భారత ఎన్నికల సంఘం
చట్టపరమైన విధాన బలోపేతం, మెరుగైన దిశానిర్దేశం కోసం న్యాయవాదులు, సీఈఓలతో జాతీయ సదస్సు నిర్వహించిన ఈసీఐ
Posted On:
24 MAY 2025 8:49PM by PIB Hyderabad
భారత ఎన్నికల కమిషన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో న్యూఢిల్లీలోని ఐఐఐడీఈఎమ్‌లో నిర్వహించిన జాతీయ సదస్సును ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్.. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ప్రారంభించారు. భారత సుప్రీంకోర్టు సహా దేశవ్యాప్తంగా గల 28 హైకోర్టుల నుంచి సీనియర్ న్యాయవాదులు, అధికారులు, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 36 మంది సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమన్వయం సాధించడం ద్వారా కొత్త సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధానాన్ని బలోపేతం చేస్తూ, మెరుగైన దిశానిర్దేశం చేసే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో వ్యవహరించేందుకూ, సమస్యల్ని విని, తగినన్ని అవకాశాలను అందించడం గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
రోజంతా జరిగిన ఈ సమావేశం ఎన్నికల కమిషన్ - ప్రముఖ న్యాయ నిపుణుల మధ్య నిర్మాణాత్మక చర్చలకు, పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి చక్కని వేదికగా నిలిచింది. అందుబాటులో గల చట్టపరమైన వనరులను దేశంలో నిరంతరం మెరుగవుతున్న ఎన్నికల వ్యవస్థను న్యాయశాస్త్రానికి అనుగుణంగా ఉండేలా చేసేందుకు ఎన్నికల కమిషన్ వేసిన కీలక ముందడుగును ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సూచిస్తుంది. ఎన్నికల చట్టం, న్యాయపరమైన చర్యలు, చట్టపరమైన సంస్కరణలకు సంబంధించిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, సంసిద్ధత, సామర్థ్యం, సమన్వయాన్ని మెరుగుపరచడంపై ఈ చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయి. ఈ సదస్సు నిర్వహణ ద్వారా, వివిధ న్యాయ వేదికలలో తమ చట్టపరమైన ప్రాతినిధ్య ప్రభావాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నించింది.
ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని ఐఐఐడీఈఎమ్‌లో శుక్రవారం ప్రధాన ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈసీఐ చేపట్టే ఐటీ వినియోగం కోసం ప్రణాళికను రూపొందించడం, దానిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఈసీఐ సంబంధిత వ్యక్తులందరి కోసం.. అవసరమైన చట్టపరమైన నిబంధనల పరిధిలో, సంబంధిత డేటా మొత్తం ఒకే వేదిక ద్వారా అందుబాటులో ఉంచే లక్ష్యంతో కమిషన్ ఇప్పటికే 2025లోనే ఈసీఐఎన్ఈటీ అనే ఇంటిగ్రేటెడ్ డాష్‌బోర్డుని రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ప్రయత్నం ద్వారా ఈసీఐ తన ఐసీటీ వినియోగాలన్నింటినీ ఒకే గొడుగు కింద ఏకీకృతం చేయనుంది.
***
(Release ID: 2131123)