బొగ్గు మంత్రిత్వ శాఖ
ఈసీఎల్ ఝంజ్రా ఏరియా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
21 JUN 2025 8:05PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థ అయిన ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) ఝంజ్రా ఏరియా సిందూర్ పార్కులో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐడీవై) వేడుకలకు కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నాయకత్వం వహించారు. శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ప్రోత్సహిస్తూ.. ఈ సంవత్సర ప్రపంచ ఇతివృత్తం "యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్"కి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ కిషన్ రెడ్డితో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్, సీఐఎల్ చైర్మన్.. సీఎమ్‌డీ-ఈసీఎల్ శ్రీ పీఎమ్ ప్రసాద్, ఇతర సీనియర్ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యం, సుస్థిరత పట్ల బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ ఆధునికీకరించిన ఎకో-పార్క్ పచ్చదనం ఆవరణలో 1,500 మందికి పైగా సామూహికంగా యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించుకోవడం కోసం నిత్యజీవితంతో యోగాను అనుసంధానించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. బొగ్గు కార్మికులు ప్రతిరోజూ అరగంట యోగా కోసం కేటాయించాలని, ఇది మంచి ఆరోగ్యానికి ఏకైక మార్గమని ఆయన ఉద్బోధించారు.
హిందీ, ఆంగ్ల భాషల్లోనూ అందుబాటులో ఉన్న కామన్ యోగా ప్రోటోకాల్ పుస్తకాన్ని ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రచురణ విభాగం సూచనలతో కోల్ ఇండియా లిమిటెడ్ ఈ పుస్తకాన్ని రూపొందించింది.
ఈసీఎల్ పర్యావరణ సుస్థిరత ప్రయత్నాల్లో భాగంగా పూర్తి పచ్చదనంతో పునరుద్ధరించిన సిధూర్ పార్కును ఈనెల 20న శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. పర్యావరణ పరివర్తన, సమాజ శ్రేయస్సుకు ఈ పార్కు చిహ్నంగా నిలుస్తుంది. "ఏక్ పేడ్ మా కే నామ్" ప్రచారం కింద ఝంజ్రాలో నిర్వహించిన చెట్ల పెంపకం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రేమతో కూడిన తల్లి పెంపకం స్ఫూర్తికి నివాళిగా కేంద్ర మంత్రి మొక్కలు నాటి, పర్యావరణ నిర్వహణ ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం ప్రకృతితో తిరిగి అనుసంధానమవడం, భవిష్యత్ తరాల కోసం దానిని సంరక్షించడం అనే సందేశాన్ని అందించింది.
ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని ఝంజ్రా ఏరియా పర్యటనలో భాగంగా.. కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ కిషన్ రెడ్డి భూగర్భ గనులను సందర్శించారు. తన విస్తృత పర్యటనలో గనుల్లో అనుసరిస్తున్న కార్యాచరణ పద్ధతులు, భద్రతా ప్రోటోకాల్‌లను పరిశీలించారు. పూర్తి భద్రతా సామాగ్రిని ధరించి గనిలోకి దిగిన మంత్రి ఫ్రంట్‌లైన్ కార్మికులు, సాంకేతిక సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిరంతర మైనింగ్ కార్యకలాపాలు, లాంగ్‌వాల్ పరికరాలు సహా గనుల్లో ఉపయోగిస్తున్న అధునాతన మైనింగ్ సాంకేతికతలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. భూగర్భ మైనింగ్‌ను ఆధునికీకరించడం, కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడం, వృత్తిపరమైన భద్రతలో అత్యున్నత ప్రమాణాలను పాటించడం పట్ల మంత్రిత్వ శాఖ విధానాన్ని ఈ సందర్శన స్పష్టం చేసింది. సవాలుతో కూడిన పని వాతావరణంలో సాగిన ఆయన పర్యటన గనుల్లో పనిచేసే సిబ్బందికి మద్దతు, ప్రేరణల బలమైన సందేశాన్నిచ్చింది. సుస్థిరమైన, సాంకేతికత ఆధారిత బొగ్గు ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేసింది.
