జల శక్తి మంత్రిత్వ శాఖ
జల అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
16 JUL 2025 7:27PM by PIB Hyderabad
జలాల పంపిణీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సమస్యలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రిత్వశాఖలో సంయుక్త సమావేశం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
సమావేశం సందర్భంగా జలాల నిర్వహణలోని కీలకాంశాలు చర్చకు వచ్చాయి. కృష్ణా బేసిన్ లో నీటి పారుదల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం ఆనకట్టను పరిరక్షించేందుకు, అవసరమైన మరమ్మత్తులను తక్షణమే చేపట్టాలని నిర్ణయించారు. కృష్ణా నది నీటి నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడ లేదా అమరావతికి మార్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.
మిగిలిన అంశాలను సమగ్రంగాను, సాంకేతిక కోణంలోను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమానంగాను, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండాను జలాలను పంచుకోవడానికి అవసరమైన ఆచరణీయ పరిష్కారాలని సూచించేందుకు కమిటీ సమష్టి కృషి చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించి, ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే అనుకూలమైన జల నిర్వహణ పద్ధతులను ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2145394)
आगंतुक पटल : 12