచి కొన్ని ఛాయాచిత్రాలు
పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 2147623)