పర్యావరణ అవగాహనను, సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ప్రాజెక్ట్ ప్రభావిత వ్యక్తులు (పీఏపీలు), బొగ్గు గని కార్మికులకు శ్రీ కిషన్ రెడ్డి పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అంతేకాకుండా బొగ్గు ఉత్పత్తి పట్ల వారి అంకితభావం, సహకారానికి తగిన గుర్తింపునిస్తూ.. సిబ్బందిలో సమర్థత, ప్రేరణల సంస్కృతిని ప్రోత్సహిస్తూ అత్యుత్తమ పనితీరు కనబరిచిన కార్మికులను ఆయన సత్కరించారు.
ఐడీవై వేడుకల అనంతరం ఈసీఎల్, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఉత్పత్తి పనితీరు, సుస్థిరత ప్రయత్నాలు, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ విస్తరణ, గని భద్రత, కార్మిక సంక్షేమ చర్యల గురించి సమావేశంలో చర్చించారు. ఇంధన భద్రత, పర్యావరణ బాధ్యతల మధ్య సమతుల్యతను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను మంత్రి స్పష్టం చేశారు. కొనసాగుతున్న సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
అనంతరం ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన సోనేపూర్ బజారి గనిని కేంద్ర మంత్రి సందర్శించారు. రాణిగంజ్ బొగ్గు క్షేత్ర వ్యూహాత్మక ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ.. నాన్ కోకింగ్ బొగ్గు దిగుమతికి ప్రత్యామ్నాయాన్ని పెంచడం కోసం ఈ ప్రాంతం నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. సోనేపూర్ ఆర్-ఆర్ (పునరావాసం-పునరుద్ధరణ) గ్రామాన్నీ కేంద్ర మంత్రి సందర్శించారు. నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడిన ఆయన, ఈసీఎల్ అభివృద్ధి చేసిన ఉమ్మడి మౌలిక సదుపాయాల నాణ్యతను ప్రశంసించారు. నివాసితుల సమస్యలను శ్రద్ధగా విన్న శ్రీ కిషన్ రెడ్డి.. తాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించి ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చేలా "హర్ ఘర్ జల్" యోజనను సకాలంలో అమలు చేయాలని ఈసీఎల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
మధుదంగ పునరావాస-పునరుద్ధరణ (ఆర్-ఆర్) సైట్‌నూ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఇది ప్రతిబింబించింది.
తన సామాజిక భాగస్వామ్యంలో భాగంగా కేంద్ర మంత్రి వర్కర్స్ క్లబ్‌ను సందర్శించారు. స్థానిక దివ్యాంగులకు 21 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఇది సమ్మిళితత్వం, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పన, వారి సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని చాటుతూ.. కొత్తగా ఉద్యోగాలు సాధించిన మొత్తం 101 మందిలో 25 మందికి కేంద్ర మంత్రి నియామక లేఖలను అందజేశారు.
కేంద్ర మంత్రి పర్యటన, యోగా దినోత్సవ వేడుకలు.. సమగ్ర శ్రేయస్సు, పర్యావరణ స్థిరత్వం, సాంకేతిక పురోగతి, బొగ్గు కమ్యూనిటీల సంక్షేమం పట్ల బొగ్గు మంత్రిత్వ శాఖకు గల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబించాయి. అభివృద్ధిని కరుణ, సమ్మిళితత్వాలతో అనుసంధానించడం ద్వారా.. దేశానికి ఇంధనంగా ఉండటమే కాకుండా ప్రజలకు సాధికారత కల్పించేలా బొగ్గు రంగాన్ని మంత్రిత్వ శాఖ మెరుగుపరుస్తూనే ఉంది.
****
(Release ID: 2138796)