వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌కు 2024–25లో 81.04 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)


దేశంలోకి ‘ఎఫ్‌డిఐ’ రాకలో 14 శాతం పెరుగుదల... ఇందులో 19 శాతం వాటాతో సేవల రంగం ముందంజ

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2025 6:46PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారు హిత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం- అన్ని రంగాల్లోనూ స్వయంచలిత మార్గం ద్వారా 100 శాతం ‘ఎఫ్‌డిఐ’కి అవకాశం ఏర్పడింది. మరోవైపు భారత్‌ను ఆకర్షణీయ, పోటీతత్వ పెట్టుబడి గమ్యంగా సదా నిలబెట్టడం కోసం ఈ విధానాన్ని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తూంటుంది. అందువల్ల దేశంలోకి ‘ఎఫ్‌డిఐ’ రాక స్థిరంగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా 2013–14లో 36.05 బిలియన్‌ డాలర్ల నుంచి 2023–24లో 71.28 బిలియన్‌ డాలర్లుకు చేరి, అటుపైన 14 శాతం వృద్ధితో 2024–25కల్లా 81.04 బిలియన్‌ డాలర్ల స్థాయికి (తాత్కాలిక అంచనా) పెరిగింది.

‘ఎఫ్‌డిఐ’కి సంబంధించి 2024–25లో సేవల రంగం వాటా అత్యధికంగా ఉంది. ఈ మేరకు వచ్చిన మొత్తం పెట్టుబడులలో 19 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, కంప్యూటర్ సాఫ్ట్‌ వేర్- హార్డ్‌ వేర్ రంగం, (16శాతం) ట్రేడింగ్ రంగం (8 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తంమీద సేవల రంగంలోకి ‘ఎఫ్‌డిఐ’ గత సంవత్సరం 6.64 బిలియన్‌ డాలర్లు కాగా, 40.77 శాతం పెరుగుదలతో 9.35 బిలియన్‌ డాలర్లకు చేరింది.

భారత తయారీ రంగం కూడా నేడు ‘ఎఫ్‌డిఐ’కి కూడలిగా మారుతుండగా 2024–25లో పెట్టుబడులు 18 శాతం పెరిగాయి. కాగా, 2023–24లో 16.12 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 19.04 బిలియన్‌డాలర్లకు చేరింది.

ఇక రాష్ట్రాలవారీగా- 2024–25లో మొత్తం ‘ఎఫ్‌డిఐ’లో మహారాష్ట్ర 39 శాతంతో అత్యధిక వాటా పొందగా, కర్ణాటక (13 శాతం), ఢిల్లీ (12 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ పెట్టుబడులు సమకూర్చిన దేశాలలో సింగపూర్ 30 శాతంతో ముందంజలో ఉండగా, మారిషస్ (17 శాతం), అమెరికా (11 శాతం) తదుపరి స్థానాల్లో నిలిచాయి.

గడచిన 11 సంవత్సరాల్లో (2014–25) భారత్‌ 748.78 బిలియన్‌ డాలర్ల ‘ఎఫ్‌డిఐ’లను ఆకర్షించింది. ఇది మునుపటి 11 ఏళ్లతో (2003–14) పోలిస్తే, 143 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తంమీద 308.38 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గత 25 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 1,072.36 బిలియన్‌డాలర్లలో ఇది దాదాపు 70 శాతం కావడం గమనార్హం.

అదేవిధంగా ‘ఎఫ్‌డిఐ’ సమకూర్చే దేశాల సంఖ్య 2013–14లో 89 కాగా, 2024–25లో 112కు పెరడాన్ని బట్టి  పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌కుగల ప్రపంచవ్యాప్త ఆకర్షణ స్పష్టమవుతోంది.

ఇక నియంత్రణ రంగంలో ‘ఎఫ్‌డిఐ’ నిబంధనల సరళీకరణ లక్ష్యంగా ప్రభుత్వం బహుళ రంగాల్లో ప్రగతిశీల మార్పుల దిశగా సంస్కరణలు అమలు చేసింది. ఈ మేరకు 2014-2019 మధ్య చేపట్టిన కీలక సంస్కరణలలో రక్షణ, బీమా, పెన్షన్ రంగాల్లో ‘ఎఫ్‌డిఐ’ పరిమితి పెంపుతోపాటు నిర్మాణ, పౌర విమానయాన, సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తకం కోసం ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలు కూడా భాగంగా ఉన్నాయి.

అలాగే 2019 నుంచి 2024 వరకూ బొగ్గు తవ్వకం, కాంట్రాక్ట్ తయారీ, బీమా మధ్యవర్తిత్వ  సంస్థలలో స్వయంచలిత మార్గంలో 100 శాతం ‘ఎఫ్‌డిఐ’ని అనుమతించడం వంటి కీలక చర్యలు చేపట్టింది. ఇక 2025 కేంద్ర బడ్జెట్లో తమ మొత్తం ప్రీమియంను భారత్‌లో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ‘ఎఫ్‌డిఐ’ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ప్రతిపాదించింది.

ప్రపంచ పెట్టుబడుల కూడలిగా భారత్‌కుగల ప్రాధాన్యాన్ని ఈ పరిణామాలన్నీ పునరుద్ఘాటిస్తున్నాయి. చురుకైన విధాన చట్రం, వర్ధమాన వ్యాపారావరణ వ్యవస్థ, భారత ఆర్థిక పునరుత్థాన శక్తిపై అంతర్జాతీయంగా పెరుగుతున్న విశ్వాసం ఇందుకు మూలకారణాలు.

 

****


(రిలీజ్ ఐడి: 2131851) సందర్శకుల సూచీ సంఖ్య : : 285
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Malayalam , English , Urdu , हिन्दी