పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లోని కోటా, ఒడిశాలోని పూరీలో విమానాశ్రయాల నిర్మాణానికి
కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు సూత్రప్రాయ ఆమోదం
Posted On:
05 MAY 2025 9:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ దేశ ప్రజలకు వాయు మార్గ సంధానాన్ని పటిష్ఠపరచడానికి కట్టుబడి ఉంది. ఈ దిశగా మరో అడుగు వేస్తూ, రాజస్థాన్లో కోటా, ఒడిశాలో పూరీ నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు పౌర విమానయానశాఖ మంత్రి శ్రీ రామ్మోహన్‌నాయుడు కింజరాపు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేశారు.
కోటాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉంది. లోక్సభ స్పీకరు, కోటా-బూందీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఓమ్ బిర్లా తీవ్ర ప్రయత్నాలతో ఇది సిద్ధించింది. పౌర విమానయానశాఖతో సంప్రదింపుల ఫలితంగా దీనికి త్వరిత గతిన ఆమోదం లభించింది.
ప్రతిపాదిత విమానాశ్రయం విద్య, పారిశ్రామిక కూడలిగా ఉన్న కోటా నగరానికి సేవలను అందించడం ఒక్కటే కాకుండా, జనాభాతోపాటే ఆర్థిక కార్యకలాపాలు కూడా వృద్ధి చెందుతున్న హాడౌతీ ప్రాంతం అవసరాల్ని కూడా తీరుస్తుంది. ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధాన గమ్యస్థానంగా కోటా మారుతుంది.
ఈ నిర్ణయం రాజస్థాన్‌లోని కోటాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఓ ప్రధాన ఘట్టానికి నాందీ ప్రస్తావనే కాకుండా, విమాన యానాన్ని మన దేశంలో ప్రతి ఒక్కరి అందుబాటులోకీ తీసుకు రావాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా కూడా ఉంది.
పూరీ మన దేశంలో అత్యంత తీర్థయాత్రా స్థలాల్లో ఒకటి. పూరీ జగన్నాథుడు కొలువైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షలాది భక్తులు పూరీకి తరలివస్తారు. పూరీలో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ధార్మిక పర్యటనకూ, ప్రాంతీయ అభివృద్ధికీ, ఈ ప్రాంత సమగ్ర అనుసంధానానికీ ఉపయోగపడుతుంది.
ఈ విమానాశ్రయం పూరీకి, దేశంలో ప్రధాన మహానగరాలకు మధ్య నేరుగా అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నిర్ణయం పూరీతోపాటు ఒడిశాకూ ఒక మహత్తర ఘట్టమే. ఇది వాయు మార్గ సంధానాన్ని విస్తరిస్తూ పోవాలన్న, విమాన ప్రయాణాన్ని అందరి అందుబాటులోకి తీసుకు రావాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంది.
***
(Release ID: 2127225)
Visitor Counter : 14