గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సమాచార-గణాంక వినియోగదారుల సమావేశం


దేశంలోని అసంఘటిత... ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి లక్ష్యాలపై సాలోచనల ఆదానప్రదానానికి ప్రాధాన్యం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2025 8:35PM by PIB Hyderabad

కేంద్ర గ‌ణాంక‌-కార్య‌క్ర‌మ‌ అమ‌లు మంత్రిత్వ‌శాఖ‌ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) ఇవాళ హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బి) సహకారంతో ఆ సంస్థ ప్రాంగణంలో సమాచార-గణాంక వినియోగదారుల (డేటా యూజర్స్‌) మహాసభను  నిర్వహించింది. సమాచార సేకరణదారులు-సృష్టికర్తలు (డేటా ప్రొడ్యూసర్స్‌), డేటా యూజర్స్‌ మధ్య ఆదానప్రదాన విస్తృతి లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల ఆవిష్కరించిన ‘అసంఘటిత రంగ సంస్థలపై వార్షిక సర్వే-2023-24’ (ఎఎస్‌యుఎస్‌ఇ), ‘ప్రైవేటు రంగంలో పెట్టుబడి లక్ష్యాలతో మూలధన వ్యయం (కేపెక్స్‌)పై భవిష్యత్‌ దృక్పథ సర్వే’ల మీద ఉభయ పక్షాల నడుమ చర్చలు సాగాయి.

ఈ మహాసభలో పరిశోధకులు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు, వాణిజ్య సంస్థలు, విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ సంస్థలు-వాటి ప్రతినిధులు, ప్రముఖ విద్యా-మీడియా సంస్థల ప్రతినిధులు సహా 200 మందికిపైగా పాల్గొన్నారు. వీరితోపాటు ఆయా రంగాల నిపుణులు, జాతీయ గణాంక కమిషన్ (ఎన్‌ఎస్‌సి) సభ్యులు కూడా హాజరయ్యారు.

ఈ మహాసభకు కేంద్ర గ‌ణాంక‌-కార్య‌క్ర‌మ‌ అమ‌లు మంత్రిత్వ‌శాఖ‌ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా- తమ శాఖ కీలక దృక్పథమైన ‘అభివృద్ధి కోసం డేటా’ అంశాన్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. జాతీయంగా, అంతర్జాతీయంగానూ అతిపెద్ద ప్రాథమిక సమాచార-గణాంక సేకరణ కర్తగా తమ శాఖ కీలక పాత్రను విశదీకరించారు. సర్వేనమూనా పరిమాణం సాధారణంగా 1 నుండి 5 లక్షల యూనిట్ల మధ్య ఉంటుందని ఆయన చెప్పారు. ‘గ్రామీణ-పట్టణ ప్రాంతాల నెలవారీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’, ‘భవిష్యత్ ప్రైవేట్ రంగ పెట్టుబడి ధోరణులపై సాలోచనల ప్రదానం’, ‘సేవా రంగ సంస్థలపై వార్షిక పైలట్ సర్వే’ వంటి అనేక ఆవిష్కరణలను శ్రీ గార్గ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నవీకృత పోర్టల్‌ ద్వారా సమాచార విస్తరణ బలోపేతంపై మంత్రిత్వశాఖ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. సౌలభ్యం మెరుగుదల, ‘ఎపిఐ’లు, విజువలైజేషన్లు, వినియోగదారు హిత సూక్ష్మ సమాచార ఉపకరణాలు వంటివి ఈ పోర్టల్‌లో భాగంగా ఉంటాయన్నారు. అలాగే పరిశోధన సంస్థలతో సహకారం, క్రియాశీల ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్, రాష్ట్ర స్థాయి గణాంక వ్యవస్థల మెరుగుదలకు కృషి, ముఖ్యంగా ‘డిడిపి’, పారిశ్రామిక పనితీరు సూచీల వంటి ఆర్థిక కార్యకలాపాలపై మరింత సూక్ష్మ, జిల్లాస్థాయి సమాచారం తదితరాల గురించి ఆయన ప్రముఖంగా వివరించారు.

