సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కుటుంబ తరహా వినోద వేదిక... వేవ్స్ ఓటీటీ
దూరదర్శన్ పనాజీ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సునీల్ భాటియా
Posted On:
08 MAY 2025 7:56PM
|
Location:
PIB Hyderabad
డిజిటల్ మాధ్యమంలో ఒకే గొడుగు కింద కుటుంబ తరహా వినోదాన్నీ, అంతకు మించిన అనేక కార్యక్రమాలను అందించే ఓటీటీ వేదిక ‘వేవ్స్’ అని దూరదర్శన్ పనాజీ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సునీల్ భాటియా అన్నారు. ఆయన గురువారం (మే 8న) దూరదర్శన్ పనాజీ కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
భాటియా మాట్లాడుతూ... ‘‘వేవ్స్ ఒక డిజిటల్ గొడుగు కింద టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాలు, ఆన్-డిమాండ్ వీడియోలు, డిజిటల్ రేడియోలతోపాటు ఇ-కామర్స్.. ఇలా బహుముఖ కంటెంటును సమకూరుస్తుంది. యాండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలు రెండిటిలోనూ అందుబాటులో ఉన్న ఈ వేదికను కుటుంబంలో సభ్యులందరికీ వినోదం, విద్య, ఆన్‌లైన్ షాపింగ్‌లకు వన్-స్టాప్ డిజిటల్ కూడలి (హబ్)గా మలిచారు. అన్ని వర్గాల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ వేదిక ఉద్దేశం సాంస్కృతికంగా సంపన్నమైన భారత్ వారసత్వాన్ని అందరికీ అందించడమే’’ అన్నారు.
ప్రసార భారతి కిందటేడాది నవంబరులో ప్రారంభించిన ఈ వేదికలో... 12 భాషల్లో విస్తృతస్థాయిలో కంటెంటు లభ్యమవుతోంది. ఏమైనా, త్వరలో ఈ కంటెంటును కొంకణి సహా దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారని శ్రీ భాటియా తెలిపారు.
వేవ్స్ వేదికలో గోవాకు స్థానం లభించిన విషయమై శ్రీ భాటియా ప్రస్తావిస్తూ, డీడీ (దూరదర్శన్) పనాజీలో కొంకణీ భాషకు చెందిన కంటెంటు లభ్యమవుతోందన్నారు. గోవాకు చెందిన మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టు కెప్టెన్ శ్రీ బ్రహ్మానంద్ సంఖ్‌వాల్‌కర్ జీవనం గురించి ‘‘ఫేమస్‌లీ ఫౌండ్ @15’’ డీడీ పనాజీ రూపొందించిన ఒక డాక్యుమెంటరీ కూడా వేవ్స్ వేదికలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. 40 నిమిషాల పాటు సాగే ఈ డాక్యుమెంటరీలో శ్రీ సంఖ్‌వాల్‌కర్ 25 సంవత్సరాల కెరియర్‌ను వివరిస్తుంది. శ్రీ సంఖ్‌వాల్‌కర్ తనకు పదిహేను ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు.
వేవ్స్... 70కి పైగా లైవ్ టీవీ చానల్స్‌ను అందిస్తోంది. ఇందులో దూరదర్శన్, ఆకాశవాణి చానళ్లు, బి4యూ, ఎస్ఏబీ గ్రూపు, 9ఎక్స్ మీడియాల వంటి ప్రధాన వినోద నెట్‌వర్కులు భాగంగా ఉన్నాయి. వీటికి తోడు, ఎక్కువమంది ఆదరించిన పది ఆన్-డిమాండ్ కంటెంటు కూడా అందుబాటులో ఉంది. ఓఎన్డీసీతో ఏకీకరించిన కారణంగా వేవ్స్ యాప్ మాధ్యమంలో నేరుగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు కూడా వీలు ఉంది.
రేడియో స్ట్రీమింగ్, వీడియో-ఆన్-డిమాండ్, ప్లే-టు-ప్లే గేమింగ్, యువతకు ప్రత్యేకించిన కంటెంటు, విభాగాల వారీ భద్రంగా సేకరించి పెట్టిన సినిమాలు, లైవ్ ఈవెంట్లు తదితర కార్యక్రమాలు ఈ మాధ్యమాన్ని ఒక అద్వితీయ, సపరివార ప్యాకేజీగా నిలబెడుతున్నాయి.
వేవ్స్‌లో చాలా వరకు కంటెంటు ఉచితంగా లభిస్తోంది. ప్రీమియం ఫీచర్లను సైతం చౌకైన సభ్యత్వ ప్లాన్లతో అందుకోవచ్చు.
విలేకరుల సమావేశంలో డీడీ పనాజీ డిప్యూటీ డైరెక్టర్ (న్యూస్) శ్రీ శశిన్ రాయ్, డీడీ పనాజీ కార్యక్రమాల విభాగం సారథి శ్రీ సవియో డీ నొరోన్హా కూడా పాల్గొన్నారు.
***
Release ID:
(Release ID: 2127877)
| Visitor Counter:
2