సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకీకృత పెన్షన్ పథకం (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్) కింద ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలు: డీఓపీటీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించే ఈ నిర్ణయంతో అందరికీ సమానంగా ప్రయోజనాలు; జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అన్ని వర్గాల ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ కొత్త నిబంధన నిదర్శనం: డాక్టర్ జితేంద్ర సింగ్

నిబంధనల్లో మార్పులు, పాలనకు నూతన దిశ: సిబ్బంది మంత్రిత్వ శాఖలో 11 సంవత్సరాల సంస్కరణలను వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్

స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా, కొత్త నిబంధనలు రూపొందించటానికి బదులుగా కాలంచెల్లిన , అనవసరమైన నిబంధనలను రద్దు చేయడం ప్రభుత్వానికి గర్వకారణం: వలసకాలం నాటి 1,600 పైగా నిబంధనలను రద్దు చేశాం: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 18 JUN 2025 4:21PM by PIB Hyderabad

సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ గత 11 సంవత్సరాలుగా పాలనను సరళీకృతం చేయడం, ప్రజలకు సాధికారత కల్పించడం, పరిపాలనకు మానవతా కోణాన్ని జోడించడం వంటి అంశాలలో విప్లవాత్మక మార్పుల దిశగా ప్రయాణం సాగిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా),  ప్రధానమంత్రి కార్యాలయం, అను ఇంధన శాఖ, అంతరిక్ష, శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

సెంట్రల్ సివిల్ సర్వీస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) నిబంధనలు, 2021 ప్రకారం ఏకీకృత పెన్షన్ పథకంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై పదవీ విరమణ, మరణనానంతర గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులు అవుతారని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ, ఈ నిర్ణయం ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్‌ను తీర్చడమే కాక, పదవీ విరమణ ప్రయోజనాలను అందరికీ సమానంగా అందిస్తుందని ఆయన చెప్పారు. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అన్ని తరగతుల ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ కొత్త నిబంధన నిదర్శనమని అన్నారు.

నేషనల్ మీడియా సెంటర్ లో ఈరోజు ఒక కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వంలో మారుతున్న పాలనా ముఖచిత్రాన్ని ప్రతిబింబించే విధంగా సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పనితీరును నాలుగు ప్రధాన భాగాలుగా విభజించినట్టు వివరించారు..

“స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా, కొత్త నిబంధనలు రూపొందించడం కాకుండా, అనవసరమైన పాత నిబంధనలను తొలగించడాన్ని ప్రభుత్వం గర్వకారణంగా భావిస్తోంది” అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వలస కాలం నాటి వారసత్వం కలిగిన 1,600 పైగా పాత నిబంధనల రద్దును ఆయన ప్రస్తావిస్తూ, ఇది పౌరులలో ముఖ్యంగా భారత యువత లో విశ్వాసాన్ని నింపిన బలమైన సందేశమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రకటించిన మేరకు కొన్ని వర్గాలకు ఉద్యోగ ఇంటర్వ్యూలను మూల్యాంకనం నుంచి మినహాయించాలన్న నిర్ణయం 2016 జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందని, ఇది నియామకాల్లో నిష్పాక్షికత, పారదర్శకత దిశగా కీలక చర్య అని కేంద్రమంత్రి అభివర్ణించారు.

మంత్రిత్వ శాఖ చేపట్టిన అనేక సంస్కరణలు కేవలం పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, విస్తృతమైన సామాజిక-సాంస్కృతిక సందేశాలను కూడా కలిగి ఉన్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులకు బాధ్యతను, రక్షణను కల్పించాయని, అదే విధంగా, నియామక పరీక్షల్లో అన్యాయ మార్గాలకు సంబంధించి కేసులను పరిష్కరించే విధానాల్లో తెచ్చిన మార్పులు మోసపూరిత ముఠాల ప్రభావం నుంచి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేందుకు దోహదపడతాయని ఆయన తెలిపారు.“మోసగాళ్లను శిక్షించడానికే మేం ఉన్నాం తప్ప విద్యార్థులను శిక్షించడానికి కాదు' అని మంత్రి స్పష్టం చేశారు.ప్రభుత్వ విధానాల పట్ల అనుమానాస్పద స్థితి నుంచి మద్దతు వైపు మళ్లాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. ఈ మార్పులు పరిపాలనకు కొత్త దృక్పథాన్ని అందించడానికి సహాయపడ్డాయని, ఇక్కడ ఉద్దేశం లో దోషం ఉండదని, విశ్వాసమే పునాది విలువగా మారుతుందని ఆయన అన్నారు.

