మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టే వారికి బీమా అండదండలు

Posted On: 23 JUL 2025 4:20PM by PIB Hyderabad

చేపల పెంపకం రంగాన్ని దీర్ఘకాల ప్రాతిపదికన ఒక బాధ్యతగా అభివృద్ధి చేయడంతో పాటు మత్స్యకారుల సంక్షేమం.. ఈ రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ‘నీలి విప్లవాన్ని’ (చేపలు, రొయ్యల భారీ స్థాయి పెంపకం) తీసుకు రావడానికి ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ పేరుతో ఒక ప్రధాన పథకాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖకు చెందిన మత్స్య విభాగం అమలుచేస్తోంది. ఈ పథకానికి రూ.20,050 కోట్ల పెట్టుబడిని నిర్దేశించుకొన్నారు. ఈ పథకం ఇతర విషయాలతో పాటు, అంతర్దేశీయ మత్స్యకారులు, చేపల రంగంలో పని చేసే వారు సహా మత్స్యకారులకు సామూహిక ప్రమాద బీమా కవరేజీ రూపంలో సామాజిక భద్రత కవచాన్ని అందిస్తుంది. సముద్రంలో చేపలు పట్టే వారితో పాటు అంతర్దేశీయ మత్స్యకారులు, అనుబంధ మత్స్య కారులను కూడా చేర్చుకొనే వెసులుబాటు ఈ పథకంలో  ఉంది. పూర్తి బీమా ప్రీమియం సొమ్మును కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో, హిమాలయ సమీప రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల విషయంలో అయితే 90:10 నిష్పత్తిలో పంచుతారు. కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే, పూర్తి బీమా ప్రీమియాన్ని కేంద్రమే చెల్లిస్తుంది. పీఎంఎంఎస్‌వైలో భాగంగా అందించే బీమా కవరేజీలో (i) మరణం లేదా శాశ్వత శారీరక అశక్తత.. ఈ సందర్భాల్లో రూ.5 లక్షలు, (ii) శాశ్వతంగా శారీరక పాక్షిక అశక్తత ఏర్పడిన సందర్భంలో రూ.2.5 లక్షలు, (iii) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరితే రూ.25,000 వంతున అందజేస్తారు. పీఎంఎంఎస్‌వైని అమలు చేసిన గత మూడు సంవత్సరాల్లో (2022-23 నుంచి 2024-25 వరకు), కేంద్ర ప్రభుత్వం 103.73 లక్షల మంది మత్స్యకారులకు బీమా రక్షణ కోసం రూ.54.03 కోట్లు విడుదల చేసింది. దీనిలో ఏటా సగటున 34.57 లక్షల మంది మత్స్యకారులకు ఈ సదుపాయం లభించింది.

ఈ సమాచారాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ రాజ్య సభ లో ఈ రోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.


 

***


(Release ID: 2147443)
Read this release in: English , Urdu , Hindi