గనుల మంత్రిత్వ శాఖ
గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం కోసం యోగా' వేడుకలు: వారం రోజుల పాటు జరిగిన బూట్ క్యాంప్‌నకు 20,000 మందికి పైనే హాజరు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా జరిగిన కార్యక్రమం
Posted On:
20 JUN 2025 8:29PM by PIB Hyderabad
ఈ సంవత్సరం యోగా దినోత్సవం ఇతివృత్తమైన "ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం కోసం యోగా"కు అనుగుణంగా గనుల మంత్రిత్వ శాఖ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో జరుపుకొంటోంది. ఈ సారి ఇతివృత్తం వ్యక్తిగత శ్రేయస్సుకు భూమాత ఆరోగ్యానికి మధ్య లోతైన సంబంధాన్ని.. ఈ రెండింటినీ కలిపే శక్తిమంతమైన సాధనంగా యోగా పనిచేసే తీరును తెలియజేస్తోంది.
దార్శనికుడైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం నుంచి ప్రేరణ పొందిన గనుల శాఖ తన సిబ్బందితో పాటు సమాజంలో యోగాను ఒక జీవన విధంగా ప్రోత్సహించటానికి వరుస కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ప్రధాన కార్యక్రమం 2025 జూన్ 21న ఉదయం 7:00 గంటల నుంచి దిల్లీలోని వినయ్ మార్గ్‌లో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వీ.ఎల్. కాంతారావు నేతృత్వంలో జరగనుంది. దీనికి సీనియర్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబాలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది యోగా చేయనున్నారు. దీనితో పాటు మంత్రిత్వ శాఖ పరిధిలో క్షేత్ర స్థాయిలో ఉండే గనులు, భౌగోళిక-వారసత్వ ప్రదేశాలు, వాణిజ్య కార్యాలయాలు తదితరాలతో కూడిన 81కి పైగా ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జరగనున్న వేడుకలకు మందస్తు కార్యక్రమంగా మంత్రిత్వ శాఖ తన క్షేత్ర స్థాయి కార్యాలయాలు.. నాల్కో, హెచ్‌సీఎల్, ఎంఈసీఎల్, ఐబీఎం, జీఎస్ఐ, జేఎన్ఆర్‌డీడీసీ, ఎన్ఐఆర్ఎంతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల్లో జూన్ 14 నుంచి 20 వరకు 6 రోజుల సమగ్ర యోగా బూట్ క్యాంప్ నిర్వహించింది. అధికారులు, గనుల్లో పనిచేసే కార్మికులు, కాంట్రాక్టు సిబ్బంది, స్థానిక ప్రజలు, పాఠశాల స్థాయి పిల్లలు, మహిళా ఉద్యోగుల కోసం భూగర్భ గనుల్లో ప్రవేశ మార్గాల వద్ద కూడా యోగా సెషన్‌లు జరిగాయి. వారం పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో.. ఆరోగ్య సంరక్షణ చర్చలు, యోగా-విరామ(వై-బ్రేక్) కార్యక్రమాలు, సృజనాత్మక పోటీలు కూడా ఉన్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమయం సమీపిస్తోన్న వేళ జూన్ 20న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర గనుల మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన మెగా కార్యక్రమం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, యోగా సంస్థలకు చెందిన వారితో పాటు విద్యార్థులు, స్థానిక ప్రజలతో సహా 35,000 మంది పాల్గొన్నారు. ఐక్యత, శ్రేయస్సు, ఉమ్మడి సామర్థ్యానికి ఈ సామూహిక యోగా కార్యక్రమం ఒక చిహ్నంగా నిలిచింది.
పనిప్రదేశాల ఉత్పాదకత, సామాజిక శ్రేయస్సులో ఆరోగ్య సంరక్షణను సమీకృతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విస్తృత దృక్పథాన్ని ఈ కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. మరింత మందికి, మరిన్ని వర్గాలతో పాటు ఈ ధరిత్రి కోసం యోగా అనే భావనతో ఈ లక్ష్యం దిశగా మరింత ముందుకెళ్లేందుకు గనుల శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2138200)