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిన సంస్కరణలు మంత్రిత్వ శాఖ ప్రయత్నాలలో మూడో మూలస్తంభంగా నిలిచాయని జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుత నిబంధనల్లో ఉన్న సమన్వయ లోపాలను స్వయంగా అనుభవించిన సందర్భాలు ఈ మార్పులకు ప్రేరణగా నిలిచాయని ఆయన తెలిపారు. పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రారంభం, విడాకులు తీసుకున్న లేదా వేరుగా జీవిస్తున్న కుమార్తెలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా నిబంధనలలో మార్పులు, ప్రసవ సందర్భాల్లో ప్రసూతి సెలవు సదుపాయం వంటి సంస్కరణలను ఇందుకు ఉదాహరణలుగా మంత్రి వివరించారు. “ప్రజా సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యక్తుల గౌరవాన్ని పెంచే పరిష్కారాలను రూపొందించడానికి కృషి చేశామని” ఆయన చెప్పారు. సరైన సమయంలో ఉద్యోగాల్లో పురోగతి లేకుండా పనిచేసిన అధికారులకు ఉపశమనం కలిగించడానికి 19,000కి పైగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను వేగవంతం చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ చర్యలు విధానాలను సానుభూతి కోణంలో చూసే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.

ఆవిష్కరణ (ఇన్నోవేషన్) లను నాలుగో కీలక అంశంగా పేర్కొన్న  మంత్రి, అనేక పాలనా సంస్కరణలు వినూత్న ఆలోచనలు, సాంకేతికత అన్వయింపుతో కూడి ఉన్నాయని చెప్పారు. సామర్థ్య పెంపు (కెపాసిటీ బిల్డింగ్) కమిషన్ ఏర్పాటు, ఐజీఓటీ-కర్మయోగి ప్లాట్ ఫామ్ ను ప్రవేశపెట్టడం నిజ జీవిత సవాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధం చేయడంలో విప్లవాత్మక మార్పుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 26 లక్షలకుపైగా ఫిర్యాదులను పరిష్కరిస్తూ, 95-96% పరిష్కార రేటుతో పని చేస్తున్న సిపిజిఆర్ఎంఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ ను   డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ప్రాముఖ్యమైన ఉదాహరణగా పేర్కొన్నారు.ఈ పోర్టల్ ద్వారా ప్రజల ఆకాంక్షలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో, అలాగే ప్రతిస్పందనాత్మక పాలన ప్రజల్లో విశ్వాసాన్ని ఎలా పెంచుతోందో స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. పదవీ విరమణ చేసే అధికారులు భవిష్యత్ ఉద్యోగుల అవసరం కోసం తమ అనుభవాలను లిఖితరూపంగా నమోదు చేసే 'అనుభవ్', ఐఏఎస్ అధికారులకు అసిస్టెంట్ సెక్రటరీ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు విజ్ఞాన ఆధారిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థను నిర్మించే ప్రయత్నాలుగా కేంద్రమంత్రి అభివర్ణించారు. "మేం అవినీతి (రెడ్ టేప్) నుంచి తక్షణ కాలానికి ఫైల్ తీయడం నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారిత విధాన నిర్ణయాల వైపు మారాం” అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సంస్కరణలు నవ భారతదేశ పాలనా తీరును పూర్తిగా మార్చే దిశగా పయనిస్తున్నాయని ఆయన ముగింపు వ్యాఖ్యల్లో పేర్కొన్నారు.

విలేకరుల సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పారదర్శకత, బాధ్యతా విధానం, సేవలను అందించడంపై మంత్రిత్వ శాఖ నిరంతర కృషిని ప్రతిబింబించే పలు కీలక ప్రచురణలు, డిజిటల్ కార్యాచరణలను విడుదల చేశారు. వీటిలో డీఓపీటీ,   డిఏఆర్పీజీ,  డీఓపీపీడబ్ల్యూ  విభాగాల విజయాలపై పుస్తకాలు ఉన్నాయి. ఈ ప్రచురణలు మూడు విభాగాలలో సంస్కరణలు, సాధించిన ప్రగతిపై సమగ్ర అవలోకనాన్ని అందిస్తాయి.

మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ఫ్యామిలీ పెన్షనర్ల ఫిర్యాదుల కోసం ప్రత్యేక ప్రచార మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. అలాగే, 2024 ఆగస్టు నుంచి 2025 జూన్ వరకు తీసుకువచ్చిన సర్క్యులర్‌ల సంకలనాన్ని, సెంట్రల్ సివిల్ సర్వీసుల (యూనియన్ పబ్లిక్ సర్వీస్) నిబంధనలకు సంబంధించిన సర్క్యులర్‌లను కూడా విడుదల చేశారు. పరిపాలనా వ్యవస్థలో సామర్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సేవోత్తమ్ ట్రైనింగ్ మాడ్యూళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి ప్రభుత్వ సేవలను అందించడంలో అత్యుత్తమతను సంస్థాత్మకంగా అమలు చేయడాన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు.

సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటి) కార్యదర్శి శ్రీమతి రచనా షా మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు,  సమ్మిళిత పాలన పద్ధతులను గురించి వివరించారు. ప్రధానమంత్రి  సూచించిన “తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన” అనే మంత్రాన్ని ఆధారంగా చేసుకుని, కొన్ని ఉద్యోగాలకు  ఇంటర్వ్యూలను రద్దు చేయడం, నియామక ప్రక్రియల వేగవంతం, ఈ- హెచ్ఆర్ఎంఎస్, ఈ- ఏపీఏఆర్  వంటి  ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డిజిటలీకరణ, పలు భారతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను ఆమె వివరించారు. జాతీయ నియామక సంస్థ,  రోజ్‌గార్ మేళాలను యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలకమైన మార్గదర్శక చర్యలుగా పేర్కొన్నారు. రిజర్వ్డ్ కేటగిరీల్లో 4.5 లక్షల పెండింగ్ ఖాళీలను భర్తీ చేసినట్టు చెప్పారు.. కేంద్ర సచివాలయ సేవలో 19,000 పైగా  పదోన్నతుల కేసులను వేగంగా పూర్తిచేసి  ఉద్యోగులలో నమ్మకం పెంచామని తెలిపారు. ప్రసూతి సెలవు, శిశు సంరక్షణ, దివ్యాంగుల రిజర్వేషన్ వంటి అంశాలపై సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసినట్టు పేర్కొన్నారు. మిషన్ కర్మయోగి క్రింద చేపట్టిన సామర్థ్య పెంపు వికాస కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు  కోటి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇందులో భాగస్వాములుగా చేశారు. తద్వారా నిరంతర విద్యాభ్యాసానికి అనుకూలమైన సంస్కృతి నెలకొల్పారు. అలాగే, పారదర్శకత, బాధ్యతాయుత పాలనపై సిబ్బందీ, శిక్షణ శాఖ ప్రాధాన్యతను శ్రీమతి రచనా షా ప్రముఖంగా వివరించారు. డిజిటల్ ఆర్టీఐ  ప్లాట్‌ఫామ్‌లు, ఆధునికీకరించిన  కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ద్వారా ఈ లక్ష్యాన్ని బలోపేతం చేశారు. వర్చువల్ హియరింగ్స్, ఈ-గవర్నెన్స్ సాధనాల విస్తృత వాడకం ద్వారా 8.9 లక్షలకు పైగా కేసులను పరిష్కరించారు.

పాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డి ఏఆర్పీజీ),  పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యు) కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలలో అమలైన విస్తృత స్థాయి పాలనా సంస్కరణలు, డిజిటల్ పౌర సేవలను వివరించారు. ఇవన్నీ ప్రధానమంత్రి  “సిటిజన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్"  దార్శనికతకు అనుగుణంగా అమలయ్యాయని చెప్పారు. సిపిజిఆర్ జిఎంఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల పరిష్కార వేదికల్లో ఒకటిగా అభివృద్ధి చెందిందని, ప్రతిస్పందన సమయాలను 14 రోజులకు తగ్గించడంతో సంవత్సరానికి 26 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తుందని ఆయన వివరించారు. 20 లక్షలకు పైగా పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్ ఇప్పుడు సేవలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సుశాసన్ సప్తాహ్, స్వచ్ఛతా ప్రచారాలు, జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డులు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ లలో ఈ-ఆఫీస్ నమూనాలను ప్రతిబింబించడం వంటి కార్యక్రమాలు స్పష్టమైన ప్రభావాన్ని చూపాయని వివరించారు. పెన్షన్లకు సంబంధించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, రిటైర్మెంట్‌కు ముందు కౌన్సిలింగ్ సేవల ద్వారా 4 కోట్లమందికి పైగా పెన్షనర్లను డిజిటల్‌గా శక్తిమంతం చేశారు. ప్రజాదరణ పొందిన పెన్షన్ అదాలత్‌ల ద్వారా 25,000కి పైగా కేసులను ప్రత్యక్షంగా పరిష్కరించారు. సమగ్ర పెన్షన్ ఫామ్‌లు, కేంద్ర సివిల్ సర్వీస్ (సీసీఎస్) నియమావళి సరళీకరణ వంటి చర్యలు పెన్షనర్ల జీవన సౌలభ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాల సమయంలో సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు),   ప్రజా పాలనా వేదికల్లో లభిస్తున్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సహా ఉత్తమ పాలనపై  అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న భారత్ భాగస్వామ్యం గురించి కూడా శ్రీ  శ్రీనివాస్ ప్రస్తావించారు.

వేదికపై మంత్రిత్వ శాఖకు చెందిన మూడు విభాగాల సీనియర్ అధికారులూ హాజరయ్యారు. వారిలో సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటి) కి చెందిన ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి మనీషా సక్సేనా, అదనపు కార్యదర్శులు శ్రీ ఎ.పీ.దాస్ జోషి, శ్రీ మనోజ్ కుమార్ ద్వివేది, అలాగే పాలన సంస్కరణలు,ప్రజా ఫిర్యాదుల విభాగం (డి ఏ ఆర్పీజీ) కి చెందిన అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ యాదవ్ ఉన్నారు. మంత్రిత్వ శాఖ పదకొండు సంవత్సరాల సంస్కరణలు,  ఆవిష్కరణల ప్రయాణానికి గుర్తుగా ఏకీకృత పరిపాలనా ఉనికిని ప్రదర్శిస్తూ సిబ్బందీ, శిక్షణ శాఖ, , పెన్షన్,  పెన్షనర్ల సంక్షేమ శాఖ, పాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగాలకు చెందిన సీనియర్ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

*****


(Release ID: 2137649)