మహాసభలో కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్‌ వి.అనంతర నాగేశ్వరన్‌ ప్రధానోపన్యాసం చేశారు. అతిసూక్ష్మ స్థాయి సమాచార సేకరణను విస్తృతం చేయడంపై మంత్రిత్వశాఖ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సూక్ష్మ సమాచారం ద్వారానే విధాన సంస్కరణలపై నమ్మకం నిలకడగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘ఎఎస్‌యుఎస్‌ఇ’, ‘కేపెక్స్‌’ పెట్టుబడి సర్వేలపై ఇటీవలి నివేదికలు ప్రాతిపదికగా స్థూల ఆర్థిక సూచీలపై సాలోచనల గురించి ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు సర్వేలు సంయుక్తంగా భారత ప్రైవేట్ రంగ కార్యకలాపాల వాస్తవికతను విస్తృతంగా ప్రతిబింబించాయని తెలిపారు. ముఖ్యంగా, సూక్ష్మ డేటాకుగల వ్యూహాత్మక విలువను స్పష్టం చేస్తూ- “ఆకాంక్షిత విధాన మార్పు దిశగా అవకాశాలు ఇనుమడించాలంటే దేశం నుంచి రాష్ట్రాలదాకా... జిల్లాల నుంచి సమితుల వరకూ వీలైనంత మేర సూక్ష్మస్థాయిలో సామాజిక-ఆర్థిక ధోరణులపై నిరంతరం దృష్టి సారించాలి” అన్నారు. పరిపాలన సంబంధిత విభిన్న సమాచార నిధు (డేటాసెట్‌)లను (ఉదా॥ జిఎస్‌టి, ఎంసిఎ21) ఏకీకృతం చేయడంతోపాటు జిల్లా-నిర్దిష్ట సాలోచనల సృష్టి కోసం ఏఐ ఉపకరణాల వినియోగంపై మంత్రిత్వశాఖ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

ఈ మహాసభ నిర్వహణలో మంత్రిత్వశాఖ సహకారానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ మదన్ ఎం.పిల్లుట్ల తన ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ తరహా డేటా యూజర్‌ మహాసభలను తరచూ నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.  సమాచార సేకరణ ప్రాధాన్యం, క్రమబద్ధ విధానం, విశ్వసనీయత సంప్రదాయం వంటి అంశాలను ఆయన వివరించారు. పరిశోధన, సమాచారం, సామర్థ్య వికాసం, పరస్పర పరిశీలన-ధ్రువీకరణ (క్రాస్-వాలిడేషన్) ప్రాముఖ్యాన్ని కూడా తన ప్రసంగంలో స్పష్టం చేశారు. విద్యా-పరిశోధన సంస్థల మధ్య అవినాభావ సంబంధం ఉందని, భవిష్యత్తులో వాటి మధ్య సహకారం మరింత విస్తృతం కాగలదని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ పిల్లుట్ల తన ప్రసంగం ముగించారు.

మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీమతి గీతాసింగ్‌ రాథోర్‌ మాట్లాడుతూ-  డేటా వినియోగదారులు-డేటా మధ్య అంతరం తగ్గింపులో ఈ మహాసభ ప్రాధాన్యాన్ని వివరించారు. అలాగే ‘ఎఎస్‌యుఎస్‌ఇ’, ‘కేపెక్స్‌’ డేటా ప్రాముఖ్యం, ఉపయోగాలను సంక్షిప్తంగా, స్పష్టంగా తెలియజెప్పారు.

‘ఎఎస్‌యుఎస్‌ఇ’ సమాచారావరణ వ్యవస్థను నడిపించడంపై దృష్టి సారించిన తొలి ప్రెజెంటేషన్‌తో సాంకేతిక చర్చా గోష్ఠులు ప్రారంభం కాగా, ఈ కీలక ప్రసంగాలు అందుకు తగిన వేదికను సమకూర్చాయి. అంతేగాక త్రైమాసిక, జిల్లా స్థాయి అంచనాలకు వీలు కల్పించే నవీకృత 2023–24 నమూనా రూపకల్పనను ప్రముఖంగా ప్రస్తావించాయి. “ఉద్దేశం నుంచి సాలోచన దాకా: ప్రైవేట్ కేపెక్స్‌ పై ‘ఎన్‌ఎస్‌ఒ’ కొత్త సర్వే” మీద ఇచ్చిన రెండో ప్రెజెంటేషన్ వివిధ అంశాలపై దృష్టి సారించింది. ఈ మేరకు వర్ధమాన పెట్టుబడి సముదాయాల గుర్తింపు, పారిశ్రామిక విధానం, పెట్టుబడి ప్రణాళిక, ఉపాధి వ్యూహాలకు మార్గనిర్దేశం తదితరాల దిశగా భవిష్యత్‌ దార్శనిక సర్వేల ప్రాధాన్యాన్ని వివరించింది. భారత సమాచార-గణాంక నేపథ్యం ఆధునికీకరణలో కీలక ముందడుగుకు ఇదొక సూచిక. ఇక ‘ఎంఎస్‌ఎంఇ’ రంగానికి సంబంధించి ‘ఎఎస్‌యుఎస్‌ఇ’ 2023–24 సమాచార వినియోగంపై మూడో ప్రెజెంటేషన్ దృష్టి సారించింది.

