శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో పశువుల రవాణాను సులభతరం చేసే సరికొత్త స్మార్ట్ బోను

Posted On: 08 MAY 2025 5:32PM by PIB Hyderabad

విభిన్న రకాల వాహనాలకు తగిన విధంగా అమర్చుకొనేలా అభివృద్ధి చేసిన సరికొత్త స్మార్ట్ పశువుల బోనును పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి బిగించిన ర్యాంపు తలుపుగా కూడా పనిచేస్తుంది. గ్రామాల్లో జంతువులను సులభంగా రవాణా చేయడానికి ముఖ్యంగా పాడి పశువులను మార్కెట్‌కు తరలించేందుకు తోడ్పడుడుతుంది.

భారత్‌లో గ్రామాల్లో రైతుల జీవితంలో పశువులు ముఖ్యమైన భాగం. ఒక చోటు నుంచి మరో చోటుకి వాటిని తరలించడం పశువులతో పాటు, ప్రజలకూ ప్రమాదకరమే.

సాధారణంగా పశువులను సౌకర్యవంతంగా ఉండని, తెరిచి ఉంచిన, సరైన లోడింగ్ వ్యవస్థ లేని ట్రక్కుల్లో రవాణా చేస్తుంటారు. దీని వల్ల పశువులు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. వాటికి గాయాలవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ పాత రవాణా పద్ధతులు రైతులకు, ట్రాన్స్‌పోర్టర్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. అదే సమయంలో జంతువుల ప్రాథమిక సంక్షేమ నిబంధనలను ఉల్లంఘిస్తాయి.

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చి సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ సందీప్ ఎస్.పాటిల్ చేపట్టిన ఆవిష్కరణకు ఈ పరిస్థితులను మార్చే సామర్థ్యం ఉంది.  

ప్రొఫెసర్ సందీప్ ఆధ్వర్యంలోని బృందం పశువులను సురక్షితంగా, సులభంగా, చౌకగా తరలించే బోనును అభివృద్ధి చేసింది. డీఎస్‌టీ-సీడ్ (సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్, డెవలప్మెంట్) ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు అందాయి.


 

image.png

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చి సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ సందీప్ ఎస్. పాటిల్, అతని బృందం


ఇది కేవలం బోను మాత్రమే కాదు, టెలిస్కోపిక్ మెకానిజం, మడతపెట్టడానికి వీలుగా ఉండే ర్యాంపులు, దృఢమైన మెటల్ ఫ్రేమ్‌లతో రూపొందించిన సైన్స్ ఆధారిత రవాణా పరిష్కారం. పశువులను తరలించే సమయంలో గాయాలు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు వాటిని వాహనంలోకి ఎక్కించడం, దించడం లాంటి ప్రక్రియలను సులభతరం చేసేందుకు దీనిని రూపొందించారు.

టెలిస్కోపిక్ స్లైడింగ్ సౌకర్యం ఉన్న ఈ బోనును వాహనం సైజుకి తగినట్లుగా మార్చుకోవచ్చు. దీనిలో ఏర్పాటు చేసిన రోలర్ ద్వారా దీనిని వాహనంలో సులువుగా అమర్చుకోవచ్చు. మడత పెట్టుకోవడానికి వీలున్న ర్యాంపు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు అనువుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ర్యాంపును తలుపుగా బిగించవచ్చు. పశువులకు గాలి ప్రసరించేలా దృఢమైన క్రాస్-లింక్ మెష్‌ను బిగించారు. క్షేత్ర స్థాయి సర్వేలు, రైతుల అభిప్రాయాలతో పాటు కాంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ)తో పరీక్షించి గాలి ప్రసరణ సరిగా ఉండేలా ఏర్పాటు చేశారు.

రవాణా సమయంలో జంతువులకు అయ్యే గాయాలు, ఒత్తిడిని ఈ బోను తగ్గిస్తుంది. అలాగే సన్నకారు రైతులకు పశువుల తరలింపును సులభతరం చేస్తుంది. ఇది చౌకైనది, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. అలాగే జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా ఉంటుంది. ఫలితంగా జంతువులను తరలించే సమయంలో ట్రాన్స్‌పోర్టర్లకు ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందులను తగ్గిస్తుంది. భారీ, హెవీ లోడ్ వాహనాలకు తగినట్టుగా రెండు అంతస్థుల ఆకృతిలో ఉన్న బోనును సైతం అమర్చుకోవచ్చు.

image.png
 వినియోగదారులు  ఇచ్చిన సూచనలకు అనుగుణంగా పశువులను వాహనంలోకి ఎక్కించేందుకు, దించేందుకు సర్దుబాటు చేసుకోగలిగిన ర్యాంపుతో కూడిన మాడ్యులర్ కేజ్

దీన్ని డైరీలు, గోశాలలు, పశువైద్య కార్యకలాపాల్లోనూ.. స్వల్ప దూరాలకు పశువులను తరలించేందుకు ఉపయోగించవచ్చు. తద్వారా నష్టాలను తగ్గించి శ్రమను ఆదా చేయవచ్చు. అలాగే మానవీయ రవాణా విధానాలను ప్రోత్సహించవచ్చు.

పేటెంట్లు, అకడమిక్ పబ్లికేషన్లలో ఈ డిజైన్‌కు గుర్తింపు లభించింది. మాడ్యులర్, డబుల్ –స్టోరీ రకాలకు 2024లో రెండు భారతీయ పేటెంట్లు లభించాయి.

నాసిక్‌లోని అంబద్ గ్రామంలో ఈ ట్రాన్స్‌పోర్ట్ కేజ్‌ను పరీక్షించారు. సీఎస్ఆర్ నిధులు, విస్తృత అమలు ప్రయత్నాల ద్వారా ఈ ప్రాజెక్టును విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

***


(Release ID: 2127834) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Tamil