వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దుబాయ్‌లో ఐఐఎఫ్‌టీ తొలి విదేశీ కార్యాలయం


* ప్రపంచ స్థాయిలో కార్యకలాపాల విస్తరణకు సూచిక

Posted On: 16 MAY 2025 1:41PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖలో భాగంగా ఉన్న సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఇండియన్ ఫారిన్ ట్రేడ్ ఇనిస్టిట్యూట్ (ఐఐఎఫ్‌టీ) విదేశాల్లో తన తొలి ప్రాంగణాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలో ఐఐఎఫ్‌టీ ఉనికిని విస్తరించే దిశగా వేసిన ఓ కీలక అడుగును సూచిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ వ్యాపార విద్యా రంగంలో సైతం భారత్ భాగస్వామ్యం బలోపేతం కానుంది.  
విదేశీ వ్యవహారాల శాఖ, హోం మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం (యూజీసీ).. ఇవి నిరభ్యంతర ధ్రువపత్రాలను మంజూరు చేయడం, విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని తెలపడంతో ఈ చరిత్రాత్మక పరిణామం ఆవిష్కారమైంది. ఇది భారతదేశ ఉన్నత విద్య ప్రపంచీకరణ ప్రక్రియలో ఓ గౌరవాన్విత ఘట్టాన్ని సూచించడం ఒక్కటే కాకుండా, భారతీయ సంస్థలను అంతర్జాతీయీకరించాలని, ప్రపంచంలో అధ్యయనం ద్వారా ప్రాప్తించే జ్ఞాన కూడళ్లను (లెర్నింగ్ హబ్స్) నెలకొల్పాలంటున్న జాతీయ విద్య విధానం (ఎన్ఈపీ) 2020 దార్శనికతకు అనుగుణంగా కూడా ఉంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యసాధనపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఐఐఎఫ్‌టీని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది జాతీయ విద్యావిధానం-2020 స్ఫూర్తికి అద్దం పడుతోంది. భారతీయ విద్య అంతర్జాతీయ స్థాయికి చేరుకొంటూ ఉండటంలో ఓ కొత్త అధ్యాయం మొదలవనుంది. ప్రపంచం అంతటా నాయకత్వాన్ని పెంచి పోషించడంలో భారతీయ విద్యా రంగం పాత్ర నానాటికీ పెరుగుతోందనడానికి ఇది ఒక నిదర్శనం. భారత్-యూఏఈ భాగస్వామ్యం దృఢతరం అవుతోందనడానికి కూడా ఇది ఒక ప్రమాణం. ఈ కొత్త క్యాంపస్ భావితరం వాణిజ్య ప్రముఖులను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది’’ అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు చొరవ తీసుకుంటున్నందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్‌వాల్ ఐఐఎఫ్‌టీని అభినందించారు. దుబాయ్‌లో ఒక పూర్తి స్థాయి ప్రాంగణాన్ని ఐఐఎఫ్‌టీ ఏర్పాటు చేయనుండడం 62 సంవత్సరాల ఐఐఎఫ్‌టీ చరిత్రలోనే ఒక మేలిమలుపంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ శ్రేణి విద్యను అందించడంలో, ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపార రంగంలో అడుగు పెడుతున్న దేశంగా భారత్ ఎదుగుదలను ప్రకటిస్తోంది అని ఆయన అభివర్ణించారు. ఈ సంస్థ దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొంటూ తన విద్యాసంబంధ ప్రయత్నాలకు, పరిశోధన సంబంధ ప్రయత్నాలకు అదేపనిగా మెరుగులు పెట్టుకొంటోందని, దీంతో ఎగుమతులకు గొప్ప ప్రోత్సాహం దక్కనుందని శ్రీ సునీల్ ప్రశంసించారు.

ఐఐఎఫ్‌టీ ప్రపంచ స్థాయి సంస్థగా మార్చడంతో పాటు, కొత్తగా ఏర్పాటు చేయబోయే దుబాయ్ క్యాంపస్ ద్వారా అంతర్జాతీయ వ్యాపార రంగంలో పరిశోధన, శిక్షణ విభాగాల్లో రాణించాలి.. ఇందుకోసం నేను కట్టుబడి ఉన్నాను అని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాకేశ్ మోహన్ జోషీ పునరుద్ఘాటించారు.  ఐఐఎఫ్‌టీ దుబాయ్ ప్రాంగణం ప్రతిపాదన కార్యరూపాన్ని దాల్చడంలో నిరంతర మద్దతును తెలుపుతూ వచ్చిన వాణిజ్య శాఖకు, విద్యాశాఖకు, హోం శాఖకు, విదేశీ వ్యవహారాల శాఖకు, యూఏఈలో భారతీయ దౌత్య కార్యాలయానికి, యూజీసీతో పాటు ఇతరులందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్య, పరిశోధన.. ఈ రెండు రంగాల్లో శ్రేష్ఠత్వాన్ని సాధిస్తూ విద్య, ఆర్థిక దౌత్యం రంగాల్లో భారత్‌ దూసుకుపోయేటట్లు ఐఐఎఫ్‌టీ కృతనిశ్చయాన్ని కనబరుస్తుందని కూడా ఆయన ప్రధానంగా చెప్పారు.
 
త్వరలో ఏర్పాటు కాబోయే దుబాయ్ ప్రాంగణం యూఏఈతో భారత్ విద్యారంగ సహకారం గాఢతరం అవుతూ ఉండడాన్ని ప్రతిబింబిస్తోంది.  భారతీయ విలువలను, అంతర్జాతీయ దృక్పథాన్ని కలబోసుకొనే ప్రపంచ వాణిజ్య నేతలను తీర్చిదిద్దడంలో కూడా ఈ క్యాంపస్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా నిలవబోతోంది. ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న భారత ప్రవాసి సముదాయం అవసరాలను, ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడంతోపాటు గల్ఫ్ ప్రాంతంలో భారత విద్య పాదముద్రను విస్తరించనుంది కూడా.
దుబాయ్‌లో క్యాంపసును మొదలుపెట్టడంతో, భారతీయ విద్య వారసత్వాన్ని కొత్త సీమలకు తీసుకుపోవడానికి ఐఐఎఫ్‌టీ నడుం కట్టింది. రాబోయే కాలంలో అంతర్జాతీయ వ్యాపారం, వాణిజ్యాల రూపురేఖలను తీర్చిదిద్దే నాయకులకు ఇకపై ఐఐఎఫ్‌టీ శిక్షణనివ్వనుంది.‌



 

***


(Release ID: 2129308)