ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 7.85 కోట్ల విలువైన జీఎస్‌టీ ఐటీసీ మోసాన్ని ఛేదించిన ఢిల్లీ సౌత్ సీజీఎస్‌టీ అధికారులు చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్టు


వాస్తవంగా వస్తువులు-సేవల సరఫరా లేకుండానే సర్క్యులర్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న 31 జీఎస్‌టీఐన్‌ల కోర్ గ్రూప్‌తో 80కి పైగా జీఎస్‌టీఐన్‌లు దుర్వినియోగమైనట్లు విచారణలో వెల్లడి

Posted On: 08 MAY 2025 5:26PM by PIB Hyderabad

వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) మోసాల గురించి సీజీఎస్‌టీ ఢిల్లీ సౌత్ కమిషనరేట్ నిర్వహించిన సోదాల్లో, దక్షిణ ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన (సుమారు) రూ. 7.85 కోట్ల విలువైన మోసపూరిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌ల భారీ మోసం వెలుగుచూసింది.
దర్యాప్తులో భాగంగా, చార్టర్డ్ అకౌంటెంట్ ఇమెయిల్ ఐడీలు, కాంటాక్ట్ నంబర్‌లకు అనుసంధానమై ఉన్న, ప్రధానంగా పాలం/ద్వారక ప్రాంతంలోని 80కి పైగా జీఎస్‌టీఐన్‌లు (వస్తువులు-సేవల పన్ను గుర్తింపు సంఖ్యలు) దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి వస్తువులు-సేవల సరఫరా లేకుండా సర్క్యులర్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న 31 జీఎస్‌టీఐన్‌ల కోర్ గ్రూప్‌ను అధికారులు కనుగొన్నారు.
12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, అనేక సంస్థలు ఉనికిలోనే లేవని తేలింది. సోదాల సందర్భంగా దర్యాప్తునకు సంబంధించిన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేశారు. జీఎస్‌టీ దాఖలు కోసం చార్టర్డ్ అకౌంటెంట్‌పై పూర్తిగా ఆధారపడుతున్నామని తెలిపిన పలువురు పన్నుచెల్లింపుదారులు, తమ లాగిన్ ఆధారాల వివరాలు, దాఖలు ప్రక్రియ అంతా ఆయనే చూసుకుంటున్నారని అంగీకరించారు.
నిందితులు చేసిన నేరాలు సీజీఎస్‌టీ చట్టం, 2017 లోని సెక్షన్ 132(1)(b), 132(1)(c) కిందకు వస్తాయి, ఇది సెక్షన్ 132(5) ప్రకారం విచారణార్హమైన, నాన్-బెయిలబుల్ నేరం, అలాగే చట్టంలోని సెక్షన్ 132(1)(i) ప్రకారం శిక్షార్హమైనది. దీని ప్రకారం, సంబంధిత చార్టర్డ్ అకౌంటెంట్‌ను సీజీఎస్‌టీ చట్టం, 2017 లోని సెక్షన్ 69(1) కింద అరెస్టు చేసి, ఈనెల 7వ తేదీన విధుల్లో ఉన్న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు, న్యాయమూర్తి ఈనెల 21వరకు 14 రోజుల రిమాండ్ విధించడంతో సదరు చార్టర్డ్ అకౌంటెంట్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
వంచన, ఆధారాల దుర్వినియోగం, కుట్రపూరితంగా సర్క్యులర్ ట్రేడింగ్ నిర్వహించడం ద్వారా జీఎస్‌టీ ఫ్రేమ్‌వర్క్‌ విషయంలో వ్యవస్థాగత దుర్వినియోగాన్ని ఈ కేసు వెల్లడించింది. ఈ మోసాన్ని గురించిన పూర్తి స్థాయి వివరాలను వెలికితీసేందుకు, అనర్హమైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లబ్ధిదారులందరినీ గుర్తించడానికి సీజీఎస్‌టీ చట్టం, 2017 కింద దర్యాప్తు కొనసాగుతోంది.

 

***


(Release ID: 2127835)