డాక్టర్ అశ్విని ఛత్రే (ఐఎస్‌బి) ఈ చర్చాగోష్ఠులకు సంధానకర్తగా వ్యవహరించగా- శ్రీ ధర్మకీర్తి జోషి (క్రిసిల్‌), డాక్టర్ ఎం.సురేష్ బాబు (ఎంఐడిఎస్‌), ప్రొఫెసర్ రిషి కుమార్ (బిట్స్‌ పిలాని), ప్రొఫెసర్ సి.వీరమణి (సిడిఎస్‌), డాక్టర్ పల్లవి చౌదరి (ఎన్‌సిఎఇఆర్‌) ఇందులో పాల్గొన్నారు.  విధానం, పరిశోధన, అంచనాల విషయంలో కేపెక్స్‌ డేటాకు పెరుగుతున్న విలువ ఈ బృంద చర్చలో ప్రముఖంగా ముందుకు వచ్చింది. ‘జిఎఫ్‌సిఎఫ్‌’కు కుటుంబాలు ప్రధాన భాగస్వాములుగా రూపొందుతున్న నేపథ్యంలో కేపెక్స్‌ వృద్ధి బలంగానే ఉన్నప్పటికీ కార్పొరేట్ సామర్థ్యం వినియోగ లేమిని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మైక్రోడేటా సౌలభ్యం మెరుగుదల, ప్రామాణిక మెటాడేటా, బలమైన రాష్ట్రస్థాయి గణాంక వ్యవస్థల అవసరాన్ని ఈ బృందం స్పష్టం చేసింది.

డేటా యూజర్స్ కాన్ఫరెన్స్ నిర్దేశిత ముఖ్యాంశాలు:

‘ఎఎస్‌యుఎస్‌ఇ’ డేటాబేస్‌ను మరింత మెరుగుపరచేందుకు వ్యక్తిగత, భాగస్వామ్య వ్యాపార సంస్థల మనుగడ కాలాన్ని నమోదు చేయాలి. వివరాల నమోదు ప్రక్రియను మరింత బలోపేతం చేయడం కోసం వ్యక్తులు అసంఘటిత రంగంలో ఎందుకు వ్యాపారం ప్రారంభించారన్న సమాచారం స్వీకరించాలి.

మైక్రోడేటా సౌలభ్యం మరింత పెరగాలి... మెటాడేటా ప్రామాణీకరణ మెరుగుదలతోపాటు రాష్ట్రస్థాయిలో సంస్థాగత సామర్థ్య వికాసానికి ప్రాధాన్యం ఉండాలి.

వికసిత భారత్‌-2047 సంకల్పానికి అనుగుణంగా ఎఫ్‌డిఐ, ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ విలువ శ్రేణులలో భాగస్వామ్యం తదితరాలపై సమాచారాన్ని జోడించడం కోసం ‘ఎఎస్‌యుఎస్‌ఇ’, కేపెక్స్‌ డేటాబేస్‌లను మరింత విస్తరించాలి.

వాణిజ్య సంస్థల నమోదు (రిజిస్ట్రేషన్‌) శాతాన్ని పెంచాలి. వ్యాపారాల అధికారికీకరణ, ఆర్థిక సార్వజనీనతకు మద్దతివ్వడం కోసం ముద్రా వంటి రుణ సౌలభ్య పథకాల వినియోగం-ప్రభావాల పర్యవేక్షణ అవసరం.

తదుపరి కేపెక్స్‌ సర్వేలో బయోమాస్, సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులలో పెట్టుబడి లక్ష్యాలపై ప్రత్యేక ప్రశ్నలను చేర్చాలి.

దేశంలో అధికారిక గణాంకాల నాణ్యత, సమగ్రత, వినియోగ సామర్థ్యం కొనసాగింపు-మరింత ముందంజ దిశగా మంత్రిత్వశాఖ, ఐఎస్‌బి, డేటా యూజర్ల సమష్టి బాధ్యతను ఈ మహాసభ పునరుద్ఘాటించింది. చివరగా... సహకార విస్తృతి, సాంకేతిక ప్రగతి అనుసరణ, నిదర్శనాధారిత విధాన రూపకల్పనలో డేటా కేంద్రకంగా ఉండేలా చూసుకోవాలని మహాసభ పిలుపునిచ్చింది.

సర్వే నివేదికలు, భవిష్యత్‌ గణాంక ఆవిష్కరణలపై మరిన్ని వివరాల కోసం, మంత్రిత్వశాఖ (ఎంఒఎస్‌పిఐ) అధికారిక వెబ్‌సైట్‌ www.mospi.gov.in.ను సందర్శించండి

 

****


(రిలీజ్ ఐడి: 2131850) సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी